National Girl Child Day : పుట్టనిద్దాం.. ఎదగనిద్దాం.. చదవనిద్దాం.. బాలికలకు భవితనిద్దాం

ప్రపంచానికి బలమైన మహిళలు అవసరం. ఇతరులను ఎత్తుకొని నిర్మించే, ప్రేమించే గుణం వారికి మాత్రమే ఉంటుంది. ధైర్యంగా జీవించే మహిళలు మృదువుగా, ఉగ్రంగా, లొంగని స్వభావాన్ని కలిగి ఉంటారు. :అమీ టెన్నీ

Written By: Anabothula Bhaskar, Updated On : January 24, 2024 11:27 am
Follow us on

National Girl Child Day : ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంటుంది. ఎదిగే అధికారం ఉంటుంది. తన తరాన్ని విస్తరించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ అవకాశం ఆడపిల్లలకు లేదు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది ముమ్మాటికి నిజం. కేరళ, ఇంకా కొన్ని రాష్ట్రాలు మినహాయిస్తే కొన్ని రాష్ట్రాలలో నేటికీ ప్రతి 1000 మంది బాలురకు 900 నుంచి 950 వరకే బాలికలు ఉన్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరీ ఘోరం. అక్కడ వెయ్యి మంది బాలురకు 910 లోపే బాలికలు ఉన్నారంటే లింగ వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ లింగ వివక్ష పెరగడానికి వరకట్నం అనేది ప్రధాన కారణం కాగా.. నిరక్షరాస్యత, పేదరికం, సామాజిక కట్టుబాట్లు.. ఇతర కారణాలుగా ఉన్నాయి.. నేడు జాతీయ బాలిక దినోత్సవ సందర్భంగా దేశంలో పరిస్థితులపై కథనం.

జాతీయ బాలిక దినోత్సవం 2008 జనవరి 24న ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం జనవరి 24న దేశవ్యాప్తంగా బాలిక దినోత్సవం నిర్వహిస్తున్నారు. లింగ వివక్షను రూపుమాపడం, బాలికల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచడం, గర్భవిచ్చిత్తులను నిరోధించడం, బాలికలకు సమాన హక్కులు పెంపొందించడం, అన్ని రంగాలలో వారిని ప్రోత్సహించడం.. వంటివి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు. బాలికల అభ్యున్నతికి మహిళ, శిశు అభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, విద్యాశాఖలు సమిష్టిగా కృషి చేయాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. మరీ ముఖ్యంగా లింగ వివక్షతను రూపుమాపాలని నిర్ణయించింది. అప్పటినుంచి ఈ మూడు శాఖలు కీలకంగా పనిచేస్తున్న నేపథ్యంలో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు, ఆడపిల్లలకు వివిధ రంగాల్లో ఇస్తున్న స్వేచ్ఛ, కల్పిస్తున్న అవకాశాలు తల్లిదండ్రుల ఆలోచన విధానాన్ని మార్చేశాయి. అయినప్పటికీ కొన్నిచోట్ల నేటికీ లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. బాల్య వివాహాలు చేయడం, పురిట్లోనే ఆడపిల్లను అంతమొందించడం, భ్రూణ హత్యలు వంటివి జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్ల అని తెలిస్తే చాలు పసికందు అని చూడకుండా ముళ్ళపొదల్లో బయటపడేస్తున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే కచ్చితంగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. ప్రభుత్వాలు చట్టాల్లో ఇంకా మార్పులు తేవాలి. భ్రూణ హత్యలను చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే లింగవివక్ష అనేది ఉండదు. సమ సమాజం ఏర్పడుతుంది.

ఇక 2008 నుంచి బాలిక దినోత్సవం నిర్వహిస్తూ ఉండడం.. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న మూలాన ఆడపిల్లల్లో డ్రాప్ అవుట్ తగ్గింది. ఉన్నత విద్యను వారు అభ్యసించేందుకు అవకాశం కలిగింది. ఇతర దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్ళేందుకు ఆస్కారం కలిగింది. భూతలం నుంచి గగనతలం వరకు ఉన్న అన్ని రంగాలలో రాణించేందుకు వారికి సౌలభ్యం ఏర్పడింది. బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మరుసటి సంవత్సరం 2015లో బేటి బచావో భేటి పడావో అనే కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం బాలికలకు సాధికారత కల్పించడం. వారికి అవకాశాలు సృష్టించడం. దేశం మాత్రమే కాదు ఖండాంతరాలకు వెళ్లే విధంగా ప్రోత్సహించడం.. అయితే ఈ పథకానికి ప్రభుత్వం కేటాయింపులు పెంచాలని గతంలో డిమాండ్లు వ్యక్తం అయ్యాయి. ఈ బడ్జెట్లో ఈ పథకానికి కేటాయింపులు పెంచుతామని కేంద్రం చెబుతోంది. ప్రతి ఏటా బాలికల దినోత్సవానికి ఒక థీమ్ నిర్ణయిస్తారు. 2019లో ఎంపవర్ గర్ల్స్ ఫర్ ఏ బ్రైటర్ టుమారో, 2020లో మై వాయిస్, కామన్ ఫ్యూచర్, 2021లో డిజిటల్ జనరేషన్ అవర్ జనరేషన్ ..వంటి థీమ్ లు ప్రకటించారు. ఈ ఏడాది ఎటువంటి థీమ్ నిర్ణయించలేదు.

బాలికల గురించి గొప్ప గొప్ప వాళ్ళు ఏమన్నారంటే..

మహిళలుగా మనం ఏమి సాధించగలమో దానికి పరిమితి లేదు: మిచెల్ ఒబామా

ఒక పురుషుడు అన్నింటినీ నాశనం చేయగలిగితే.. వాటన్నింటినీ ఒక అమ్మాయి గాడిలో పెట్టగలదు: మలాలా యూసఫ్ జాయ్

ఒక అమ్మాయికి సరైన బూట్లు ఇవ్వండి.. ఆమె ప్రపంచాన్ని జయించగలదు: మార్లిన్ మన్రో

పురుషులు చేయగలిగినదంతా ఆడపిల్లలు చేయగలరు. కొన్నిసార్లు పురుషులకంటే వారికి ఎక్కువ ఊహ ఉంటుంది.. కేథరిన్ జాన్సన్

బలమైన స్త్రీ కంటికి సవాల్ గా ఏదీ కనిపించదు. ఎందుకంటే ఆమె ప్రతి సవాల్ ను స్వీకరిస్తుంది కాబట్టి: గినా కారీ

ప్రపంచానికి బలమైన మహిళలు అవసరం. ఇతరులను ఎత్తుకొని నిర్మించే, ప్రేమించే గుణం వారికి మాత్రమే ఉంటుంది. ధైర్యంగా జీవించే మహిళలు మృదువుగా, ఉగ్రంగా, లొంగని స్వభావాన్ని కలిగి ఉంటారు. :అమీ టెన్నీ