Pawan Kalyan – KTR : రాజకీయాల్లో కల్వకుంట వారి రాజకీయాలే వేరు. ఈ విషయం తెలుగు ప్రజలకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదు. అవసరం అనిపిస్తే ఎవరితోనైనా ఆ కుటుంబం ఇట్టే కలిసిపోతుంది. అది జగమెరిగిన సత్యం కూడా. బీఆర్ఎస్ పూర్వపు టీఆర్ఎస్ గమనాన్ని పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతోంది. ఎవరితోనూ శాశ్వత శత్రుత్వం పెట్టుకోరు. అలాగని మిత్రులుగా కొనసాగరు. బహుశా వారి ఎదుగుదలకు అదే కారణం ఏమో. తాజాగా యువనేత కేటీఆర్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉన్న నాయకులంతా తమవారేనంటూ కామెంట్స్ చేశారు. తాజాగా కేటీఆర్ ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ పై కేటీఆర్ విభిన్నంగా కామెంట్స్ చేశారు. తనకు పవన్ అన్నలాంటి వాడని చెప్పుకొచ్చారు. మా మధ్య మంచి రిలేషన్ షిప్ కొనసాగుతోందన్నారు. ఆయనకు సాహిత్యం అంటే ఇష్టమని.. తనకు కొంచెం ఆసక్తి అని చెప్పారు. తమ అభిరుచులు దగ్గరగా ఉంటాయని కూడా గుర్తుచేశారు. చాలా సందర్భాల్లో కలుసుకున్నామని.. తమ అభిప్రాయాలను పంచుకున్నామని వివరించారు.
అయితే ఇదే పవన్ గతంలో కేమరా మెన్ గంగతో రాంబాబు సినిమా తీసినప్పుడు ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతోనే పవన్ నాకు అత్యంత సన్నిహితుడని కేటీఆర్ చెప్పుకుంటున్నారు. పవన్ సపోర్టు కోసమే కేటీఆర్ పవన్ అనుకూల వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అయితే జన సైనికులు మాత్రం పవన్ పై కేటీఆర్ చూపుతున్న అభిమానానికి ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా అన్నదమ్ముల కథ అంటూ పోస్టు చేస్తున్నారు. ఇవి వైరల్ అవుతున్నాయి.