KCR BRS : కారులో పోరు మొదలైంది.. నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని పలువురు మాజీల నుంచి ధిక్కారస్వరం వినిపించింది. ఇన్నాళ్లు భారత రాష్ట్ర సమితిలో కెసిఆర్ మాటకు ఎదురేలేదు అనేది ఈరోజు నీటి బుడగతో సమానమని తేలిపోయింది. కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొందరు సీనియర్ నేతలు ధిక్కారస్వరం వినిపించడం ఇప్పుడు కొత్త చర్చకు తెరతీస్తోంది.

-కచ్చితంగా పోటీ చేస్తా
నూతన సంవత్సరానికి పురస్కరించుకుని ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి సుమారు 50, 000 మంది దాకా హాజరయ్యారు.. అక్కడకు వచ్చిన కార్యకర్తలు అందరికీ ఆయన భోజనాలు ఏర్పాటు చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ఒక బ్రోచర్ కూడా విడుదల చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.. 2018 లో ఇదే తుమ్మల నాగేశ్వరరావు ఆయన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కందాల ఉపేందర్ రెడ్డి భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఇదే సమయంలో తుమ్మల నాగేశ్వరరావు కు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది.. మొన్న సత్తుపల్లి లో జరిగిన రాజ్యసభ సభ్యుల సత్కార కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. మొన్న ఢిల్లీలో జరిగిన భారత రాష్ట్ర సమితి కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు.. పైగా ఖమ్మం జిల్లాలో రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ ఆదిపత్యం పెరిగిపోయింది.. మరోవైపు పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు అనుచరుల మీద పోలీసులు కేసులు పెట్టడంతో ఆయన అధిష్టానం పై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.. గత ఏడాది కూడా తన స్వగ్రామం గండుగలపల్లిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసారి తెలివిగా పాలేరు నియోజకవర్గ పరిధిలో బారు గూడెం అనే గ్రామంలో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సో… మొత్తానికి అధిష్టానం పై ధిక్కార స్వరం వినిపించారు.
-అనుచరులు మొత్తం పోటీ చేస్తారు
ఖమ్మం పార్లమెంటు మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధిష్టానం పై ధిక్కార స్వరం వినిపించారు.. వచ్చే ఎన్నికల్లో తనతోపాటు తన అనుచరులు కూడా పోటీ చేస్తారని ప్రకటించారు.. ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గౌరవం కోసం కచ్చితంగా పోరాడుతానని, తనను నమ్ముకున్న వారిని ఇబ్బంది పెట్టనని స్పష్టం చేశారు.. ఇన్నాళ్లు ఓపికతో ఎదురు చూశానని, ఇక ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. “నేను ఊరుకున్నా కూడా కార్యకర్తలు ఊరుకోవడం లేదని” ఆయన వివరించారు. త్వరలో జనం ముందుకు వస్తానని స్పష్టం చేశారు. నన్ను ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు.
-ఐదు మండలాల్లో క్యాంప్ కార్యాలయాలు
ఇక వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కూడా అధిష్టానానికి వ్యతిరేక స్వరం వినిపించారు.. తన నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో క్యాంపు కార్యాలయాలు ప్రారంభించారు.. వాస్తవానికి 2018 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆయన మీద గెలిచిన రాములు నాయక్ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.. మొత్తానికి ముగ్గురు మాజీ ప్రజా ప్రతినిధులు అధికార టీఆర్ఎస్ పార్టీకి ధిక్కార స్వరం వినిపించడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నది.