
Pawan Kalyan : అదొక పెద్ద ఆస్పత్రి. అక్కడ ఓ బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డ మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లాలి. ఆస్పత్రికి.. సొంతూరికి మధ్య వంద కిలోమీటర్లకు పైగా దూరం ఉంది. తీసుకెళ్లడానికి అంబులెన్స్ లేదు. ఉన్నా స్పందించేవారు లేరు. ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదు. చేసేది లేక 120 కిలో మీటర్లు బైక్ పై బిడ్డ మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఇంతటి దయనీయ పరిస్థితి ఉన్న ప్రాంతంలో ఇప్పుడు రాజధాని కట్టబోతున్నారట. అంత పెద్ద నగరంలో అంబులెన్స్ కు గతిలేదు. రాజధాని కడతామంటే నమ్మేదెలా ?. ఇప్పుడు ఇదే ప్రశ్న జనసేనాని పవన్ కళ్యాణ్ సంధించారు.
జగన్ .. విశాఖను రాజధానిగా చేస్తామని ప్రకటన చేశారు. కానీ కేజీహెచ్ లో చనిపోయిన బిడ్డను తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వని ముఖ్యమంత్రి, విశాఖలో రాజధాని నిర్మిస్తామంటే ఎలా నమ్మాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. బిడ్డ మృతదేహంతో 120 కిలో మీటర్లు ద్విచక్రవాహనం పై ప్రయాణించిన గిరిజన దంపతులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాడేరు ప్రాంతంలోని కుమడ ప్రాంతానికి చెందిన మహేశ్వరి, కొండబాబు దంపతులు పుట్టెడు దుఖం దిగమింగుకుని బిడ్డ మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్తుంటే.. చూసినవారికి గుండె తరుక్కుపోతుందని అన్నారు. కానీ రాతిగుండె ప్రభుత్వంలో కనీస స్పందన లేదని విమర్శించారు. కేజీహెచ్ లో ఎస్టీ సెల్ ఉన్నా.. నిరుపయోగమని అన్నారు. గిరిజనులకు ఏమాత్రం ఉపయోగడపటం లేదని విమర్శించారు.
విజయవాడ బెంజి సర్కిల్ లో అంబులెన్సులు నిలిపి జెండా ఊపి.. డ్రోన్ విజువల్స్ తీస్తే సరిపోదని, ఆస్పత్రుల్లో అవసరమైన అంబులెన్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. బడ్జెట్లో వైద్యారోగ్యశాఖకు రూ. 14 వేల కోట్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదని, క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందేలా చూడాలి హితవు పలికారు. గతంలో తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద ఓ బిడ్డ మృతదేహాన్ని తరలించడానికి తండ్రి పడ్డ బాధను, మచిలీపట్నంలో బాలుడు చనిపోతే బంధువులు బైక్ పై తీసుకుపోయిన ఘటనను గుర్తుచేశారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే విశాఖను అభివృద్ధి చేస్తాం.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాయమాటలు చెబుతున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
వైద్యారోగ్యశాఖకు రూ. 14 వేల కోట్లు కేటాయించడం కేవలం పేపర్ల వరకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆస్పత్రుల వద్ద అంబులెన్సులు లేవు. ప్రభుత్వ అంబులెన్సులకు బదులు ప్రైవేటు అంబులెన్సులు రాజ్యమేలుతున్నాయి. మృతుల బంధువుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఉచితంగా అందాల్సిన సేవ.. వేల రూపాయలు పోసి కొనాల్సి వస్తోంది. ప్రైవేటు అంబులెన్సులకు వేల రూపాయలు చెల్లించలేని నిరుపేదలు.. బైక్ పైనో, రిక్షా పైనో మృతదేహాలను తీసుకెళ్తున్నారు. ఇలాంటి దయనీయ స్థితి రాష్ట్రంలో ఎప్పుడూ లేదని చెప్పవచ్చు.
ఎస్టీ సబ్ ప్లాన్ ను ఏపీ ప్రభుత్వం నీరుగార్చిందని చెప్పవచ్చు. ఎస్టీలకు ప్రత్యేకంగా ఎలాంటి సదుపాయాలు కల్పించడంలేదు. సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు ఉపయోగించారు. ఇంకా వైసీపీ కార్యకర్తలకు వినియోగించారు. ఆస్పత్రుల్లో ఎస్టీ సెల్ ఉన్నా.. అది పేరుకు మాత్రమే. అధికారులు ఉన్నా సరే … అది ప్రభుత్వ పెద్దలు చెబితేనే మాట వింటారు. సామాన్యులకు కనీస సదుపాయాలు కల్పించరు. అలాంటప్పుడు ఎస్టీలకు ఇంత చేశాం.. అంత చేశామని ఏపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం ఎందుకు ? . అంబులెన్స్ సమకూర్చలేదంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంది ? ఇప్పడు ఇదే ప్రశ్న జనసేనాని ప్రభుత్వాన్ని అడిగారు.
విశాఖను రాజధానిగా ప్రకటించడంలో కూడా ప్రభుత్వ వ్యూహం ఉంది. ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అప్పులతోనే పథకాలు నడిపిస్తోంది. అభివృద్ధిలేదు. ప్రతిపక్షాల నుంచి ముప్పేట దాడి జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చడానికి, మాయ చేయడానికి రాజధానుల పేరుతో నాటకం ఆడుతున్నారు. ప్రజలను మభ్యపెడుతున్నారు. అందులో భాగంగానే అమరావతి అని ఒకసారి, విశాఖ అని మరొకసారి కొత్త నాటకాలకు తెరతీస్తున్నారు. ఎన్నికల వరకు ఏదో ఒకలా ప్రజల దృష్టి మరల్చాలి. ప్రభుత్వ అవినీతి, అసమర్థతను కప్పిపుచ్చుకోవాలి. ఇదే ఇప్పడు వైసీపీ చేస్తున్న కార్యక్రమం.