Pawan Kalyan: మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు జగన్ ను.. పవన్ సంచలన కామెంట్స్

నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో 'యువగళం - నవశకం'పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

Written By: Dharma, Updated On : December 21, 2023 9:07 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: పవన్ స్ఫూర్తివంతమైన ప్రసంగం చేశారు. యువగళం విజయోత్సవం వేదికగా మార్పు తీసుకొస్తాం.. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి పంపిస్తామని తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు, పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్డీఏకు మద్దతు తదితర విషయాలను చెప్పుకొచ్చిన పవన్.. ఇప్పుడు కూడా తమతో బిజెపి కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మార్చాల్సింది 80 మంది ఎమ్మెల్యేలను కాదని.. ఏకంగా సీఎం జగన్ మార్చుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో ‘యువగళం – నవశకం’పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పవన్ రాకతో ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ సందర్భంగా పవన్ జగన్ సర్కార్ పై హాట్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఏదైనా మాట్లాడితే దూషిస్తారు.. దాడులు చేస్తారు.. మహిళలను కించపరిచే సంస్కృతికి వైసిపి శ్రీకారం చుట్టిందన్నారు. ఇంట్లో ఉన్న తల్లికి,చెల్లికి విలువ ఇవ్వని సీఎం జగన్ బయట మహిళలకు ఎంతో చులకనగా మాట్లాడతారన్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ గూండాలను ఎదుర్కోవడానికి కర్రో, కత్తి పట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

గతంలో ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు ఏపీకి రావాలని కోరుకునేవారని.. ఏపీ ఒక మోడల్ స్టేట్ అని అక్కడికి వెళ్లాలని చెప్పేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏపీకి ఎందుకు వెళ్ళకూడదు చెబుతున్నారని అన్నారు. ఏపీ స్ఫూర్తి భారతదేశానికి చాలా కీలకమని.. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే అది పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమేనని పవన్ తేల్చి చెప్పారు. ఏదో ఆశించి చంద్రబాబుకు మద్దతు తెలపలేదని.. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని అలా అరెస్టు చేయడం బాధ అనిపించిందని చెప్పారు. అవినీతి కేసుల్లో జగన్ సోనియాగాంధీ అరెస్టు చేయిస్తే.. చంద్రబాబుపై పగ పట్టారని.. అందుకే ఆయనపై కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. తప్పకుండా బిజెపి తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పెద్దలకు అన్ని చెప్పానని.. సానుకూల ఫలితం వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన లోకేష్ ను పవన్ అభినందించారు. ఇలాంటి పాదయాత్రలు ఎన్నో అనుభవాలు నేర్పుతాయని.. ప్రజల కష్టసుఖాలు నేరుగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. తనకు పాదయాత్ర చేయాలని ఉందని.. కానీ ఆ అవకాశాన్ని లోకేష్ సద్వినియోగం చేసుకోవడం అభినందనీయమన్నారు. అయితే జగన్ మాదిరిగా బుగ్గలు యాత్ర కాదు అని పవన్ సెటైర్ వేశారు. టిడిపి, జనసేన పొత్తు సుదీర్ఘకాలం కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. ఏపీ నిలదొక్కుకునే వరకు వరకు ఈ మైత్రి ఇలాగే కొనసాగాలని.. త్వరలో రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని పవన్ స్పష్టం చేశారు.