Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : గుంకలం సాక్షిగా జగనన్న కాలనీల మోసాన్ని ఎండగట్టిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan : గుంకలం సాక్షిగా జగనన్న కాలనీల మోసాన్ని ఎండగట్టిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan : వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోనే అతిపెద్ద జగనన్న కాలనీ అంటూ పేర్కొన్న విజయనగరం కార్పోరేషన్ కి సమీపంలోని ‘గుంకలం జగనన్న కాలనీ’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి అర్భాటంగా ప్రారంభించిన పైలాన్ సాక్షిగా జగనన్న మోసాన్ని రాష్ట్ర ప్రజల ముందు ఉంచారు. గుంకలం కాలనీలో ఇళ్లను పరిశీలించారు. L కాలనీ లే అవుట్ పరిశీలించి, పునాదులు దాటని ఇళ్ల వద్దకు వెళ్లి స్థానిక నాయకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బేస్ మెంట్లు ఎన్నాళ్ల క్రితం వేశారు? ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు పూర్తి చేశారు? కేవలం పునాది స్థాయిలో ఎన్ని ఇళ్లు నిలిచిపోయాయి? ఏ కారణం చేత నిలచిపోయాయి? కాలనీలో అవినీతిపైనా ఆరా తీశారు. ఈ లే అవుట్లో కనీసం రహదారులు కూడా పూర్తి కాకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. తిరుగు ప్రయాణంలో కనీసం చదును చేయకుండా కేటాయించిన లే అవుట్ లో ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. లబ్దిదారుల విన్నపం మేరకు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. పునాదులపై వేసిన బేస్ మెంట్ కింద ఖాళీలు ఏర్పడి వర్షపు నీరు పారుతోందని లబ్దిదారులు చెప్పగా వాటిని కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. బేస్ మెంట్ కింద మట్టికరిగిపోతే ఇళ్లు ఎలా నిలబడతాయో పాలకులకే తెలియాలని అన్నారు.

• ఆనందపురం నుంచి అడుగడుగునా ఘనస్వాగతం
విశాఖపట్నం నుంచి గుంకలం హౌసింగ్ కాలనీ పరిశీలనకు బయలుదేరిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి అడుగడుగునా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం జంక్షన్ వద్ద వందలాది మంది జనసైనికులు, ప్రజలు హారతులు పట్టి ఆహ్వానించారు. గజమాలతో సత్కరించి, పూల వర్షం కురిపించారు. తన కోసం వచ్చిన మహిళలకు, కార్యకర్తలకు అభివాదం చేసి, కరచాలనం చేసి ఉత్సాహపరిచారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

• సింహాచలం పంచగ్రామాల సమస్యపై ప్లకార్డులు
ఆనందపురం జంక్షన్ వద్ద పవన్ కళ్యాణ్ కి తమ సమస్యలు ప్ల కార్డులు రూపంలో ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా సింహాచలం పంచగ్రామాల సమస్యపై పెద్ద సంఖ్యలో ప్లకార్డులు దర్శనమివ్వడంతో వాటిని తీసుకుని పరిశీలించారు. సమస్య పరిష్కారానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

• తగరపువలస వద్ద విజయనగరం జిల్లా శ్రేణుల ఆహ్వానం
తగరపువలస జంక్షన్ వద్ద విజయనగరం జిల్లాకు చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జిల్లాలోకి ఆహ్వానం పలికారు. జనసేన నినాదాలతో మారుమోగించారు. ఆడపడుచుల హారతులు స్వీకరించి ముందుకు కదిలారు.జనసేనాని రాకతో జనసంద్రమైన విజయనగరం.. రామునాయుడు పేట వద్ద బాణసంచా పేలుళ్లు, కేరింతల నడుమ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని స్వాగతించగా… జొన్నాడ వద్ద మరో గజమాల శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించింది. వీర మహిళలు గుమ్మడి కాయలతో దిష్టితీసి జనసేనానికి నీరాజనాలు పలికారు.

• విజయనగరంలో జన జాతర
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటన నేపధ్యంలో విజయనగరంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు సుమారు 7 కిలోమీటర్లు రహదారి మొత్తం జనప్రవాహంతో నిండిపోయింది. వి.టి. అగ్రహారం వై జంక్షన్ వద్ద మేళతాళాలు, బాణ సంచా పేలుళ్ళతో జనసేన శ్రేణులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం పలికాయి. గాంధీనగర్, ఇందిరానగర్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో ప్రతి అడుగునా మహిళలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు. వేలాదిగా తరలివచ్చిన జనసంద్రం విజయనగరాన్ని ముంచెత్తింది. జనసేన అధ్యక్షుల వారి వాహన శ్రేణి ప్రయాణించే మార్గం మొత్తం రహదారి జనంతో నిండిపోయింది. రహదారికి ఇరు వైపులా ఉన్న చెట్లు, ఇళ్లతో పాటు బస్సులపైకి కూడా ఎక్కి ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూసేందుకు ఎగబడ్డారు. మీ వెనుకే మేముంటామంటూ నినాదాలు చేశారు.

విజయనగరం పట్టణంలోనూ ప్రజలు తమ సమస్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకునేందుకు ఎగబడ్డారు.గాంధీనగర్ వద్ద తగరపువలసకు చెందిన శ్రీ రమణమూర్తి మాస్టారు తమ సమస్యలపై ఓ వినతిపత్రాన్ని పవన్ కళ్యాణ్ కి అందచేశారు. పవన్ కళ్యాణ్ ర్యాలీ విజయనగరం పట్టణంలో ఉన్న జనప్రవాహాన్ని దాటుకుని గుంకటం జగనన్నకాలనీ వద్దకు చేరడానికి మూడున్నర గంటలకు పైగా సమయం పట్టింది. కొంత మంది యువకులు విజయనగరం పట్టణం ప్రారంభం నుంచి గుంకలం వరకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ ని కాలి నడకన అనుసరించారు. అలా వాహన శ్రేణితో పాటు పరుగు పెడుతున్న ఓ యువకుడికి ఆయన జామపండును అందించారు. దారిపొడుగునా తన కోసం దండలు తెచ్చిన ప్రజలను నిరాశ పడకుండా ప్రతి ఒక్కరి నుంచి స్వీకరించారు.

గుంకలం జగనన్న కాలనీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సభ జరుగుతుండగా లబ్దిదారులు జగనన్న మోసం హ్యాష్ ట్యాగ్ తో ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. జనసేనాని రాక తర్వాత అయినా ఈ లే అవుట్ కి మోక్షం వస్తుందన్న ఆశాభావం లబ్ధిదారులు వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, ప్రధాన కార్యదర్శులు పాలవలస యశస్వి, టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, పార్టీ నాయకులు సుందరపు విజయ్ కుమార్, పరుచూరి భాస్కరరావు, సందీప్ పంచకర్ల, శ్రీ పీవీఎస్ఎన్ రాజు, శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్, శ్రీ బోడపాటి శివదత్, శ్రీమతి అంగ దుర్గాప్రశాంతి, శ్రీ గడసాల అప్పారావు, శ్రీ బొడ్డేపల్లి రఘు, శ్రీమతి తుమ్మి లక్ష్మీరాజ్, శ్రీ దాసరి రాజు, శ్రీ పెడాడ రామ్మోహన్, శ్రీ గేదెల చైతన్య, శ్రీ బాబు పాలూరి తదితరులు పాల్గొన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular