Pawan Kalyan Varahi Yatra: తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఏపీ సీఎం జగన్ పై ఆరోపణలున్నాయి. లక్ష కోట్లు లూఠీ చేశారని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. అయితే అక్రమ సంపాదనే కాదు తండ్రి హయాంలో వ్యవస్థలపైనే జగన్ ఉక్కుపాదం మోపారని జనసేనాని పవన్ ఆరోపిస్తున్నారు. అసలు జగన్ కు ఇంత సంపద ఎక్కడిదని ప్రశ్నించారు. న్యాయంగా సంపాదించింది కాదని.. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ఆర్జించారని ఆరోపణలు చేశారు. వారాహి యాత్రలో భాగంగా నరసాపురం బహిరంగ సభలో సీఎం జగన్ ను టార్గెట్ చేసుకుంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైఎస్ హయాంలో జగన్ వ్యవహార శైలిని గుర్తుచేశారు.
ప్రభాష్ లాంటి స్టార్ సినిమా తీస్తే ఐదారు వందల మందికి ఉపాధి దొరుకుతుందని.. ఆయన సంపాదించిన మొత్తంలో న్యాయంగా కొంత మొత్తం ప్రభుత్వానికి పన్నుల మొత్తంలో ఆదాయం సమకూరుతుందని పవన్ గుర్తుచేశారు. కానీ జగన్ మాత్రం ప్రభాష్ లా కష్టపడడం లేదు. అయినా ఈ అంతులేని సంపద ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇడుపాలపాయ, బెంగళూరులో చేసిన పంచాయితీలతో సంపాదించినదేనని ఆరోపించారు. ఆయన సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందని ఆరాతీస్తే ప్రతిఒక్కరికీ జగన్ బాగోతం తెలిసిపోతుందని పవన్ ఎద్దేవా చేశారు.
మానవ హక్కుల కార్యకర్తలు శోధించి రాసిన పుస్తకంలో జగన్ గురించి రాసిన విషయాలను ఈ సందర్భంగా పవన్ ప్రస్తావించారు. రాయలసీమలోని ఓ పోలీస్ స్టేషన్ లోనే ఎస్ఐ పై జగన్ చేయి చేసుకున్నారని ఆరోపించారు. పంచాయితీ చేసే క్రమంలో ఎస్ఐ పై దాడిచేసి అదే సెల్ లో వేసిన విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తి పోలీసుల శాల్యూట్ అందుకుంటుండడం సిగ్గుచేటన్నారు. అటువంటి వ్యక్తికి డీజీపీ లాంటి వ్యక్తి వత్తాసు పలుకుతుండడం బాధాకరమన్నారు. పంచాయితీలు చేసి వ్యవస్థలను నాశనం చేసిన వారు పాలకులుగా మారడం ఏపీ దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
మాటమాటకీ బటన్ నొక్కుతున్నానంటూ జగన్ చెబుతున్నారని.. అది మీ ఇంటి సంపద అని పవన్ ప్రశ్నించారు. అది ప్రజల చెమట చుక్కల నుంచి వచ్చినదని.. ప్రజలు కట్టిన పన్నులనే బటన్ నొక్కుడుతో ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సమాజంలో ఉన్న 30 మందికి ఇచ్చి..70 మందికి మొండి చేయి చూపుతున్నారని.. వారి నుంచి తిరుగుబాటు మొదలవుతుందని పవన్ హెచ్చరించారు. ప్రజావసరాలకు ఎందుకు బటన్ నొక్కడం లేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలన్నారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వస్తున్నదానినే పంచుతున్న విషయం గ్రహించాలన్నారు. ఏపీ వ్యాప్తంగా పులివెందుల రాజకీయాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని.. జనసేన ఉండగా అది జరిగే పనికాదని హెచ్చరించారు. మొత్తానికైతే పవన్ నేరుగా సీఎం జగన్ ను టార్గెట్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.