Munugodu Bypoll Congress : తెలంగాణను ఇచ్చిన పార్టీకి ఈ రాష్ట్రంలో నూకలు లేకుండా చేసిన పరిస్థితి. రెండు సార్లు అధికారం చేపట్టిన కేసీఆర్ కాంగ్రెస్ లోని కీలక నేతలందరినీ లాగేసి ఆ పార్టీని చావుదెబ్బ తీశాడు. కాంగ్రెస్ పని ఖతమైందని సంబరపడ్డాడు. కానీ తాడిని తన్నేవాడుంటే.. వాడి తలదన్నేవాడుంటాడన్నది సామెత.. బలహీన కాంగ్రెస్ ను దెబ్బతీశామన్న సంబరం కేసీఆర్ లో పోకముందే.. బలమైన బీజేపీ వచ్చిపడింది. పులిపై స్వారీ చేశానని సంబరపడ్డ కేసీఆర్ కు సింహంతో ఆట మొదలైంది. కేసీఆర్ ను వరుస ఎన్నికల్లో ఓడగొట్టి బీజేపీ షాకిచ్చింది. ఇప్పుడు ఏకంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సాగుతోంది. దీంతో బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ అన్న ఆలోచనకు కేసీఆర్ వచ్చేశారు. కాంగ్రెస్ ను దెబ్బతీసే ప్రయత్నాలు మానుకొని బీజేపీ వెంటపడ్డారు. అదే కాంగ్రెస్ కు ఊపిరి లూదుతోంది.

-పతనం నుంచి కోలుకుంటున్న కాంగ్రెస్
కాంగ్రెస్ ను ఎవరో వచ్చి దెబ్బతీయాల్సిన అవసరం లేదు. వాళ్లకు వాళ్లే తన్నుకు చస్తారన్నది సామెత. అవును అటు ఢిల్లీలో అయినా.. ఇటు తెలంగాణ గల్లీలో అయినా పార్టీలో ఉంటూనే అసమ్మతి రాజేసేంత స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఈ కాంగ్రెసోళ్ల సొంతం. ఢిల్లీ స్తాయిలో శశిథరూర్ లాంటి వారు.. తెలంగాణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు పార్టీలో ఉంటూనే పార్టీపై తిరుగుబాటు చేస్తారు. విశేషం ఏంటంటే వీరిని తీసేయడానికి కాంగ్రెస్ అధిష్టానానికి మనసు రాదు. ఇంత చేసినా పార్టీలోనే ఉంచుతారు. ఇదే కాంగ్రెస్ ను అథ: పాతాళానికి పడేస్తోంది. తెలంగాణలోనూ ఇలానే ముఖ్యమైన కాంగ్రెస్ నేతలను కేసీఆర్ లాగేస్తే ఆ పార్టీ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ అధిష్టానం తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ‘రేవంత్ రెడ్డి’ని పీసీసీ చీఫ్ చేయడం.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిరుగుబాటు చేసినా.. భట్టి వద్దన్నా.. కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకించినా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పి కేసీఆర్ తో సరితూగే నేతను నిలబెట్టారు. అదే కాంగ్రెస్ కు ఊపిరిలూదింది.. ఇప్పుడు తెలంగాణలో కోలుకునేలా చేసింది.
-రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పూర్వవైభవం
తెలంగాణలో పని అయిపోయిందనుకుంటున్న పార్టీకి రేవంత్ రాక నిజంగా ఊపిరిలూదినట్టైంది. పూర్వవైభవం దిశగా నడిపిస్తోంది. రాహుల్ గాంధీ పాదయాత్ర నుంచి మునుగోడ ప్రచారం వరకూ ఎంత అసమ్మతి ఉన్నా రేవంత్ రెడ్డి నడిపించాడు. నిజానికి చాలా ఎగ్జిట్ పోల్స్ లో మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ తో సమానంగా కాంగ్రెస్ ఉందని అన్నారు. ఇక బీజేపీ మూడో స్థానంలో ఉందని.. మునుగోడులో రెండో ప్లేసు కాంగ్రెస్ దేనని అంటున్నారు. ఫలితాలు వచ్చే వరకూ ఈ కన్ఫ్యూజన్ వీడదు. అయితే పతనమైపోయిన కాంగ్రెస్ కు ఈ మాత్రం ఓట్లు అయినా వస్తున్నాయంటే అదంతా రేవంత్ రెడ్డి పోరాటపటిమ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
-రేవంత్ ప్లాన్లే బతికించాయి
మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ లు డబ్బులు , మద్యం, బంగారం విరుచుకుపడుతుంటే.. కాంగ్రెస్ నేతలంతా ఓటర్ల కాళ్లకు దండాలు పెట్టి డబ్బులు లేని కాంగ్రెస్ కు ఓటు వేయాలన్న రేవంత్ రెడ్డి స్ట్రాటజీ పనిచేసింది. మునుగోడు ఓటర్లు అయితే టీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ కు ఓటు వేస్తామన్నారు కానీ.. రాజగోపాల్ రెడ్డికి మాత్రం వేస్తామని ఏ ఒపినీయన్ పోల్ లోనూ చెప్పలేదు. ఆయన అమ్ముడుపోయారని ఆరోపించారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఆ సానుభూతిని కల్పించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కాకున్నా వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి ఈ సానుభూతి అన్నది కాంగ్రెస్ కు బూస్ట్ లా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మొత్తంగా చూసుకుంటే.. తెలంగాణలో బలమైన టీఆర్ఎస్, బీజేపీ మధ్యలో పతనమైన కాంగ్రెస్ నేనూన్నాని మునుగోడుతో నిరూపించింది. మరీ తీసికట్టుగా వదిలేయకుండా ఇక్కడ ముక్కోణపు పోటీకి కారణమైంది. కనుమరుగవుతున్న పార్టీని ఈ స్థాయిలో పోటీనిచ్చేలా చేసిన ఘనత మాత్రం రేవంత్ రెడ్డిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.