Outer Ring Road : “ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానం అరాచకం, దుర్మార్గం. ఎందుకంటే జాతి రత్నాలుగా ఉన్న నవరత్న కంపెనీలను తన ఇద్దరు ఇష్ట రత్నాలకు కట్టబెట్టడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారు. ఆ ఇద్దరూ గుజరాతి రత్నాలు.. నష్టాలను జాతికి అంకితం చేసి, లాభాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం కేంద్ర ప్రభుత్వ విధానం. ప్రభుత్వ రంగ సంస్థల ను కాపాడటమే తెలంగాణకు ముఖ్యం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడటం, ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్దపీట వేయడమన్నది కెసిఆర్ తో పాటు తెలంగాణ ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయం” వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు ఇవి. ఇంతటి ఉదాత్తమైన మాటలు మాట్లాడిన కేటీఆర్.. నేడు అదే తెలంగాణలో ప్రభుత్వానికి కాసులు కురిపించే ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ పరం చేయడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ప్రైవేట్ కి వ్యతిరేకం అంటూనే నెత్తి మాసిన నిర్ణయం
గణనీయమైన లాభాలు ఆర్జిస్తున్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును తెలంగాణ ప్రభుత్వం ప్రవేటుకు అప్పగించడమే నెత్తి మాసిన నిర్ణయం. ప్రైవేట్ పరం చేస్తున్న నరేంద్ర మోదీకి మేము వ్యతిరేకం అంటూనే.. ఔటర్ రింగ్ రోడ్డును కెసిఆర్ సర్కారు ఏకంగా 30 సంవత్సరాల లీజుకు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్తుల నగదీకరణ పై పదేపదే కేంద్ర విధానాలను తప్పుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. వారు కూడా అదే బాటలో పయనించడం విస్మయాన్ని కలిగిస్తోంది. బంగారు తెలంగాణ అని పైకి చెబుతూ ఇలా ప్రభుత్వ ఆస్తులను ఎందుకు తాకట్టు పెట్టాల్సి వస్తోంది అనే ప్రశ్నకు రాష్ట్ర పెద్దల వద్ద సమాధానం లేదు. పైగా నగదీకరణ విషయంలో తాము అత్యుత్తమమైన విధానాన్ని అవలంబిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు ఎదురుదాడికి దిగడం గమనార్హం.. ఒకవేళ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు అది ఉత్తమ నిర్ణయం అయితే అది ఏమిటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈ లీజుకు సంబంధించి లెక్కలేవి బయటకు చెప్పకుండా ప్రభుత్వం అసాధారణమైన గోప్యత పాటిస్తోంది.
ప్రతి ఏటా లాభాలే
ఔటర్ రింగ్ రోడ్డు విస్తీర్ణం మొత్తం 158 కిలోమీటర్లు. అందులో అత్యధిక భాగం (156.9 కి.మీ) నిర్మాణం 2016 సెప్టెంబర్ 12 నాటికి అందుబాటులోకి వచ్చింది. అప్పటినుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఫీజుల ద్వారా వస్తున్న వార్షిక ఆదాయాన్ని పరిశీలిస్తే కోవిడ్ ప్రభావం ఉన్న 2019_20, 2020_21 సంవత్సరాల్లో తప్ప, మిగిలిన అన్ని సంవత్సరాలలోనూ గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. లెక్కల్లో చెప్పాలంటే 2016_ 17 ఔటర్ రింగ్ రోడ్డు టోల్ బస్సులు 123.53 కోట్లు కాగా.. 2017_ 18 లో ఆ ఆదాయం 202.39 కోట్లకు పెరిగింది. 63% అధికం అన్న మాట.2018_19 లో అది రూ.340 కోట్లకు(అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 68%కి పైగానే)..2019_20లో రూ. 351.11 కోట్లకు చేరింది. 2020 ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోవిడ్ నెలల్లో కోవిడ్ భయంతో ట్రాఫిక్ తగ్గడంతో వృద్ధి చాలా తక్కువగా నమోదయింది. ఆ తర్వాత ఏడాది అంటే 2020_21 కొవిడ్ కాలం.లాక్ డౌన్ లతో వాహనాలు రోడ్డు ఎక్కని కాలం. కొంతకాలం పాటు పెద్ద పెద్ద ట్రక్కులకు అసలు టోల్ వసూలు చేయకూడదని ఆ సమయంలో కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ ఔటర్ రింగ్ రోడ్డుకు 310 కోట్ల ఆదాయం సమకూరింది. తక్కువ ఆదాయం ఏమి కాదు. కోవిడ్ సమయంలో మూత పడిపోయిన చాలా సంస్థలు, వ్యాపారాలతో పోలిస్తే గణనీయమైన ఆదాయమే. ఇక కోవిడ్ పీడ ముగిసిన తర్వాత అంటే 2021_ 22లో మళ్లీ టోల్ వసూళ్లు 421.82 కోట్లకు పెరిగాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు 36% పెరుగుదల అది. గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2022_23 లో ఔటర్ రింగ్ రోడ్డుపై వసూలైన టోల్ ఫీజుల మొత్తం 542.74 కోట్లు. అంటే దాదాపు 28 శాతానికి పైగా వృద్ధి నమోదయింది.