Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : జగనన్న ఇళ్లు... అవినీతి నకళ్లు

Pawan Kalyan : జగనన్న ఇళ్లు… అవినీతి నకళ్లు

Pawan Kalyan  : ‘జగనన్న ఇళ్ల పేరుతో వైసీపీ నాయకులు జేబులు నింపుకొన్నారు.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 12 వేలు కోట్లు అవినీతి చేశారని కొందరు పెద్దలు నాతో అన్న మాట. పేదలకు మాత్రం ఇల్లు కట్టించిందీ లేదు, వారిని సొంత ఇంటిదారులు చేసింది లేదు. జగనన్న ఇళ్ల పేరుతో ఈ వైసీపీ నాయకులు చేసిన అవినీతి బాగోతం అంతా ఇంతా కాద’ని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  అన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు’ కార్యక్రమంలో భాగంగా విజయనగరం శివారులోని గుంకలంలోని జగనన్న కాలనీని  పవన్ కళ్యాణ్  ఆదివారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ పి.ఎ.సి. సభ్యులు నాగబాబు గారు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “జగనన్న ఇళ్లకు సంబంధించి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తోంది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెద్ద పెద్ద శంకుస్థాపనలు చేసి, కమాన్లు, పైలాన్ కట్టి హడావుడి చేస్తోంది. జగనన్న కాలనీల పేరుతో రైతులు వద్ద నుంచి ఎకరా భూమిని రూ.5 లక్షలకు కొనుగోలు చేసి దానిని ప్రభుత్వం వద్ద సేకరణకు ఇచ్చి రూ.40 లక్షల నుంచి రూ. 60 లక్షల పరిహారం వైసీపీ నాయకులు జేబులో వేసుకున్నారు. ఆ తర్వాత ఆ కాలనీలో ఇళ్ల నిర్మాణానికి మాత్రం ప్రభుత్వం ముందుకు రాలేదు. పేదలకు సాయం చేయలేదు. స్థలాలను పేదలకు పంచి పెట్టామని చెబుతున్న ప్రభుత్వం ఆ పట్టాలకు చట్టబద్ధత కల్పించలేదు.

* వైసీపీ ప్రభుత్వం చేసిన అతి పెద్ద స్కాం
ఒక క్రమ పద్ధతిలో వైసీపీ ప్రభుత్వం చేసిన అతి పెద్ద స్కాం జగనన్న ఇళ్లు. ఈ అవినీతికి వైసీపీ నాయకులు చెప్పే పేరు దేశంలోనే ఇంత భారీ మొత్తంలో పేదలకు పట్టాలు పంచి పెట్టామని డబ్బా కొట్టడం మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు బొక్కి, పేదలను వారి ఇల్లు వారే కట్టుకోవాలని ఒత్తిడి చేయడం, బెదిరింపులకు దిగడం ఈ వైసీపీ ప్రభుత్వ అసమర్థపు చర్య. ఉత్తరాంధ్రలోని గుంకలంలో పేదలకు 12 వేల ఇల్లు నిర్మించలేని ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్రలో రాజధాని నిర్మిస్తామని ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడానికి మరో ఎత్తుగడ వేస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యవంతులు. గురజాడ, శ్రీశ్రీ వంటి మహానుభావులు తిరిగిన నేల ఇది. వైసీపీ నాయకుల కల్లబొల్లి కబుర్లపై చొక్కా పట్టుకుని నిలదీయాల్సింది ఉత్తరాంధ్ర యువతరమే. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అడిగేవాడు ప్రశ్నించేవాడు లేకపోతే అవినీతిని చట్టబద్ధం చేసేస్తారు.

* ఉద్యమాల ఊపిరి ఉత్తరాంధ్ర
ఉత్తరాంధ్ర నాకు సినిమాల పరంగా విద్యను నేర్పిన నేల. ఇక్కడి సంస్కృతి, కళలు చాలా గొప్పవి. నేను ఎప్పుడూ ఇక్కడి యాస, భాష, సంప్రదాయం మర్చిపోను. నా సినిమాల్లోనూ ఇక్కడి సంస్కృతి ప్రతిబింబిస్తుంది. విశాఖలో రాజధాని చేస్తే అద్భుతాలు జరిగిపోతాయని వైసీపీ ప్రభుత్వం భ్రమ పెడుతోంది. అలా జనాల్ని మరోసారి నమ్మించి మోసం చేయాలని ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. మీ దగ్గరకు వచ్చే వైసీపీ నాయకులను గట్టిగా నిలదీయండి- ఉద్యోగాలు ఎక్కడ అని..? మీ దగ్గరికి వచ్చే ప్రతి నాయకుడిని ప్రశ్నించండి మా ఇల్లు నిర్మించేది ఎప్పుడు అని..? బటన్ నొక్కితే ప్రజల బతుకులు బంగారం అయిపోతాయని ఓ నాయకుడు భ్రమపెడుతున్నాడు. బటన్ నొక్కడమే నాయకుడి బాధ్యత అనుకుంటున్నాడు. డబ్బులు పంచి మేమేదో అద్భుతాలు చేశామని చెబుతున్నాడు. ఆయనకు చెప్పండి… మీరు పంచే డబ్బులు మా చెమట నుంచి కట్టిన పన్నులు అని, అవి మా నుంచి మీరు లాగేసిన డబ్బులు అని గట్టిగా చెప్పండి.

* ఉత్తరాంధ్ర యువతరం మహోన్నతం
నేను విజయనగరం వస్తుంటే ఇక్కడి యువకులు నా కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. సుమారు 14 కిలోమీటర్ల మేర నా కాన్వాయ్ ని అనుసరించి పరుగెత్తారు. వారి బలం అద్భుతమైనది. ఇక్కడ యువతరం ఆలోచన మహోన్నతమైనది. వారి బలం, వారి ఆలోచన దేశానికి ఉపయోగపడాలి. యువతరం మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడగడం కాదు వారే పదిమందికి ఉద్యోగాలు ఇచ్చేలా జనసేన ప్రణాళిక రచిస్తుంది. కచ్చితంగా యువతకు ఒక దారి చూపేలా, వారి శక్తి పదిమందికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతాం. 25 ఏళ్ల భవిష్యత్తు కావాలని ఓ ఉత్తరాంధ్ర యువకుడు అడిగిన మాట నన్ను ఎప్పుడు వెంటాడుతుంది. రూ. 5 వేలు మీ అకౌంట్లోకి కొట్టి, రూ. 10 వేల కోట్లు దోపిడీ చేసే సంస్కృతి ని యువతరం ప్రశ్నించాలి. ఉత్తరాంధ్ర యువతరం నుంచే ఈ మార్పు మొదలు కావాలి.

* పేదలకు ఇసుక దొరకదు
ఇళ్లు కట్టుకోవాలి అంటే పేద వర్గాలకు రాష్ట్రంలో ఇసుక దొరకదు. ఇసుక దొరకని పుణ్యమా అని పేదలకు పని దొరకదు. వైసీపీ నాయకులు ఇసుకను దోపిడీ చేస్తున్నారు. సామాన్యులకు ఇసుక దొరకడం గగనం అయిపోతోంది. బ్లాక్ లో మాత్రం వైసీపీ నాయకులు చక్కగా ఇసుక అమ్ముకుంటున్నారు. ఇలా ఐతే పేదలు ఎలా ఇల్లు కట్టుకుంటారు..? ఇసుక దొరకనిదే వాళ్ళు నిర్మాణాలు ఎలా చేస్తారు..? ఇసుక విషయంలో మొదటి నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. జనసేన ప్రభుత్వం లో ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకునేందుకు ఇసుక పూర్తిగా ఉచితంగా అందిస్తాం. ఇసుక అందుబాటులోకి తీసుకొస్తాం.

* జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి
అధికారంలోకి రాగానే అద్భుతాలు సృష్టిస్తాను అని చెప్పిన మహానుభావుడు రాష్ట్రాన్ని ఇంటి గడప కూడా దాటకుండా పరిపాలిస్తున్నాడు. మీ వద్దకు వైసీపీ నాయకులు వస్తే ఇదే అడగండి. మీరు చేసిన అద్భుతాలు ఏంటి..? రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటి అని నిలదీయండి. ఈసారి ఒక్క అవకాశం జనసేనకు ఇవ్వండి. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో చూపిస్తాం. మీ కోసం అవకాశం ఇవ్వడం కాదు.. మీ బిడ్డల భవిష్యత్తును ఆలోచించి జనసేన పార్టీకి వచ్చే ఎన్నికల్లో బలంగా నిలబడండి. కష్టాల్లో ఉన్న వారికి సొంత డబ్బు ఖర్చుపెట్టిన వాడిని.. రాష్ట్ర ప్రజల కోసం వారి డబ్బులు వారి కోసమే మరింత జాగ్రత్తగా వారి అభ్యున్నతి కోసం ఖర్చు పెడతాను. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలబడతాను. రాష్ట్రంలో సైనికుల భూములు, పోలీసుల భూములు ఇలా ఎవరి భూములు పడితే వాళ్ళవి ఇష్టానుసారం లాక్కుంటున్నారు. గట్టిగా అడిగిన వారిపై పోలీస్ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ ప్రభుత్వ దాష్టికాలతో ప్రజల్లో వస్తున్న ఆవేశం, ఆవేదన, ఆగ్రహం నుంచే జనసేన పార్టీ పోరాటం పంథా లో ముందుకు వెళుతుంది. ఈ ప్రభుత్వ గుండాలు వచ్చినా, రౌడీలు వచ్చిన ధైర్యంగా పోరాడుదాం. నేను మీకు అండగా నిలబడతాను. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి నిలబడి, మా నాయకుల్ని విశ్వసించండి. వారు ఏదైనా తప్పు చేస్తే కచ్చితంగా దానికి నేను బాధ్యత తీసుకుంటాను. ప్రతి నాయకుడిలోనూ పవన్ కళ్యాణ్ ను చూసి ఓటు వేయండి.

* ఢిల్లీ వెళ్లి చాడీలు చెప్పడమే వాళ్లకు తెలిసిన విద్య
ప్రజా సమస్యల కోసం ఢిల్లీ వెళ్లి కేంద్ర నాయకుల్ని కలవడం రాదు కానీ… పవన్ కళ్యాణ్ మీద చాడీలు చెప్పడం మాత్రమే వైసీపీ నాయకుడికి తెలుసు. సజ్జల, బొత్స, ధర్మాన లాంటి నాయకులకు ఒకటే చెబుతున్నా… మీరు ఎన్ని చాడీలు చెప్పినా ప్రజా సమస్యల మీద నా పోరాటం ఆగదు. నేను మీ నాయకుడిలా చాడీలు చెప్పే వ్యక్తిని కాదు. ఏ సమస్య అయినా ఇక్కడే తేల్చుకుంటా. ఉత్తరాంధ్ర సమస్య అయితే ఉత్తరాంధ్రలోనే తేల్చుకుంటా. ఇక్కడే పోరాడుతా. మీరు నన్ను చంపేస్తాం.. బెదిరిస్తాం అంటే భయపడే వ్యక్తిని కాదు. కనీసం నా చొక్కా గుండీ కూడా పట్టుకునే దమ్ము ఎవరికీ లేదు. మీరు చాడీలు చెప్పే వ్యక్తులే తప్ప చేవ ఉన్న వ్యక్తులు కాదు. కచ్చితంగా మీ ఫ్యూడలిస్ట్ కోటలు ప్రజలతోనే బద్దలు కొట్టిస్తా. మీరు సిద్ధంగా ఉండండి. అన్ని స్థానాల్లోనూ జనసేన పార్టీ నామినేషన్లు వేస్తుంది. మా వారిని అడ్డుకోవడానికి కానీ భయపెట్టాలని, బెదిరించాలనిగాని చూస్తే కాళ్లు కీళ్లు ఇరగ కొట్టి కింద కూర్చోబెడతాం.

* మత్స్యకారులకు చివరి వరకు అండగా నిలబడతాం
నా పోరాట యాత్ర మత్స్యకారుల దీవెనలతోనే మొదలైంది. మత్స్యకారులకు చివరి వరకు అండగా నిలబడే వ్యక్తిని. కచ్చితంగా వారికి జెట్టీలు నిర్మించి గోవా, గుజరాత్ వంటి రాష్ట్రాలకు వలసలు వెళ్లకుండా నిరోధించే ఏర్పాటు చేస్తాం. మత్స్యకారులకు హాని కలిగించే ఏ చర్యనైనా ధైర్యంగా అడ్డుకుంటాం. మత్స్యకారులకు ఇబ్బంది కలిగించే జీవో నెంబర్ 217 ను బహిరంగంగా చింపేశాం. వారికి ఏ ఆపద వచ్చిన అండగా నిలబడతాను. వారికి అవసరమయ్యే ఏ పని చేయడానికి అయినా ముందు ఉంటాను. మత్స్యకారుల అభ్యున్నతికి జనసేన ప్రభుత్వం కచ్చితంగా ప్రాధాన్యమిస్తుంది.

* సంక్షేమ పథకాలు ఆపేది లేదు
పేదలకు మేలు జరిగే ఏ సంక్షేమ పథకాన్ని జనసేన ప్రభుత్వంలో నిలిపివేసేది లేదు. పేదలకు ఏ సంక్షేమ పథకాన్ని జనసేన ప్రభుత్వం లో దూరం చెయ్యం. వాటిని కొనసాగిస్తూనే ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తును మార్చేలా ప్రణాళిక ఉంటుంది. జనసేన పార్టీ పోరాటాన్ని నమ్ముకుంది. పేదలు ఆపదలో ఉంటే కచ్చితంగా ఎవరితోనైనా పోరాడుతాం. గెలుపు అనేదే రాజకీయంలో సూచిక ఐతే మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి నాయకులు ఏ పదవులు ఆశించి పోరాడారు..? కచ్చితంగా జనసేన గెలుపు ప్రభంజనాన్ని సైతం వైసీపీ కి రుచి చూపిస్తాం. వైసీపీ నాయకులు మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడుతాం… లేదంటే వారు వాడే భాషలోనే సమాధానం చెప్తాం. మా పార్టీ నాయకులకు అలాగే జనసైనికులు కూడా ఒకటే చెబుతున్న.. బలంగా పోరాడండి కేసులకు వెనకాడొద్దు. మీకు ఏమైనా అయితే నేను జైలుకు రావడానికి కూడా సిద్ధం. ఈ ప్రభుత్వం ఎంతమందిని అరెస్టు చేస్తుందో చేసుకోనివ్వండి. ప్రజా సమస్యల మీద పోరాటం మొదలు పెడితే జైళ్లను నింపేద్దాం. నేను మీతోనే ఉంటాను. నేను గాయపడిన పులి లాంటివాడిని… ఆ పులి పంజా దెబ్బ ఎలా ఉంటుందో ఈ దుర్మార్గపు వైసీపీ పాలకులకు రుచి చూపిస్తా.

* మావి మాటలు కాదు చేతలు
జనసేన పార్టీ రంగంలోకి దిగితే చేతనలే కనిపిస్తాయి. ఊరికే మాటలు చెప్పి పబ్బం గడిపే వ్యక్తిని అసలే కాదు. అన్నం పెట్టే రైతు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి కుటుంబాలకు ఎంతో కొంత సాయం చేయాలని తలచి, కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టాం. వారి కుటుంబాలకు అండగా నిలిచాం. పిల్లల భవిష్యత్తుకు చదువు చెప్పించే బాధ్యతను తీసుకున్నాం. అన్నం పెట్టే రైతు సుభిక్షంగా ఆనందంగా ఉంటే ఆ నేల కళకళలాడుతుంది అని పెద్దలు చెబుతారు. దానికి ఎల్లప్పుడూ జనసేన పార్టీ కట్టుబడి ఉంటుంది. ”
‘రైతు కన్నీరు తుడిచే రాజ్యం జనసేన లక్ష్యం’ అన్నది మా నినాదం.. విధానం. రైతులకు సిరిసంపదలు పంచే ప్రభుత్వంగా జనసేన ప్రభుత్వాన్ని తీర్చిదిద్దుతాం. అవినీతిపై ఎట్టి పరిస్థితుల్లో రాజీలేని పోరాటం చేస్తాం. అవినీతి చేసిన వారు కచ్చితంగా శిక్ష అనుభవించేలా చూసే బాధ్యత తీసుకుంటాం. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని కిందకు దింపుతాం… జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం” అని అన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular