Homeజాతీయ వార్తలుకేసీఆర్ కు బండి సంజయ్ డెడ్ లైన్

కేసీఆర్ కు బండి సంజయ్ డెడ్ లైన్

-దీపావళి లోపు నోటిఫికేషన్లు ఇస్తే సరి…
-లేనిపక్షంలో హైదరాబాద్ లో నిరుద్యోగులతో మిలియన్ -మార్చ్ నిర్వహించి తీరుతం
-మిలియన్ మార్చ్ తో టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం
-రాష్ట్రంలో ఇక ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరిన సంజయ్
-టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఆఖరి పోరాటానికి సిద్ధమైందని ప్రకటించిన బండి

Bandi Sanjay

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. రాబోయే దీపావళి పండుగ నాటికి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటికీ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగ యువతతో హైదరాబాద్ ‘మిలియన్ మార్చ్’ నిర్వహించి బీజేపీ సత్తా ఏమిటో చూపుతామని హెచ్చరించారు. ఇకపై ఉద్యోగాలు రాలేదని రాష్ట్రంలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరిన బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆఖరి పోరాటం చేసేందుకు బీజేపీ సిద్ధమైందని తెలిపారు. మిలియన్ మార్చ్ తో టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. తెలంగాణలో మార్పు కోసం చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మహా సంగ్రామ యాత్రగా మారిందని పేర్కొన్న బండి సంజయ్ అవినీతి, నియంత, కుటుంబ, మూర్ఖపు పాలనను కూకటి వేళ్లతో పెకిలించి వేసేందుకు మహోద్యమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఈరోజు (25.9.2021) జరిగిన బహిరంగ సభలో వేలాది మంది ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. సినీ నటి విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ తదితరులు హాజరైన ఈ సభలో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….

• ఉద్యోగాలు రాని యువత బైంసా నుండి వచ్చి పాదయాత్రలో కదం తొక్కిండ్రు. వారందరికీ నా అభినందనలు. నిరుద్యోగుల బాధలను చూస్తే బాధేస్తోంది. ఈరోజు నిరుద్యోగుల కదం తొక్కిన తీరును చూస్తుంటే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్పిస్తోంది.
• కేసీఆర్ ఢిల్లీ పోయిండు. కోతలు ఇక షురూ చేస్తడు జాగ్రత్త. మొన్న వరి వేస్తే ఉరే అన్నడు. కేంద్రం కొంట లేదన్నడు. నరేంద్ర మోదీగారి వద్ద ఈ విషయాన్న ఎందుకు అడగలేదు?
• ప్రపంచమంతా మోడీ మోడీ అంటున్నరు…..దేశమంతా యోగి యోగి అంటున్నరు. తెలంగాణ అంతా రోగి రోగి అని నినదిస్తోంది.
• ఉప ఎన్నికలొస్తున్నయంటే…రేపే ఉద్యోగాల నోటిఫికేషన్ అని హామీలిస్తడు. ఎన్నికలయ్యాక పోయి కేసీఆర్ ఫాంహౌజ్ ల పడుకుంటడు. హుజూరాబాద్ లో కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయం.
• ఇక్కడ ఉద్యోగాల్లేక దుబాయి పోయి యువత పడుతున్న బాధలు వర్ణణాతీతం. నిన్న గల్ఫ్ బాధిత కుటుంబాలు వచ్చి వారి బాధలు చెబుతుంటే కన్నీళ్లొచ్చినయ్. గల్ఫ్ పోయేందుకు ఉన్న ఆస్తిని అమ్ముకుని, అప్పులు చేసి..అక్కడ ఉద్యోగాల్లేక ఎటూ పాలుపోక రాలేని దుస్థితి. తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తయనుకున్నం….కానీ రాలేదు.
• రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాల ఖాళీలున్నయ్. టీఎస్పీఎస్సీ ప్రకారమే 25 లక్షల మంది నిరుద్యోగులున్నరు. ఎంప్లాయ్ మెంట్
• దీపావళి వరకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి. లేనిపక్షంలో నిరుద్యోగ యువతతో మిలియన్ మార్చ్ నిర్వహిస్తా. బీజేపీ నిర్వహించే మిలియన్ మార్చ్ తో మీ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. ఇదే చివరి పోరాటం కావాలి. ఇదే చివరి యుద్దం కావాలే తప్ప ఇక బలిదానాలు అవసరం లేదు.
• కమిషన్ ల మీద దృష్టి తప్ప నోటిఫికేషన్ ల మీద ఎందుకు లేదు? బంగారు తెలంగాణ కాదు బతుకుదెరువు తెలంగాణ కావాలి. మీ ఇంటికే ఉద్యోగాలా? నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వద్దా? జాబ్ కేలండర్ ను వెంటనే విడుదల చేయాలి.
• క్లబ్ లు, పబ్ ల మీద ఉన్న ధ్యాస జాబ్ ల మీద ఎందుకు లేదు. నిరుద్యోగ భృతి ఇస్తారా లేక 2023 తరువాత మీకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి వస్తది. ఇంటికో ఉద్యోగం హామీ ఏమైంది? లక్ష ఉద్యోగాల హామీ ఏమైంది? టీ హబ్ ద్వారా ఇచ్చిన ఉద్యోగాల కంటే రాష్ట్రంలో పబ్ లు ఎక్కువ తెరిచారు.
• ఏడేళ్లలో ఒక్క డి ఎస్సి లేదు. ఒక్క గ్రూప్ 1, గ్రూప్ 3, 4 నోటిఫికేషన్లు లేవు. బీసీ, ఎస్సి, ఎస్టీ నోటిఫికేషన్ ల పై శ్వేతపత్రం విడుదల చేయాలి. కమీషన్ల కోసం 70 వేల జి ఓ లను మాయం చేస్తరు. కానీ ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క జీవో కూడా ఇవ్వరు.
• దొంగ దీక్షలు తీసుకుని తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప వ్యక్తులు నా తెలంగాణ యువత. శ్రీకాంత్ చారి, పోలీస్ కిష్టన్న, యాదగిరి, సునీల్ నాయక్ సహా ఎందరో తెలంగాణ రాష్ట్రం వస్తే యువతకు ఉద్యోగాలొస్తాయని బలిదానం చేసుకున్నరు.
• తెలంగాణ వచ్చాక కూడా యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం స్పందించని సిగ్గులేని ముఖ్యమంత్రి కేసీఆర్. డిగ్రీలు, పీజీలు చేసి ఇంకా ఛాయ్ అమ్ముతున్నరు. కూలీ పనులు చేసుకోవాల్సిన దుస్థితి.
• ఇంటికో ఉద్యోగం ఏమైంది? డీఎస్సీ ఏమైంది? విద్యావలంటీర్లను తొలగించిండ్రు. 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిండ్రు. విద్యా వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తున్నరు. విద్యా వలంటీర్లను కోరుట్లలో స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ నియమిస్తే….సంబంధిత ఎంఈవో, ప్రధానోపాధ్యాయులను కేసీఆర్ సస్పెండ్ చేసిండ్రు. వాళ్లు చేసిన తప్పేమిటి? తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలి. లేనిపక్షంలో బీజేపీ తడాఖా చూపిస్తాం.
• రైతు బంధు ఇచ్చి రైతులకు అన్ని సబ్సిడీలు బంద్ చేసిన మూర్ఖపు సీఎం కేసీఆర్. కేంద్ర నిధులను దారి మళ్లిస్తూ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నడు.
• తెలంగాణలో పేదల కోసం బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టింది. ప్రజలు ఎక్కడికి వెళ్లినా బాధలు చెప్పుకుంటున్నరు. కేసీఆర్ నిర్లక్ష్య వ్యాఖ్యలవల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. మిడ్ మానేరు బాధితులకు పరిహారం అందక ఆత్మహత్య చేసుకుంటున్నరు.
• ఇక ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలంగాణలో మార్పు కోసం, అవినీతి, మూర్ఖత్వపు, కుటుంబ పాలనను కూకటి వేళ్లతో తరిమికొట్టడానికే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టింది. మీకు అండగా బీజేపీ ఉంది. మీరెవరూ బాధపడకండి. మీ కోసం ఎంతవరకైనా పోరాడతాం.
• వేములవాడ రాజన్న ఆలయ అభివ్రుద్దికి రూ.100 కోట్లు ఇస్తామని ఇవ్వకుండా రాజన్నకే శఠగోపం పెట్టిన ఘనుడు కేసీఆర్.
• ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చే వరకు, నిరుద్యోగ భ్రుతి ఇచ్చే వరకు బీజేపీ పోరాడుతుంది. ఉద్యమాన్ని ఉద్రుతంగా చేసి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం ఖాయం. గొల్లకొండపై కాషాయా జెండాను రెపరెపలాడించడం ఖాయం.

అంకిరెడ్డిపల్లె బహిరంగ సభలో నేతల ప్రసంగాలు….

బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్ :
• తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయి. బతుకులు బాగుపడతాయనుకున్నాం. 1400 మందికిపైగా యువత ఆత్మలు ఘోషిస్తున్నయ్. మూర్ఖపు సీఎం కేసీఆర్ ను గద్దె దించడం బండి సంజయ్ తోనే సాధ్యం. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
• బీజేపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. తెలంగాణకు ముందు 2.3 శాతం ఉన్న నిరుద్యోగం…ఇప్పుడు 8 శాతం దాటింది. నిరుద్యోగ భ్రుతి ఇస్తామని మాట తప్పిన కేసీఆర్ ప్రతి నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.లక్ష ఇవ్వాల్సిందే. ఈ విషయంలో కేసీఆర్ మెడలొంచేదాకా మేం విశ్రమించబోం. ఉద్యోగాలతోపాటు మాకు ధర్మం కూడా ముఖ్యం. ధర్మానికి అడ్డొచ్చే వారిని చూస్తూ ఊరుకోబోం.

మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ :
• ఇది సంగ్రామ యాత్ర. వాడ వాడ తిరుగుతూ మహా సంగ్రామ యాత్రగా మారింది. తెలంగాణ లో నీళ్లు-నిధులు-నియామకాల కోసం ఉద్యమిస్తున్న బండి సంజయ్ కు సంఘీభావం తెలుపుతుండటం సంతోషం.

మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి :
• ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి సమస్యలు చెబుతుండటం సంతోషంగా ఉంది. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా సంజయ్ పాదయాత్ర చేస్తూ బండి ముందుకు వెళుతుంటే…..కేసీఆర్ కారు వెనక్కుపోతోంది.
• కేసీఆర్ ను ప్రశ్నిస్తే తట్టుకోలేరు. జైల్లో పెడతారు. కేసులు పెడతారు. తెలంగాణ ప్రజల హక్కుల రెక్కలను కేసీఆర్ విరిచేస్తున్నారు. బీజేపీ చేపట్టిన పాదయాత్రతో ప్రజల్లో ఆశలు మొదలయ్యాయి. బీజేపీ అండగా ఉందని వస్తున్నారు.
• బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ నేతలు విమర్శించడం సిగ్గు చేటు. కేసీఆర్ ఎలాగూ తిరగరు. ఫాంహౌజ్ కే పరిమితమయ్యారు. కనీసం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ను అభినందించడం పోయి విమర్శిస్తారా?
• మహిళల కాన్పుసహా శిశువులకు అవసరమైన సాయాన్ని కేంద్రమే చేస్తోంది. మహిళలకు శిక్షణ, ఉపాధి కోసం కేంద్రం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. శిక్షణా కాలంలో రూ.7,500లు మహిళలకు వేతనం అందిస్తున్న ఘనత కేంద్రానిదే. మహిళా ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేస్తూ కేంద్రం ప్రోత్సహిస్తోంది.
• యువత ఉపాధి కోసం కేంద్రం ప్రత్యేక నిధులిస్తోంది. చిరు వ్యాపారాలు చేసుకునేందుకు ఎలాంటి తనఖా లేకుండా ఆర్దిక సాయం చేస్తోంది. పేదలకు స్థలం ఉంటే ఇల్లు కూడా నిర్మిస్తున్న ఘనత కేంద్రానిదే.
• రోగమొస్తే ప్రతి ఒక్కరికీ చికిత్స కోసం రూ.5 లక్షల వరకు వ్యయాన్ని కేంద్రమే భరించేలా ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని అమలు చేస్తోంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఈ పథకాన్ని పక్కనపెట్టి పేదల ఉసురు తీస్తున్నారు.
• టీఆర్ఎస్ ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు. దళితులకు మూడెకరాలు, ఇంటికో ఉద్యోగం, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ సహా అన్నీ హామీలను గాలికొదిలేసిన కేసీఆర్ ను ఎందుకు ఉపేక్షించాలి? కేసీఆర్…సిగ్గుందా? తెలంగాణ ఉద్యమంలో 1400 మంది ప్రాణ త్యాగాలు చేస్తే ఆ కుటుంబాలకు ఏం చేశావ్.
• కేసీఆర్ కు త్యాగాలు చేసిన వారికంటే…డబ్బులిచ్చే వాళ్లపైనే మక్కువ ఎక్కువ. నీళ్లలోనుండి నిధులు…నిధుల్లోనుండి కుటుంబాలకు నియామకాలిస్తూ సంబురం చేసుకుంటున్నడు.
• ఏడేళ్లయింది…ఇంకెప్పుడిస్తారు ఉద్యోగాలు? వయసు మీద పడ్డాక ఉద్యోగాలెవరిస్తారు? యువకులారా…మీలో పౌరుషం లేదా? రోశం లేదా? …ఎందుకు ఉద్యమాలు చేయడం లేదు? కేసీఆర్ కు భయపడుతున్నారా? మరెక్కడ పోయింది మీ పౌరుషం? పక్కోడు మోసం చేస్తేనే ఉద్యమించిన మనం…మనోడు దగా చేస్తే పాతరేయకుండా ఏం చేస్తున్నారు?
• రైతన్నలూ…ఆత్మహత్యలు పరిష్కారం కాదు…సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమించాలి. కేసీఆర్ పై తిరగబడాలి. యువత, రైతులు తల్చుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. ఉద్యమించేందుకు యువత ముందుకు రావాలి.
• బ్యూటిఫుల్ తెలంగాణ….నేడు బూతుల, తాగుడు తెలంగాణగా మారింది. నేటి యువతను తాగుబోతులను చేసి పడుకోబెడుతూ భవిష్యత్ ను నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా మించేందేమీ లేదు. కేసీఆర్ పై తిరగబడండి. బీజేపీ జెండాను రెపరెపలాడించండి.
బహిరంగ సభకు హాజరైన నేతలు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కమార్, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్, పాదయాత్ర సహ ప్రముఖ్ లు లంకల దీపక్ రెడ్డి, వీరేందర్ గౌడ్, జిల్లా ఇంఛార్జీ మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాకాంత్, ఎర్రం మహేశ్, శంకర్, నర్సింహ, వెంకట్, రాజిరెడ్డి, గోపీ, సుభాష్, బండ మల్లేశం
===================

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular