Pawan Kalyan : సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఏపీలో పరిస్థితి రోజురోజుకు వేడేక్కుతోంది. అధికార వైసీపీని పడగొట్టేది మేమంటే మేమే.. అన్న రీతిలో ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మొన్నటి వరకు టీడీపీ ప్రతీ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించి విఫలమైంది. అయితే జనసేన మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తోంది. పవన్ కళ్యాణ్ తాజాగా ప్రధానితో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పింది. దీంతో బీజేపీతో కలిసి పవన్ సాగుతాడని అంతా భావిస్తున్నారు. ఇక ఇప్పటికే టీడీపీతో పొత్తు విషయంలో పవన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అటు చంద్రబాబు కూడా సైలెంట్ అయిపోయారు. కానీ పవన్ ఒంటరిగానే ఏపీ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పవన్ ఇలాగే ముందుకు సాగితే భవిష్యత్ లో తమకు కష్టాలు తప్పవని టీడీపీ నాయకులు భావిస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల పలు రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. విశాఖ గర్జన తరువాత ఆయన రేంజ్ పెరిగిపోయింది. అప్పటి నుంచి ఏపీలో ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ పవన్ వాలిపోతున్నారు. అనుకున్నట్లుగానే ఇప్పటంలో పర్యటించి బాధితులను ఓదార్చారు. తక్షణమే రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. దీంతో పవన్ చేస్తున్న కార్యక్రమాలపై వైసీపీలోని కొందరు నాయకులు సైతం భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. అటు టీడీపీ నాయకులు తమను మించి ప్రజల్లోకి వెళుతున్న పవన్ వైఖరిని నిశితంగా గమనిస్తున్నారు. తమకు పోటీ వస్తాడేమోనన్న ఆందోళన వారిలో మొదలైనట్లు కనిపిస్తోంది.
పవన్ విశాఖ పర్యటన సందర్భంగా ఆయనను వైసీపీ ప్రభుత్వం నిర్బంధించింది. హింసించింది. ఈ క్రమంలోనే పవన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా వచ్చి ఓదార్చారు. ఆయనకు అండగా ఉంటామని ప్రకటించారు. దీంతో జనసేన, టీడీపీ పొత్తు ఖాయమేనని అంతా అనుకున్నారు.. అయితే ఈ పొత్తు ఎక్కడికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా పవన్ ఉత్తరాదిలో పర్యటించి బలం పెంచుకుంటున్నాడు. మొన్నటి వరకు విజయవాడ, విశాఖలో పట్టు సాధించిన పవన్ ఇప్పుడు విజయనగరంలో పర్యటించి అక్కడివారిని ఆకర్షించారు. దీంతో పవన్ కు ఓవరాల్ గా మద్దతు పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. భవిష్యత్ లో జనసేన పార్టీ మరింత పటిష్టంగా మారితే పవన్ చెప్పినట్లు వినాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు.జనసేనతో పొత్త పెట్టుకుంటే పవన్ చెప్పిన చోటే సీట్లు పొందాల్సి ఉంటుందని కంగారు పడుతున్నారు. ఉత్తరాదితోపాటు కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి గట్టి పట్టు ఉంది. అలా పట్టున్న ప్రాంతాల్లో జనసేన పోటీకి వస్తే ఇబ్బందులు తప్పవని అనుకుంటున్నారు.
అటు పవన్ మిగతా పార్టీలతో సంబంధం లేకుండా తన పార్టీని పటిష్టం చేయడానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆయన దూకుడు విషయం ప్రధాని వరకు వెళ్లింది గనుకే.. ఏపీలో అడుగుపెట్టిన తరువాత వెంటనే పవన్ తో భేటీ అయ్యారని అంటున్నారు. ముందు ముందు ఏపీ బాధ్యత అంతా పవన్ కే అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే బీజేపీతో బంధం ఉంటుందన్న పవన్ టీడీపీ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకవేళ టీడీపీ పొత్తుకు ఓకే అన్నా.. అటు బీజేపీ, ఇటు టీడీపీలకు సీట్ల పంపకం విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.