AP BJP: ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు?

జూలైలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియమితులయ్యారు. అప్పట్లో చాలామంది నేతల పేర్లు వెలుగులోకి వచ్చినా.. హై కమాండ్ మాత్రం పురందేశ్వరుని నియమిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది.

Written By: Dharma, Updated On : December 25, 2023 9:33 am

AP BJP

Follow us on

AP BJP: ఏపీ బీజేపీకి కొత్త సారధి రానున్నారా? పురందేశ్వరి మార్పు అనివార్యమా? ఆ మేరకు హై కమాండ్ ఆలోచన చేస్తుందా? ఇద్దరు నేతల పేర్లను అధిష్టానం పరిగణలోకి తీసుకుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బిజెపి వర్గాల్లో ఇదే తరహా ప్రచారం జరుగుతోంది. బిజెపి హై కమాండ్ సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కీలక రాష్ట్రాల్లో నాయకత్వాల మార్పుపై దృష్టి పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్పు చేయాలని ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక్కడ పురందేశ్వరి తో పాటు తెలంగాణలో కిషన్ రెడ్డిని మార్చుతారని టాప్ నడుస్తోంది.

ఈ ఏడాది జూలైలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియమితులయ్యారు. అప్పట్లో చాలామంది నేతల పేర్లు వెలుగులోకి వచ్చినా.. హై కమాండ్ మాత్రం పురందేశ్వరుని నియమిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కానీ పురందేశ్వరి అనుకున్న స్థాయిలో పని చేయడం లేదని హై కమాండ్ కు ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆమెపై చాలామంది నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ నాయకత్వం అధ్యక్ష మార్పు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆరు నెలల వ్యవధిలోనే మార్పునకు మొగ్గు చూపుతారా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.

ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధ్యక్ష స్థానం రెడ్డి సామాజిక వర్గానికి అప్పగించాలన్న డిమాండ్ ఉంది. దీంతో కొద్ది నెలల కిందటే బిజెపిలో చేరిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనకు పార్టీలో చేర్చుకునే సమయంలోనే రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇవ్వాలని చర్చ జరిగింది. కానీ బిజెపిలో ఆ పరిస్థితి లేదు. అందుకే కొద్ది రోజులు ఆగాలని హై కమాండ్ సూచించినట్లు తెలుస్తోంది. సమీకరణలో భాగంగా పురందేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారని.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో వ్యూహంలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డికి తెరపైకి తెస్తారని బిజెపిలో ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఒకవేళ బీసీలకు ఇవ్వాలని చూస్తే మాత్రం సత్య కుమార్ కు పదవి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు తెలంగాణలో సైతం అధ్యక్ష పీఠాన్ని తిరిగి బండి సంజయ్ కు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది.

ఏపీ ఎన్నికలకు సంబంధించి బిజెపి వ్యూహం అన్నది ఏమిటి తెలియడం లేదు. టిడిపి,జనసేన కూటమిలో బిజెపి చేరుతుందా? లేదా ఒంటరి పోరాటం చేస్తుందా? అన్నది తెలియడం లేదు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన తమతో కలిసి నడవాలని బిజెపిని కోరుతోంది. బిజెపి నుంచి మాత్రం ఎటువంటి స్పష్టత లేదు. ఏపీ బీజేపీ నేతల మాత్రం హై కమాండ్ నిర్ణయం మేరకు ఒత్తులు ఉంటాయని చెప్తున్నారు. అదే సమయంలో బిజెపితో పొత్తు విషయంలో ఇప్పుడు టిడిపిలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బిజెపి అధ్యక్ష మార్పు కీలకంగా మారింది. ఒకవేళ కొత్త అధ్యక్షులను నియమిస్తే బిజెపి మూడ్ తెలియనుంది.