CM Revanth Reddy: ప్లానింగ్ లేదు.. ఇప్పటి కరువుకు రేవంత్ నే కారణమా?

"గత ఏడాది వర్షాలు సరిగ్గా కురవలేదు. ఫలితంగా రిజర్వాయర్లలో నీళ్లు లేవు. ఎండలు ముదురుతున్నాయి. ఇలాంటి తరుణంలో సాగునీరు ఇవ్వాలని రైతుల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Written By: NARESH, Updated On : March 7, 2024 11:51 am

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: ఎన్ని తప్పులు చేసినా.. ప్రాజెక్టులు కూలిపోయేలా నిర్మించినా.. నీటి మేనేజ్ మెంట్ విషయంలో గత 5 ఏళ్లలో ఏనాడు ఇబ్బంది కాలేదు. రైతులకు నీళ్లు వచ్చాయి. కాళేశ్వరం నుంచి కరువు సీమ మెదక్ వరకూ నీళ్లు పారాయి. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ లోనూ నీళ్లు పారాయి. కానీ కేసీఆర్ లోపాలు ఎత్తి చూపాలని.. ప్రాజెక్టుల్లో నీళ్లు వదిలేసి కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూసింది. అయితే ఆ నీరు వదలడమే శాపమైంది. ఇప్పుడు రైతులకు నీటి కరువు వచ్చింది. తాగునీటికి నీళ్లు లేని పరిస్థితి. మరి ఈ ఎండాకాలాన్ని ముందు చూపులేని రేవంత్ సర్కార్ ఎలా దాటుతుందన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న..

“గత ఏడాది వర్షాలు సరిగ్గా కురవలేదు. ఫలితంగా రిజర్వాయర్లలో నీళ్లు లేవు. ఎండలు ముదురుతున్నాయి. ఇలాంటి తరుణంలో సాగునీరు ఇవ్వాలని రైతుల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ నీరు ఇచ్చే పరిస్థితి లేదు. రైతులు అర్థం చేసుకోవాలని” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎండాకాలంలో తాగునీటి కష్టాలు రాకుండా చూసుకుంటామని ప్రకటించారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు తగ్గట్టుగానే రాష్ట్రంలో పరిస్థితి ఉంది. నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. సాగునీటి కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు.

గత ఏడాది జూలై చివరి వారంలో కురిసిన భారీ వర్షాల వల్ల ఒక్కసారిగా నీరు వచ్చింది. కానీ చెరువులకు గండ్లు పడటంతో నీరు వృధాగా పోయింది. ప్రాజెక్టులు నిండినప్పటికీ నిల్వ నీటి సామర్థ్యం లేకపోవడంతో ఆశించినంత స్థాయిలో నీరు నిల్వ లేకుండా పోయింది. ఫలితంగా ఫిబ్రవరి మొదటి వారానికే చాలా వరకు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. మరోవైపు మేడిగడ్డ లాంటి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రెండు పిల్లర్లు కుంగిపోయాయి. దీంతో గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదు. మరోవైపు పంపు హౌస్ లకు సంబంధించిన మోటర్లు గత వానా కాలంలో నీట మునిగాయి.. వాటిని ఇతర దేశాల నుంచి అప్పట్లో దిగుమతి చేసుకున్నారు. వాటికి మరమ్మతులు చేయాలంటే అక్కడి నుంచి నిపుణులు రావాలి.. దాని ఖర్చు ఎవరు భరించాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో అవి పని చేయడం లేదు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సాగునీటి ఎద్దడి నెలకొందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇక బుధవారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను వెల్లడించారు. గత ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకంలో చేరకపోవడం వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తాము ఆ పథకంలో చేరుతున్నట్టు రేవంత్ ప్రకటించారు. రైతుల కేవలం వాణిజ్య పంటలకు మాత్రమే పరిమితం కావద్దని.. తెలంగాణ భూముల దృష్ట్యా 22 పంటలు సాగు చేసుకునే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్రంలో 110 కేంద్రాలలో ప్రయోగాత్మకంగా రైతు నేస్తం పథకం అమలు చేస్తున్నామని ప్రకటించిన రేవంత్ రెడ్డి.. రైతులతో ఆన్ లైన్ లో సంభాషించారు. సాగులో వారు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఓవరాల్ గా ఇప్పుడు కరువు అని.. నీళ్లు లేవు అని చెబుతున్న రేవంత్ రెడ్డి.. ఉన్న నీటిని ఎందుకు వృథాగా కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి వదిలేసిందన్నది ప్రశ్న. అక్కడి నుంచి ఎత్తి పోసి ఎల్లంపల్లి, మిడ్ మానేరు అటు నుంచి సిద్దిపేట, ఇల్లంతకుంట, మెదక్ ప్రాజెక్ట్ లలోకి ఎందుకు ఎత్తిపోయలేదన్నది రైతులు నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తి చూపే ప్రయత్నంలో ఈ కరువుకు రేవంత్ రెడ్డి కారణమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.