
Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా కాపు సామాజికవర్గానికి చెందిన వారు. కాపులకు ప్రతినిధి. కానీ ఎప్పుడూ ఆయన కాపు అని చెప్పుకోడు. కులం కట్టుబాట్లలో బంధీ కారు. అందరివాడు అనిపించుకుంటారు. కానీ ఏపీ రాజకీయాలు మొత్తం కుల కుంపట్లతోనే సాగుతున్నాయి. అందుకే పవన్ సైతం కాపుల ఏకీకరణకు.. అగ్రవర్ణాల కుట్రలకు బలి కాకూడదనే ఉద్దేశంతో అందరినీ కలుపుకు పోవడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఏపీలో ప్రబలంగా.. మెజార్టీ సంఖ్యలో ఉన్న కాపు నాయకులకు తాజాగా సంచలన పిలుపునిచ్చారు.
కాపు నాయకులు సమాజానికి పెద్దన్న పాత్ర వహించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన పిలుపునిచ్చారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాపు సంక్షేమ సేన సదస్సులో ఆయన మాట్లాడారు. రాజకీయ సాధికారిత కావాలంటే కాపులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.
‘కులాలను విడగొట్టి లబ్ధి పొందే నాయకులు ఎక్కువయ్యారు. 2008-09లో జరిగిన ఘటనలు నాలో పంతం పెంచాయి. ఉపాధి, ఉద్యోగాలు కావాలని అడిగే స్థితిలోనే ఇంకా ఉన్నాం. పెద్ద కులాలతో గొడవలు వద్దు.. అన్ని కులాలను సమానంగా చూడాలి. కాపులు కూడా కట్టుబాటు తీసుకోవాలి. సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత ఉండదు. కులం నుంచి నేను ఎప్పుడూ పారిపోను. సంఖ్యాబలం ఉన్న కాపులు అధికారానికి దూరంగా ఉన్నారు. కాపులు అధికారంలోకి వస్తే మిగతా వారిని తొక్కేస్తారని విషప్రచారం జరిగింది. సమాజాన్ని విడగొట్టే వారు ఎక్కువ. కలిపే వారు తక్కువ. ’ అంటూ పవన్ తన కాపు కులానికి దిశానిర్ధేశం చేశారు.
రూ.1000 కోట్లతో రాజకీయాలు చేయలేమని.. పార్టీని నడపలేమని.. భావనాబలం ఉంటేనే పార్టీని నడపగలం. పార్టీని ఇంకా ప్రతికూల పవనాల మధ్యే నడుపుతున్నారు. కాపులంతా నాకు ఓటేస్తే గాజువాక, భీమవరంలో గెలిచేవాడిని.. కుల ఆత్మగౌరవాన్ని చంపుకొని మరీ వైసీపీకి ఎందుకు ఓటేశారు.? 2024 ఎన్నికలు చాలా కీలకం.. సంఖ్య బలం ప్రకారం మనం సత్తా చాటాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ సంచలన పిలుపునిచ్చారు.
కాపులంతా ఒక్కటై జనసేన తరుఫున నిలబడి సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా పవన్ హితబోధ చేశారు.