Purchase of flats : ఫ్లాట్స్ ఫర్ సేల్ : వానాకాలంలో చూడండి.. ఎండాకాలంలో కొనండి..

‘వానాకాలంలో చూడండి.. ఎండాకాలంలో కొనండి’ అనే బోర్డును సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఇప్పుడు ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Written By: NARESH, Updated On : July 27, 2023 3:56 pm
Follow us on

Purchase of flats : ఆకలివేసినప్పుడే అన్నం తినాలి.. వానాకాలంలోనే ఫ్లాట్లను కొనాలి ఇప్పుడీ సెటైర్ బాగా పేలుతోంది. ఖాళీ ఫ్లాట్లను కొనేవారంతా ఇప్పుడు వానా కాలంలోనే కొనాలని అందరూ సూచిస్తున్నారు. ఎందుకంటే అప్పుడే కదా నువ్వు కొనే ఫ్లాట్ ముంపులో ఉందో? లేక మంచి స్థలంలో ఉందో అని సెటైర్లు వేస్తున్నారు.

ప్లాట్స్‌ ఫర్‌ సేల్‌… తెలంగాణలో ఏ జిల్లాలో చూసినా ఇలాంటి బోర్డులు వేలల్లో కనిపిస్తాయి. పత్రికలు, టీవీల్లో ప్రకటనలకు అయితే కొదవేలేదు. భూములపై పెట్టుబడి పెట్టేందుకు మధ్యతరగతి, సంపన్నులు ఆసక్తి చూపుతున్నారు. వేగంగా ఆదాయం పెరిగేందుకు చాలా మంది అప్పులు చేసి కూడా ప్లాట్లు, ఫాంల్యాండ్స్‌ కొంటున్నారు. దీంతో రియల్టర్లు.. ఖాళీ జాగా కనిపిస్తే చాలు ప్లాట్లుగా మార్చి అమ్మేస్తున్నారు. కాలువలు, నదులు, ముంపు ప్రాంతం అని చూడకుండా మట్టి, మొరం పోయించి చదును చేసి అమ్మేస్తున్నారు. అయితే ప్లాట్లు కొన్న వార్లు.. వర్షాకాలంలో పాట్లు పడుతున్నారు.

వేగంగా విస్తరిస్తున్న రియల్‌ రంగం..
తెలంగాణలో రియల్‌ఎస్టేట్‌ రంగం వేగంగా విస్తరిస్తోంది. కరోనా తర్వాత చాలా మంది చిన్నదైనా సరే సొంత ఇళ్లు ఉండాలని భావిస్తున్నారు. మరోవైపు వడ్డీలకు  అప్పులు ఇవ్వడం, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడం వలన పెద్దగా లాభాలు రావడం లేదు. దీంతో భూములపై పెట్టుబడి పెడితే.. రెండేళ్లలో రెట్టింపు ఆదాయం వస్తోంది. దీంతో చాలా మంది భూములపై పెట్టుబడి పెడుతున్నారు.

ఇదే అవకాశంగా..
ఇక భూములపై పెట్టుబడి పెట్టేవారు పెరుగుతుండడంతో రియల్టర్లు దీనిని అవకాశంగా మార్చుకుంటున్నారు. నేతలు, అధికారుల అండతో ప్రభుత్వ భూములు, కాలువలు, చెరువులు కబ్జా చేస్తున్నారు. ఖాళీ జాగాలను కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి ఎలాంటి లేఅవుట్‌ లేకుండానే అమ్మేస్తున్నారు. పైపై మెరుగులు చూసి సామాన్యులు మోసపోతున్నారు.

వర్షాకాలంలో చూడాలి..
ప్లాట్లు కొని ఇళ్లు కట్టుకున్నవారికి అసలు సమస్యలు వర్షాలకాలంలో మొదలవుతున్నాయి. భారీ వర్షాలకు వరద నీరు పోయే దారిలేక ఇళ్లను ముంచెత్తుతున్నాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునుగుతున్నాయి. ప్లాట్‌ ఎందుకు కొన్నామని బాధపడాల్సి వస్తోంది.

సూపర్‌ సెటైర్‌..
ఇలాంటి బాధలు ఎదుర్కొంటున్న వారు తమ సమస్యలను పరిష్కరించాలని పాలకులను వేడుకుంటున్నారు. కానీ ప్రభుత్వం క్రమబద్ధీకరణ పేరుతో అక్రమాన్ని సక్రమం చేసేస్తోంది. సమస్యలకు పరిష్కారం చూపడం లేదు. దీంతో ఓ ముంపు బాధితుడు తెలంగాణలో ప్లాట్లు కొనేవారు.. ‘వానాకాలంలో చూడండి.. ఎండాకాలంలో కొనండి’ అనే బోర్డును సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఇప్పుడు ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది.

స్పందిస్తున్న బాధితులు..
ఈ బోర్డు చూసి చాలా మంది స్పందిస్తున్నారు. ప్రభుత్వాన్ని, అనుమతులు ఇచ్చిన అధికారులను తిట్టిపోస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టి కొంటే.. బతకలేని పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఆదాయం కోసం చూస్తున్నాయి తప్ప ప్రజలు సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అనుమతులు ఇచ్చే విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలని కోరుతున్నారు.