PV Ramesh Resigns: పివి రమేష్ రాజీనామా చేశారా? మేఘా సంస్థ తొలగించిందా?

పివి రమేష్ సీనియర్ ఐఏఎస్ అధికారి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆర్థిక విభాగంలో కీలక అధికారిగా వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సర్కార్లో సైతం కీలక పాత్ర పోషించారు.

Written By: Dharma, Updated On : September 12, 2023 3:08 pm

PV Ramesh Resigns

Follow us on

PV Ramesh Resigns: మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మెఘా ఇంజనీరింగ్ కంపెనీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఇటీవల ఆయన రాజకీయంగా సంచలనాలకు కారణమయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు పై బాహటంగానే ఆయన మాట్లాడారు. ఈటీవీ కి ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అటు చంద్రబాబు పై పెట్టిన కేసులు.. తాను అప్రూవర్ గా మారానంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పుకొట్టారు. సోమవారం ఈటీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత.. మీడియా సమావేశంలో మాట్లాడుతానని ప్రకటించారు. కానీ ఆయన ఇప్పటికీ సలహాదారుగా ఉన్న మెఘా ఇంజనీరింగ్ కంపెనీ నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆయన రాజీనామా చేయలేదని.. మెఘా ఇంజనీరింగ్ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించిందని ప్రచారం జరుగుతోంది.

పివి రమేష్ సీనియర్ ఐఏఎస్ అధికారి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆర్థిక విభాగంలో కీలక అధికారిగా వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సర్కార్లో సైతం కీలక పాత్ర పోషించారు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పివి రమేష్ జగన్ సర్కార్ కు సేవలు అందించారు. ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమించింది. కరోనా సమయంలో కీలకంగా పని చేశారు. కానీ ఎందుకో ఆయన పదవీ కాలాన్ని పొడిగించలేదు.

నిన్నటి వరకు ఆయన మెఘా ఇంజనీరింగ్ కంపెనీలో సలహాదారుగా ఉండేవారు.ఇటీవల టిడిపి అనుకూల మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో.. నాడు ఆర్థిక శాఖలో కీలక అధికారిగా ఉన్న పీవీ రమేష్ మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబును ఎలా అరెస్టు చేశారని ప్రశ్నించారు. కనీస నిబంధనలు పాటించలేదని.. తాను ఇచ్చిన వాంగ్మూలం తోనే చంద్రబాబును అరెస్టు చేశామనడం సరికాదన్నారు. తన వాంగ్మూలాన్ని సిఐడి అనుకూలంగా వాడు కుందని అనుమానం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు అరెస్ట్ సరికాదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఎండి, డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఉండగా చంద్రబాబును ఎలా అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఇది పెను దుమారానికి దారితీసింది. సంబంధిత మెఘా ఇంజనీరింగ్ కంపెనీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు రమేష్ ప్రకటించారు.

మెఘా ఇంజనీరింగ్ కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. ఆ సంస్థకే రివర్స్ టెండర్లలో పోలవరం ప్రాజెక్టుతో సహా అనేక ప్రాజెక్టులు దక్కాయి. మెగా యాజమాన్యానికి ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే ఆ సంస్థలో ఉంటూ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో తన వాదన వినిపించడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నట్లు రమేష్ చెబుతున్నారు. కానీ మెఘా సంస్థ రమేష్ ను పదవి నుంచి తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పివి రమేష్ మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలను వెల్లడించుకున్నట్లు సమాచారం.