Prashant Kishor On Chandrababu: జగన్ ను ఓడించడానికి… ఓడించినోడినే పిలిపించిన చంద్రబాబు

గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పని చేశారు. జగన్ గెలుపులో కీలక భూమిక పోషించారు. కానీ ఇటీవల వ్యూహకర్త పదవి నుంచి తప్పుకున్నారు. రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు.

Written By: Dharma, Updated On : December 23, 2023 6:47 pm

Prashant Kishor On Chandrababu

Follow us on

Prashant Kishor On Chandrababu: ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలుసుకున్నారు. ఆయన నివాసానికి వచ్చి భేటీ కావడం సంచలనం గా మారింది. మరో రెండు మూడు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ ఈ అనూష పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాదు నుంచి నారా లోకేష్ తో కలిసి వచ్చిన ప్రశాంత్ కిషోర్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లి లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు.

గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పని చేశారు. జగన్ గెలుపులో కీలక భూమిక పోషించారు. కానీ ఇటీవల వ్యూహకర్త పదవి నుంచి తప్పుకున్నారు. రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో టిడిపికి ప్రశాంత్ కుమార్ పనిచేసే అవకాశం ఉందని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నివాసానికి పీకే వెళ్లడంతో ఈ ప్రచారం నిజమేనని తేలింది. అయితే ఇంతవరకు ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు భేటీ విషయం బయటకు రాలేదు. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై అటు వైసిపి, ఇటు టిడిపి వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

ఇటీవల లోకేష్ పాదయాత్ర ముగిసింది. ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు చంద్రబాబు ఇంట్లో ప్రత్యేక యాగాలు చేపడుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు ఇంటికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం టిడిపి రాజకీయ వ్యూహకర్తగా రాబిన్ శర్మ ఉన్నారు. ఆయన పూర్వాశ్రమంలో ప్రశాంత్ కిషోర్ బృందంలో పనిచేసేవారు. ఆయన స్థానంలో పీకే బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. కాగా చంద్రబాబుతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ ఏపీలోని రాజకీయ పరిస్థితులు, తాను చేసిన సర్వే నివేదికలు వివరించినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ద్వారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ ను కలిసినట్లు ప్రచారం జరిగింది. కానీ రాజకీయాల్లో బిజీగా ఉన్నానని.. ఎన్నికల సమయానికి తాను సేవలందిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే సరిగ్గా ఎన్నికల ముంగిట టిడిపి గెలుపు బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది.