‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. మునుపెన్నడూ లేని రీతిలో సినీ ఇండస్ట్రీ విషయంలో.. సాయిధరమ్ యాక్సిడెంట్ విషయంలో రాద్ధాంతం చేసిన వారి బట్టలిప్పి బజారు నిలబెట్టేలా మాట్లాడారు. అటు జగన్ సర్కార్ ను, ఇటు సాయితేజ్ విషయంలో ‘మీడియా’ చేసిన అతిని ఏకిపారేశాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్ నటించిన మూవీ ‘రిపబ్లిక్’. ఆ మూవీని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో మూవీ ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఆస్పత్రిలో ఇంకా కోమాలోనే ఉన్న సాయిధరమ్ తేజ్ ఈ సినీ వేడుకకు హాజరు కాలేదు. హీరో లేకున్నా ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.. మేనల్లుడి ఫంక్షన్ కు హాజరై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సినీ పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న జగన్ సర్కార్ పై సంచలన విమర్శలు చేశారు. తన మేనల్లుడు యాక్సిడెంట్ లో గాయపడితే పుంకానుపుంకానుగా కథనాలు రాసిన మీడియాను ఏకిపారేశారు.

రిపబ్లిక్ మూవీ ప్రమోషన్ కాస్తా ఏపీలోని జగన్ సర్కార్ పై , మీడియాపై పవన్ తీవ్ర వ్యాఖ్యలతో ఉద్రిక్తంగా మారిపోయింది. పవన్ పంచులతో రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ వేదిక ఊగిపోయింది. ముఖ్యంగా జగన్ సర్కార్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘నా పేరు చెప్పి సినిమా పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నారు. ప్రైవేటు పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వ పెత్తనమేంటి? చిత్రపరిశ్రమపై కన్నెత్తి చూస్తే వైసీపీ నేతలు కాలిపోతారు. సినిమా పరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.
ఇక సాయిధరమ్ తేజ్ విషయంలో మీడియా, వైసీపీ నేతల విమర్శలపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ‘సాయిధరమ్ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నారని.. కళ్లు తెరవలేదని ’ చెప్పారు. సాయితేజ్ ఆస్పత్రిలోనే ఉన్నందువల్లే ఈ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు.
అతివేగమే సాయితేజ్ ప్రమాదానికి కారణమని మీడియాలో, వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంపై వివాదాస్పదంగా మాట్లాడారని చెప్పుకొచ్చాడు.. ‘‘ఆటోను దాటే క్రమంలో ఇసుకపై జారిపడి సాయితేజ్ కిందపడ్డాడు. కేవలం 40 కి.మీల వేగంతోనే వెళుతూ పడ్డాడు. అయినా సాయితేజ్ పై అవాకులు చెవాకులు పేల్చారు. సాయితేజ్ కర్మఖాలి కిందపడ్డాడు. ఇలా విమర్శల పాలయ్యాడు.. సినిమాలో చెప్పిన విలువలు నిజజీవితంలో ఆచరించడం కష్టం.. సాయితేజ్ ను ఇంత అభాసుపాలు చేసిన వాళ్లు మిగతా విషయాలపై ఎందుకు స్పందించరని పవన్ ప్రశ్నించారు..
‘‘వైఎస్ వివేకా ఎందుకు హత్యకు గురయ్యారు? వివేకా హత్య గురించి మీడియా మాట్లాడాలి.. కోడికత్తి తో ఒక నాయకుడిని పొడిచారు. ఆ కేసు ఏమైంది? తేజ్ ప్రమాదం కంటే వివేకా హత్య ప్రధానం కాదా? మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’’ అని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఏపీలోని జగన్ సర్కార్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. సాయితేజ్ ప్రమాదం విషయంలో అతిచేసిన మీడియా తీరును చీల్చిచెండాడాడు.
ఇలా సాయితేజ్ ప్రమాదంపై రచ్చ చేసినా మీడియాను.. విమర్శించిన వారిని.. ఆఖరుకు తన వల్ల సినీ పరిశ్రమను టికెట్లు, రిలీజ్ లు, ఇతర విషయాల్లో ఇబ్బంది పెడుతున్న జగన్ సర్కార్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
- పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోను కింద చూడొచ్చు..ః
https://www.youtube.com/watch?v=sM4j2sqbApY