Pawankalyan : జనసేనాని కీలక నిర్ణయం వెల్లడించనున్నారా? పొత్తులపై ప్రకటన చేయనున్నారా? ఇన్నాళ్లూ బీజేపీని ఒప్పిస్తానన్న ఆయన రూటు మార్చనున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పవన్ గురువారం ఏపీలోఅడుగు పెట్టనున్నారు. జనసేన రాష్ట్ర కార్యాలయంలో నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారోనన్న చర్చ లోతుగా సాగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ నుంచి ఆశించిన సంకేతాలు రాలేదు సరికదా.. వైసీపీకి అండగా బీజేపీ హైకమాండ్ అండగా నిలుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో పవన్ ఎలా స్పందిస్తారోనని అంతా వేచిచూస్తున్నారు.
గత ఎన్నికల తరువాత బీజేపీ, జనసేనల మధ్య స్నేహం చిగురించింది. వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడాలని ఒక కమిటీని సైతం ఏర్పాటుచేశాయి. అయితే రెండు పార్టీలు కలిసింది లేదు. వియ్యానికైనా.. కయ్యానికైనా కలిసిపోయింది లేదు. దీంతో బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నట్టు ప్రకటించారు. అటు తరువాత ప్రధాని మోదీని కలిశారు. మొన్నటికి మొన్న ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చారు. ఎన్నెన్నో చర్చించామని..బీజేపీ తమ వెంట కలిసి వస్తుందని నమ్మకం ప్రకటించారు. కానీ అనూహ్యంగా బీజేపీ యూటర్న్ అన్నట్టు ప్రవర్తిస్తోంది. ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి.. రాజకీయ అజెండాతో జగన్ అడిగిందే తడువు రూ.10వేల కోట్లు చేతిలో పెట్టింది. దీంతో బీజేపీ వ్యూహం ఏంటన్నది తేలిపోయింది. బీజేపీ తీరుపై పవన్ సైతం ఆగ్రహంగా ఉన్నారు.

రాష్ట్ర భవితను వైసీపీ అగమ్యగోచరంగా మార్చింది. ఈ సమయంలో నియంత్రించాల్సిన బీజేపీ వంత పాడుతుండడంపై పవన్ కు మింగుడు పడడం లేదు. బీజేపీ తనకు చెప్పింది ఏమిటి? చేస్తోంది ఏమిటి? అని పవన్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలవరం లేదు. పూర్తిచేయాలన్నతపన లేదు. అమరావతిని విధ్వంసం చేశారు. అచేతనం చేసి ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెట్టారు. పరిశ్రమలను వెళ్లగొడుతున్నారు. ప్రశ్నించే వారి గొంతునొక్కుతున్నారు. ఇలాంటి విషయాల్లో బీజేపీ ఏ మాత్రం జోక్యం చేసుకోకపోవడం ఒక ఎత్తయితే.. జగన్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వడం పవన్ ను పునరాలోచనలో పడేసింది.
అయితే చివరాఖరుకు పవన్ ఓ స్థిర నిర్ణయానికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ పొత్తుల విషయంలో బీజేపీని ఒప్పిస్తామని ఆయన చెబుతున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ ఇక జగన్ వెంటే ఉంటుందని.. ఆ పార్టీని కలుపుకుని వెళ్లడానికి బతిమాలాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చినట్లుగా జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి. గురువారం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడితే బీజేపీ తీరుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే పవన్ ఏపీ టూర్ పైనే అందరి దృష్టి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?