Congress: 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీ ఎవరో ముంచరు.. వాళ్లకు వాళ్లే ముంచుకుంటారన్న ఓ నానుడి రాజకీయాల్లో ఉంది. అంతకుమించిన వృద్ధ జంబూకాలతో నేడు ఎదురీదుతోంది.. సీనియర్లే గుదిబండగా మారి పోయిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు. సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు పగ్గాలివ్వాలని డిమాండ్ చేస్తూ ఏకంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవినే రాహుల్ త్యజించాడు. అయినా కాంగ్రెస్ రాత మారలేదు. సీనియర్లను వదల్లేదు. అయితే ఇప్పుడిప్పుడే యువతకు పగ్గాలిచ్చే పనిని రాహుల్ చేపట్టారు. సీనియర్లకు మంగళం పాడి యువతకే అవకాశాలిస్తున్నాడు. పంజాబ్ సీఎం మార్పు.. తెలంగాణ పీసీసీగా రేవంత్.. కేరళ కాంగ్రెస్ ప్రక్షాళన సహా రాహుల్ తన మార్క్ చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో అసలేం జరుగుతోందన్న చర్చ ప్రస్తుతం సాగుతోంది..

దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ జోరందుకుంటోంది. పదేళ్ల క్రితం వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా దేశంలో పాలించింది. ఇప్పుడు ఆపార్టీ కునారిల్లుతోంది. దీంతో కాంగ్రెస్ ను మళ్లీ లేపడం కోసం దారులు కడుతున్నారు. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నవారు… రాజకీయాల్లో రాటుదేలిన వారు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మోదీ ప్రభుత్వాన్ని ఓడించాలనే లక్ష్యంగా ఆ పార్టీ సైతం చేరికలను ప్రోత్సహిస్తోంది. అయితే ఇటీవల ఆ పార్టీ నాయకుుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తిని రేపుతున్నారు. రాహుల్ గాంధీలో చాలా మార్పులు వచ్చాయని, ఆయనలోని నాయకత్వల లక్షణాలు ఇప్పుడే బయటపడుతున్నాయని అంటున్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడు కాకపోయినా అదే స్థాయిలో పార్టీని మెరుగుపరుస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
గత జూలై 16న రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు రాహుల్ గాంధీ నిజం చేస్తున్నారని అంటున్నారు. ‘భయపడేవాళ్లకు కాంగ్రెస్ పార్టీలో చోటు లేదు. ఇలాంటి వారు నిరభ్యంతరంగా కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవచ్చు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నమ్మే వ్యక్తులు మాకవసరం లేదు.’ అని రాహుల్ అన్నారు. అయితే ఆ సమయంలో ఈ వ్యాఖ్యలు ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే రాహుల్ చెబుతున్న మాటలను చాలా రోజులుగా ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పుడు ఆయన మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా నిరూపిస్తున్నారని అంటున్నారు.
ఇటీవల ఆయన పార్టీలో కొందరిని తన రాజకీయ నాలెడ్జ్ తో చేర్చుకున్నారు. అంటే మోదీకి వ్యతిరేకంగా ఉన్నవారినే ఆహ్వానిస్తున్నారు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కీలక నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు. సీపీఐ నాయకుడు కన్హయ్య, ఇండిపెండెట్ ఎమ్మెల్యే జిగ్నేష్ ఇటీవల రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇక పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిద్దూ కూడా తాను రాహుల్, ప్రియాంక గాంధీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. ఇదిలా ఉండగా గత నెలలో సచిన్ ఫైలట్ తో మూడుసార్లు రాహుల్ సమావేశమయ్యారు. అలాగే ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ లతో సమస్య పరిష్కారానికి రాహుల్ కృషి చేశాడు.
గత కొంత కాలంలో కాంగ్రెస్ నాయకత్వ లేమితో బాధపడుతోందని సీనియర్ నాయకుడు కబిల్ సిబల్ వంటి నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ వీరి వ్యాఖ్యలకు విరుద్ధంగా రాహుల్ తనదైన ముద్ర వేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో రెండు రకాల మనుషులున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. విధేయతతో ఉండేవారు, ఎన్నికల్లో గెలవని వారు ఉన్నారు. దీంతో రాహుల్ బయటి వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. పార్టీలో కొత్త వ్యక్తులు వస్తే బలం పెరుగుతుందని నిర్ణయించుకున్నారు. అందుకే బీజేపీపై వ్యతిరేకంగా ఉన్నవారిని ఏదోరకంగా పార్టీలోకి చేర్చుకుంటున్నారు.
కొత్త తరాన్ని ప్రోత్సహించడమే రాహుల్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన పంజాబ్ లో అమరీందర్ సింగ్ ను తొలగించడంలో ఏమాత్రం ఆలోచించలేదని అర్థమవుతోంది. తెలంగాణ , కేరళ కాంగ్రెస్ లకు యువ నేతలను నియమించారు. సీనియర్లు వ్యతిరేకించినా వెనక్కి తగ్గలేదు. కానీ ఇదే సమయంలో కొత్తవారు వచ్చినట్లే వచ్చి.. ఆ తరువాత ఇతర పార్టీలోకి జారుకుంటున్నారు. వీరి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే అసలు సమయంలో తీవ్ర దెబ్బపడే అవకాశం ఉందని అంటున్నారు.
రాహుల్ గాంధీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు చూశాక.. ఆయనను కొంతమంది ఇందిరాగాంధీతో పోలుస్తున్నారు. అయితే ఇందిరాగాంధీ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న సమయంలో ఆమె అధికారంలో ఉంది. కానీ రాహుల్ అలా లేడు. అందువల్ల ఇందిరతో రాహుల్ సరితూగలేడని అంటున్నారు. ఏదీ ఏమైనా రాహుల్ పార్టీకి కొత్త ఊపు ఇస్తున్నాడనడంలో సంకోచం లేదని అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఏవిధంగా బయటపడుతుందో చూడాలి.