Homeఆంధ్రప్రదేశ్‌NTR 99th Jayanthi: తెలుగు చరిత్రలో యుగపురుషుడు ఎన్టీఆర్.. నేడు ఆయన 99వ జయంతి

NTR 99th Jayanthi: తెలుగు చరిత్రలో యుగపురుషుడు ఎన్టీఆర్.. నేడు ఆయన 99వ జయంతి

NTR 99th Jayanthi: ఢిల్లీలో తెలుగోళ్లు అంటే చులకన.. తెలుగోళ్లు అంటే అవహేళన.. విమానాశ్రయంలోనే అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం అంజయ్యను అవమానించిన హీన చరిత్ర.. కాంగ్రెస్ హయాలో తెలుగోళ్లకు అస్సలు ప్రాధాన్యతే లేదు. కానీ మన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక తెలుగు వెలుగులు ప్రసరించాయి. తెలుగు వాడైన పీవీ ప్రధానిగా పోటీచేస్తే పోటీపెట్టకుండా సాయం చేసిన మహనీయుడు మన తారక రాముడు.. తెలుగు చలన చిత్రపరిశ్రమకు ఆదిపురుషుడు.. చిత్ర పరిశ్రమను నిలబెట్టిన యోధుడు ఎన్టీఆర్.. వెండితెర ఇలవేల్పుగా.. అనంతరం తెలుగు రాజకీయాలను మార్చిన నేతగా చెరగని ముద్రవేసిన సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి నేడు.

ఎన్టీఆర్ తెలుగు సినిమాకు చుక్కాని.. తెలుగు సినిమా మొదలైనప్పటి నుంచి ఆయన తెలుగువారితోనే ఉన్నారు. సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఆంధ్రుల అభిమాన ‘అన్నగారు’గా మారారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వేదికగా చాటారు. 9 నెలల్లో కాంగ్రెస్ ను పాతరేసి తెలుగుదేశాన్ని అధికారంలోకి తెచ్చారు.

ఎన్టీఆర్ సినీరంగ ప్రవేశం నుంచి చివరి సినిమా వరకు, రాజకీయాల్లోకి మారాక కూడా విలువలు పాటిస్తూ ఆంధ్రుల గుండెల్లో నిలిచిపోయారు. ఎన్టీఆర్ లోని నటుడిని, దర్శకుడిని నిర్మాతను, కళాకారుడిని, మానవాతమూర్తిని, ప్రయోగశీలిని, వితరణశీలిని, అభ్యుదయ వాదిని, దార్శనికుడిని తెలుగు ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు.   అందుకే ఆయన మనతో లేకున్నా ఆ యుగ పురుషుడిని మన స్మరించుకుంటూనే ఉంటాం.. నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయనను తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు వారు ఘనంగా  స్మరించుకుంటున్నారు.

-ఎన్టీఆర్ బయోగ్రఫీ
తెలుగు వారు ‘అన్నగారు’ అని అభిమానంతో పిలుచుకునే నందమూరి తారకరామరావు మే 28.. 1923లో జన్మించారు. 1983లో టీడీపీనీ స్థాపించిన ఎన్టీఆర్‌ది కృష్ణజిల్లా నిమ్మకూర్‌ గ్రామం. ఈ గ్రామం గుడివాడ నియోజకవర్గంలో ఉంది. ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించిన తరువాత 9 నెల్లోనే అధికారంలోకి వచ్చారు. 1982 అక్టోబర్ 3 నుంచి 1983 జనవరి 3 వరకూ ప్రజల్లోకి చైతన్యరథంతో వెళ్లి సభల్లో ప్రసంగించారు. 35 వేల కి.మీలు తిరిగారు. ఆ తర్వాత గుడివాడ నుంచి 1983,85 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అయితే  ఆ తరువాత ఎన్టీఆర్‌ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన కుమారుడు బాలకృష్ణ సైతం 2014 ఎన్నికల్లో  ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందడం విశేషం.  అల్లుడు చంద్రబాబు అధికారంలోంచి కూలదోసి పగ్గాలు తీసుకోవడంతో మనస్థాపం చెంది 1996 జనవరి 18న   గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించారు.

-ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం
దశాబ్ధాల కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే కూకటివేళ్లతో పెకిలించిన నాయకుడు ఎన్టీఆర్. ఆయన ప్రజాప్రస్థానం అనితర సాధ్యం. 60 ఏళ్ల వయసులో రాజకీయ పార్టీని స్థాపించి అధికారంలోకి తేవడమే కాదు.. ఏడున్నరేళ్ల పాటు సీఎంగా పనిచేసి ఆయన చేసిన అసాధారణ సంస్కరణలే ఇప్పుడు సామాన్యుల్లో ఎన్టీఆర్ ను ప్రజా నాయకుడిగా చేశాయి. రాజకీయాలంటే వ్యాపారం కాదు.. పేదల అభ్యున్నతి అని చాటిన మహానుభావుడు ఎన్టీఆర్. పేదలకు రూ.2 కిలో బియ్యం, సగం ధరకే జనతా వస్త్రాలు, పక్కా ఇళ్లు, బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇలా ఎన్నో పథకాలు, సంక్షేమాలు, సంస్కరణలతో తెలుగు నాట విప్లవాన్ని సృష్టించిన గొప్ప రాజకీయ నేత ఎన్టీఆర్.

-తెలుగు సినీ చరిత్రలో యుగపురుషుడు ఎన్టీఆర్
తెలుగు సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ధృవతారలా నిలిచిపోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. నేడు ఎన్టీఆర్ 99వ జయంతి. ఎన్టీఆర్ అంటే.. తెలుగు సినిమా స్థితని , తెలుగు రాజకీయాల గతిని మార్చిన ఒక శక్తి, అంత గొప్ప మహానుభావుడికి భారత రత్న రాకపోవడం నిజంగా భారతరత్నకే అది అవమానం. అందుకే మెగాస్టార్ లాంటి హీరోలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగానైనా ఆయనకు భారతరత్న వచ్చేలా చూడాలని మెగాస్టార్ కోరారు.

అయితే, ఎన్టీఆర్ కి భారతరత్న రావాలి అనే చిరు కోరిక ఎప్పటికైనా తిరుగుతుందా ? నేటి రాజకీయ అవసరాలను బట్టి బిరుదులు ఇస్తున్నారు. అలాంటప్పుడు ఎన్టీఆర్ భారత రత్న ఇస్తారా ? అయినా ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అయితే ఎన్నో గొప్ప బిరుదులు వచ్చినా ఆయన ఎప్పుడూ పొంగిపోలేదు.

తనకు ప్రజల అభిమానమే నిజమైన అవార్డు అని ఎన్టీఆర్ ఎప్పుడూ భావించేవారు. ఆయన ఈ లోకాన్ని విడిచి పదుల సంవత్సరాలు గడిచిపోతున్నా.. ఆయనను తెలుగు ప్రజలు తమ హృదయాల్లో ఇప్పటికీ శాశ్వతంగా బంగారు ముద్ర రూపంలో భద్రపరుచుకున్నారు. కాగా నేడు ఆయన జయంతి కావడంతో యావత్తు అభిమాన లోకంతో పాటు సినీ లోకం కూడా ఆయనను స్మరించుకుంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version