Pawan Kalyan Strong Counter to CM Jagan: పవర్ స్టార్ ఏపీలో లేని ‘పవర్’ గురించి ఏకిపారేశారు. చంద్రబాబు హయాంలో 24 గంటలు ఉన్న కరెంట్ జగన్ వచ్చాక ఎందుకు మాయమైందని.. పవర్ హాలీడేలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తలెత్తిందని పవన్ సంచలన ఆరోపణలు చేశారు.

విద్యుత్ అనేది ఇప్పుడు నిత్యావసరంగా మారింది. తెలంగాణలో ఇప్పటికీ పరిశ్రమలు, ఇళ్ల అవసరాలకు 24 గంటలూ కరెంట్ ఇస్తున్నారు. వ్యవసాయానికి అయితే త్రీ ఫేజ్ కరెంట్ 24 గంటలూ ఇచ్చి చరిత్ర సృష్టిస్తున్నారు. కానీ ఏపీలో జగన్ అధికారంలోకి రాగానే తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఏపీలో విద్యుత్ కోతలకు కారణమయ్యాయి.
చంద్రబాబు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను జగన్ అధికారంలోకి రాగానే రద్దు చేసుకున్నారు. చీప్ గా కొనాల్సిన కరెంట్ ను ఇప్పుడు యూనిట్ కు రూ.20 చొప్పున కొంటున్నారు. కరెంట్ అందుబాటులో లేక కోతలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టాక తెలంగాణలో కరెంట్ కోతలు ఉంటే.. ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండేది. 2014-19 మధ్య విద్యుత్ కోతల ప్రభావం పెద్దగా లేదు. కానీ ఇప్పుడు జగన్ ఆ విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయడం.. ఇప్పుడు కరెంట్ చార్జీలు పెంచినా కూడా కోతలు వేస్తుండడంపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. దాన్నే ఇప్పుడు పవన్ ఎలుగెత్తి చాటాడు.
పల్లెల్లో 11 నుంచి 14 గంటలు కరెంట్ కోత.. పట్టణాల్లో 5-8 గంటలు, నగరాల్లో 4-6 గంటలు చొప్పున అనధికార విద్యుత్ కోతలు ఈ ఎండాకాలం పూట విధిస్తుండడంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. విద్యార్థులకు పరీక్షల వేళ ఈ కోతలు వారి చదువులను పాడు చేస్తున్నాయి.
ఇక కరెంట్ లేక మొబైల్ ఫోన్ వెలుతురులో ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు, ప్రసవాలు జరగడం చూస్తుంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏ స్తాయిలో ఉందో అర్థమవుతుందని పవన్ పేర్కొన్నారు.
