PM Modi Speech On Independence Day: ఏమా ప్రసంగం.. నెహ్రూను మించిపోయిన మోదీ

2014లో ప్రధాని మోదీ నేతృత్యంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. నాడు ఎర్రకోటపై తొలిసారిగా జాతీయ జెండా ఎగురవేసిన మోదీ 65 నిమిషాల పాటు ప్రసంగించారు.

Written By: Dharma, Updated On : August 15, 2023 4:58 pm

PM Modi Speech On Independence Day

Follow us on

PM Modi Speech On Independence Day: ప్రధాని నరేంద్రమోదీ సరికొత్త రికార్డును సృష్టించారు. చారిత్రక ఎర్రకోట నుంచి వరుసగా పదేళ్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా ఖ్యాతికెక్కారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. సుమారు 90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడి అబ్బురపరిచారు. ఆకట్టుకునే ప్రసంగం చేసి దేశ ప్రజల మనసును దోచుకున్నారు. సరికొత్త రికార్డును సృష్టించారు. ఎప్పటి వరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పదిసార్లు మోదీ ప్రసంగించారు. సగటున 82 నిమిషాల పాటు ఆయన ప్రసంగం ఉండగా… ఇతర ప్రధానలతో పోల్చుకుంటే అది ఎక్కువ కావడం విశేషం.

2014లో ప్రధాని మోదీ నేతృత్యంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. నాడు ఎర్రకోటపై తొలిసారిగా జాతీయ జెండా ఎగురవేసిన మోదీ 65 నిమిషాల పాటు ప్రసంగించారు. 2015 లో 86 నిమిషాలు,2016లో 96 నిమిషాలు, 2017లో 56 నిమిషాలు, 2018లో 83 నిమిషాలు ప్రసంగించారు. 2019లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2019 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ 92 నిమిషాల పాటు ప్రసంగించారు. 2020లో 90 నిమిషాలు, 2021లో 88 నిమిషాలు, గత ఏడాది వేడుకల్లో 74 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ ఏడాది మళ్లీ 90 నిమిషాల పాటు అద్భుత ప్రసంగం చేశారు.

స్వాతంత్ర అనంతరం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన జవహర్ లాల్ నెహ్రూ.. తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 24 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రధానిగా ఎక్కువసార్లు పంద్రాగస్టు వేడుకల్లో ప్రసంగించింది నెహ్రూనే. మొత్తం 17 సార్లు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 16 సార్లు పంద్రాగస్టు వేడుకల్లో ప్రసంగించారు. 1972లో సుదీర్ఘంగా 54 నిమిషాల పాటు మాట్లాడారు. ఇక మాజీ ప్రధాని ఇంద్ర కుమార్ గుజ్రాల్ కేవలం ఒకే ఒక్కసారి ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగించారు. 71 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రధాని మోదీ తర్వాత రెండో అత్యధిక సగటు ప్రసంగ సమయం ఈయనదే. అటు తర్వాత మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్ అటల్ బిహారీ వాజ్పేయి స్వల్ప ప్రసంగాలు మాత్రమే చేయగలిగారు.

దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాతే నవభారత నిర్మాణం జరుగుతోందని ప్రధాని ప్రకటించారు. ఇది మోడీ ప్రభుత్వం అని.. ఆత్మ నిర్భార్ భారత్ కు ప్రతీక అని ప్రధాని పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాదు.. దానిని అనుకున్న సమయం కంటే ముందే చేధించడం తమకు తెలుసునని చెప్పుకొచ్చారు. జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం, వైవిధ్యం… అనే మూడు అంశాలకు దేశ ప్రజల కలలను సాకారం చేసే శక్తి ఉందని ప్రధాని మోడీ చెప్పారు. దేశ ఆర్థిక స్థితిగతులు, శాంతి భద్రతలు, సమకాలిన రాజకీయ అంశాలు తదితర వాటిపై ప్రధాని మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు. దేశ ప్రజల మదిని దోచుకున్నారు.