Pawan Kalyan Vs Bureaucrats : వర్షం ఎండిపోతున్న చేనుమీద కురవాలి.. అంతేగాని సముద్రం మీద కురిస్తే ఏం ఉపయోగం? అలాగే రాజకీయ పార్టీ బలం కూడా క్షేత్రస్థాయి నుంచి మొదలు కావాలి.. అంతేకానీ క్షేత్రాన్ని ఒడిసిపట్టే వారి చేతిలో ఉంటే ఏం ఉపయోగం? ఈ సూత్రాన్ని ఒంట పట్టించుకున్నారు కాబట్టే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, క్షేత్రస్థాయి నుంచి తన పార్టీ బలగాన్ని పెంచుకుంటున్నారు. ఈ సమయంలో పార్టీలో మేధావులకు ఎందుకు స్థానం కల్పించడం లేదని విమర్శలు వస్తున్నప్పటికీ ఆయన లెక్కచేయడం లేదు.. పైగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.

ఎందుకు ఇలా
సాధారణంగా రాజకీయ నేతలు అంటే అవినీతి చేస్తారని ప్రజల్లో ఒక స్థాయి అభిప్రాయం ఉంది. వాస్తవానికి అవినీతి అనేది ఒకరు మాత్రమే చేయరు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అయినట్టు.. రాజకీయ నాయకులు, అధికారులు కలిస్తేనే అవకతవకలు జరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. దేశంలో ఇప్పటివరకు జరిగిన అనేక కుంభకోణాల్లో రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల పాత్ర బయటపడింది.. ఇందులో ఏ ఒక్కరి సహకారం లేకుండా మరొకరు అవినీతికి పాల్పడే అవకాశం లేదు. సమాజంలో రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడాకారులు మాత్రమే విలాసవంతమైన జీవితం గడుపుతారు అనుకుంటారు. కానీ ఒకసారి హైదరాబాదులోని ప్రశాసన్ నగర్ వెళ్తే బ్యూరోక్రాట్లు ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నారో అర్థమవుతుంది. సాధారణంగా బ్యూరోక్రాట్లు చేసే అవినీతి పెద్దగా వెలుగులోకి రాదు. ఒకవేళ అది వెలుగులోకి వచ్చినా చర్యలు తీసుకునే వరకు పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది. అందుకే చట్టంలో లొసుగులు వారికి తెలుసు కాబట్టే దేనికైనా తెగిస్తారు. ఇలాంటి పరిణామాలు పవన్ కళ్యాణ్ కు తెలుసు కాబట్టే మాజీ బ్యూరోక్రాట్లను పెద్దగా తన పరిధిలోకి రానివ్వడం లేదు. దీనిపై రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నప్పటికీ ఆయన పెద్దగా లెక్కచేయడం లేదు.
నిబద్ధతకే ప్రాధాన్యం
ఇక జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ నిబద్దతకే ప్రాధాన్యమిస్తున్నారు.. తన సొంత సామాజిక వర్గం కాపు కులం నుంచి చాలామంది విశ్రాంత బ్యూరోక్రాట్లు ఉన్నారు.. వారందరినీ పార్టీలో చేర్చుకుంటే పవన్ కళ్యాణ్ కు చెడ్డ పేరు వస్తుంది. పార్టీ ఏర్పాటు చేసిన లక్ష్యం పక్కదారి పడుతుంది.. ఇలాంటి సమయంలో వ్యవస్థలో మార్పు తేవడం అనేది అసాధ్యమవుతుంది.. అందుకే ఆయన నిజాయితీకి పట్టం కడుతున్నారు.. ఈ సమయంలో నిబద్దతతో పని చేసిన మాజీ బ్యూరోక్రాట్లకు అచంచలమైన గౌరవం ఇస్తున్నారు. ఉదాహరణకి తమిరెడ్డి శివశంకర్ అనే విశ్రాంత బ్యూరోక్రాట్ కు పవన్ కళ్యాణ్ అమితమైన గౌరవం ఇస్తారు. ఎందుకంటే శంకర్ తన వ్యక్తిగత జీవితంలో ఎంతో మంది పేదలకు సహాయం చేశారు.. ప్రభుత్వం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిని లబ్ధిదారులకు చేరేలా కృషి చేశారు.. ఈ పవన్ కళ్యాణ్ ను అమితంగా ఆకట్టుకుంది..
అవకాశవాదం కాదు
రాజకీయాలంటేనే అవకాశవాదానికి ప్రతిపదార్థాలుగా మారిపోయిన ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎన్నడూ కూడా ఆ దిశగా ఆలోచించలేదు.. పైగా పార్టీ నిర్మాణం, విలువల మీదనే ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు.. తెలుగుదేశం, వై ఎస్ ఆర్ సి పి, కాంగ్రెస్… ఇవన్నీ కూడా రాజకీయ అవకాశవాదం కోసం ఏర్పడిన పార్టీలు. పేరుకు దూరదృష్టి, సామాజిక సాధికారత, మార్పు అనే పదాలను పదేపదే వల్లే వేస్తారు కానీ… ఆ పార్టీ నాయకులు ఇంతవరకు వాటిని చిత్తశుద్ధితో అమలు చేసిన దాఖలాలు లేవు.. అందుకోసమే జనసేన పార్టీ పుట్టింది. వాటి కోసమే బలమైన అడుగులు వేస్తోంది.. మేధావి అనే వ్యక్తులకు అందలం ఇవ్వదు. అదే సమయంలో మేథో సంపత్తిని వదులుకోదు.