HomeతెలంగాణKCR - BRS : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు వచ్చే సీట్లు ఇవే:...

KCR – BRS : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు వచ్చే సీట్లు ఇవే: తేల్చి చెప్పేసిన కేసిఆర్

KCR – BRS : “మనది ఉద్యమ పార్టీ. తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మనమే అధికారంలో ఉన్నాం. వచ్చే ఎన్నికల్లోనూ మనమే విజయం సాధించాలి. ఇందుకు ఏ అవకాశాన్ని కూడా వదులుకోవద్దు.” అని ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ విస్తృత సమావేశంలో పిలుపునిచ్చారు.. కర్ణాటక ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి మద్దతు ఇచ్చిన జనతాదళ్ సెక్యులర్ దారుణమైన ఓటమి మూట కట్టుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అకస్మాత్తుగా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఏం చేశామో ప్రజలకు చెప్పాలి

తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మనం ప్రజలకు ఏం చేశామో చెప్పాలని కెసిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతులను చెరువుల దగ్గరికి పిలిపించి సమావేశాలు నిర్వహించాలని, చెరువు గట్ల దగ్గరకు పిలిచి కలిసి భోజనం చేయాలని పిలుపునిచ్చారు. 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసింది ఏమీ లేదని, ప్రజలు వారిని నమ్మరని కెసిఆర్ స్పష్టం చేశారు.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అంటే అది ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ వైఫల్యం అని కెసిఆర్ పేర్కొన్నారు. జూన్ 2 న తెలంగాణ ఆవిర్భవించి పది సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేకాదు వేడుకలను పర్యవేక్షించాలని మంత్రులకు కూడా సూచించారు.

ఎన్ని సీట్లు గెలుస్తామో చెప్పిన కేసీఆర్

ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితి 105 సీట్లు గెలుస్తుందని కెసిఆర్ చెప్పారు. ప్రతిపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, అలా అని చెప్పి పని చేయకుండా ఉండొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు తెలంగాణ రాష్ట్రంలో అంత సీన్ లేదని, బిజెపి బలపడే అవకాశాలు తక్కువని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నారని, వారి జాబితా నా వద్ద ఉందని కెసిఆర్ హెచ్చరించారు. కర్ణాటక ఫలితాలను పట్టించుకోవద్దని కేడర్ కు సూచించారు. అక్కడ ఎవరు గెలిచినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ముందస్తు జాగ్రత్తగా

వాస్తవానికి కెసిఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని అనుకోలేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత భారత రాష్ట్ర సమితిలోనూ ఒక డైలమా ఏర్పడింది. పైగా భారత రాష్ట్ర సమితి మద్దతు ఇచ్చిన జనతా దళ్ సెక్యులర్ దారుణంగా ఓడిపోవడంతో ఇక్కడ కూడా అలాంటి ఫలితాలు వస్తాయేమోననే భయంతో కెసిఆర్ ముందు జాగ్రత్త చర్యలకు దిగారు. ఇందులో భాగంగానే అప్పటికప్పుడు పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అంతేకాదు గతంలో నిర్వహించిన సమావేశాలలో ఆగ్రహంగా మాట్లాడిన కేసీఆర్.. ఈసారి మాత్రం బుజ్జగించే స్వరంతో కనిపించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే విషయాన్ని తేల్చి చెప్పని కేసీఆర్.. అందరూ మాత్రం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. అయితే చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి పోరు ఉన్న నేపథ్యంలో అందరిని కూడా సమావేశానికి ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. ఎవరికి టికెట్లు ఇస్తారో ఎవరికి ఎవరో తెలియదు కానీ ప్రస్తుతానికైతే అందర్నీ బుజ్జగించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. కర్ణాటక ఫలితం తెలంగాణలో పునరావృతం కాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో ఆరు నెలల్లో జరిగే ఎన్నికల్లో ఓటరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనే దాని పైన భారత రాష్ట్ర సమితి భవితవ్యం ఆధారపడి ఉంది.

Aim To Win 105 Seats In Next Assembly Elections | Says CM KCR In Crucial BRS Meeting

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version