Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈసారి ఎలాగైనా పవర్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. అందుకనుగుణంగానే జనసేనాని ‘పవర్’ పాలిటిక్స్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. నిన్న జరిగిన జనసేన తొమ్మిదో ఆవిర్భావ సభ నుంచే పవన్ కల్యాణ్ ఎన్నికల సమర శంఖారాన్ని పూరించారు. ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే జనసేన మేనిఫెస్టోను ప్రకటించి రాబోయే ఎన్నికల్లో తానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సస్ అయ్యారు.

ఇప్పటికే జనసేనాని తన టార్గెట్ ఏంటో క్లియర్ కట్ చెప్పేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు ఆయన తేల్చిపారేశారు. అలాగే పొత్తు విషయంలోనూ ఎలాంటి దాపరికాలు లేకుండా జనసైనికులకు క్లియర్ మేసేజ్ పంపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడుస్తామని.. ఆపార్టీ రూట్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు ఉంటాయనే సంకేతాన్ని పంపించారు.
వైసీపీ ఓటు బ్యాంకు చీలిపోకూడదనే పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ వ్యతిరేక శక్తులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరన్నట్లుగా జనసేనాని టీడీపీకి సైతం ఈ వేదిక నుంచి బంపరాఫర్ ఇచ్చినట్లు కన్పిస్తోంది. చంద్రబాబు నాయుడు నిస్వార్ధంగా బీజేపీ-జనసేన కూటమితో కలిసి వస్తే టీడీపీ సైతం కలుపుకుపోయే అవకాశం ఉందనే సంకేతాలను జనాల్లోకి పంపించారు.
ఏపీలోని వైసీపీ మినహా అన్ని పార్టీలతో జనసేనానికి మంచి ర్యాపో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి జనసేనాని టీడీపీ, బీజేపీ, బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలను ఒకే వేదికగా పైకి తీసుకొచ్చే అవకాశం కన్పిస్తోంది. వైసీపీకీ ధీటుగా మహాకూటమిని ఏర్పాటు చేసి ఆయనే లీడ్ తీసుకునే అవకాశం కన్పిస్తోంది. కేవలం బీజేపీ-జనసేన మాత్రమే పోటీ చేస్తే వచ్చే ప్రయోజనం కంటే టీడీపీని కలుపుకునే పోతే అధికారంలోకి రావడం సులువు అని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.
అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ, జనసేన పార్టీలు టీడీపీ విషయంలో తర్జనభర్జన పడుతున్నాయి. పొత్తుల విషయాన్ని బీజేపీ అధిష్టానం తేల్చనుండటంతో ఈ విషయంలో టీడీపీ వైఖరి ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. అలాగే జనసేన-బీజేపీ కూటమిలో టీడీపీ చేరితే తెలుగు తమ్ముళ్లు త్యాగాలను సిద్ధం కావాల్సిందే? అన్న ప్రచారం సాగుతోంది. ఏదిఏమైనా రాబోయే ఎన్నికల్లో జనసేనాని, జనసైనికులు మాత్రమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారబోతున్నారనేది మాత్రం స్పష్టమవుతోంది.
[…] Telangana Jobs Notification 2022: తెలంగాణలో కొలువుల జాతర ప్రారంభమైంది. ఎట్టకేలకు ప్రభుత్వం దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడిన నేపథ్యంలో నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచనలు చేయడంతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. నిరుద్యోగుల ఆశలు నెరవేరేలా ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టడంతో సమస్య తీరినట్లే అని భావిస్తున్నారు. మొత్తానికి నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు కావడంతో నిరుద్యోగులు సైతం సన్నద్ధత వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షల కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. కోచింగ్ సెంటర్లు కూడా కళకళలాడుతున్నాయి. […]