Homeఆంధ్రప్రదేశ్‌Mudragada Padmanabham : జోకర్ కార్డులా కాపు ఉద్యమం.. ముద్రగడ సంచలన వ్యాఖ్యలు

Mudragada Padmanabham : జోకర్ కార్డులా కాపు ఉద్యమం.. ముద్రగడ సంచలన వ్యాఖ్యలు

Mudragada Padmanabham : కాపు ఉద్యమ మాజీ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి వార్తల్లో నిలిచారు. ఏపీ ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం, నాటి పరిణామాలు, నేటి పరిస్థితి గురించి ప్రస్తావించారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం జోకర్ కార్డులా మారిందని బాధను వ్యక్తం చేశారు. తాను ఉద్యమాన్ని నిస్వార్థంగా నడిపించానని..ఎవరికీ అమ్ముడుపోలేదని చెప్పుకొచ్చారు.ఉద్యమంలో ఎన్నోరకాలు ఆటుపోట్లకు గురయ్యానని…ఎన్నోరకాల ప్రలోభాలు, కేసులు, జైలు జీవితానికి సైతం వెరవలేదన్నారు. తుని రైలు విధ్వంసం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టేసిన నేపథ్యంలో బుధవారం ఆయన స్పందించారు. ఉద్యమ నాటి పరిస్థితులు, తనపై వచ్చిన ఆరోపణలను నివృత్తి చేస్తూ ఈ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. అయితే త్వరలో రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని చెబుతుండడంతో ఏదో ఒక పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

అనూహ్యంగా రాజకీయాల్లోకి..
ముద్రగడ పద్మనాభానిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. 1977లో ఆయన అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు.
1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతాపార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. గిరిజనులు, నిరుపేద బీసీలు పద్మనాభంలో ఆయన తండ్రిని చూసుకున్నారు. ఆవిధంగా మొదలైన తన రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ పద్మనాభం మూడుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ ఓడిపోయారు. రాజకీయ నిర్వేదానికి లోనై, జన్మలో ప్రత్తిపాడు నుంచి పోటీచేయనని ప్రకటించారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనను పిలిచి ప్రత్తిపాడు నుంచి పోటీచేయాలని అడిగారు, కానీ ఆయన ప్రత్తిపాడు నుంచి గాక కాపు ఓటర్లు అధికంగా గల పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేశారు. మళ్ళీ ఓడిపోయారు.

ఆ ఘటనతోనే ఉద్యమంలోకి..
1988లో జరిగిన చిన్నపాటి ఘటన ముద్రగడను కాపు ఉద్యమం వైపు పురిగొల్పింది. ఓ కేసులో ముద్రగడ అనుచరులైన ఎస్సీ, బీసీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్రగడను కనీసం పోలీస్ స్టేషన్ లోపలికి విడిచిపెట్టలేదు. దీంతో స్టేషన్ ఎదుట టెంట్ వేసి బైఠాయించిన ముద్రగడ ఆరో రోజు ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులు ఆందోళనకు గురయ్యారు. ఉద్యమానికి శ్రీకారంచుట్టారు. దీంతో అప్పటి సీఎం ఎన్టీఆర్ స్పందించారు. ఆ యువకులను భేషరతుగా విడిచిపెట్టారు. అప్పటి నుంచి ముద్రగడను కాపు కుల నాయకుడిగా చూడడం ప్రారంభించారు.1994లో కాపుల కోసం ముద్రగడ ఉద్యమించారు. ఫలితంగా అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ ప్రత్యేక జీవో జారీ చేశారు. దీంతో కాపుల్లో ముద్రగడ ఇమేజ్ అమాంతం పెరిగింది. 2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానన్న చంద్రబాబు హామీ మేరకు ముద్రగడ ఉద్యమించారు. 2016జనవరి 31న కాపు ఐక్యగర్జనకు పిలుపునిచ్చారు. అది తునిలో విధ్వంస ఘటనకు దారితీసింది. అల్లర్లలో రత్నచల్ ఎక్స్ ప్రెస్ కు ఆందోళనకారులు నిప్పంటించారు.

త్వరలో రాజకీయ నిర్ణయం..
అయితే ఈ నెల 2న విజయవాడ రైల్వేకోర్టులో ముద్రగడకు క్లీన్ చీట్ వచ్చింది. ఏ-1గా ముద్రగడ, ఏ-2గా ఆకుల రామకృష్ణ, ఏ-3గా దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), ఏ-4గా మంచాల సాయిసుధాకర్‌ నాయుడు, ఏ5గా ఆమంచి సోములు, ఏ-6గా సినీనటుడు వై.సుధాకర్‌ నాయుడు(జీవీ), ఏ-7గా కాంగ్రెస్‌ నాయకుడు కామన ప్రభాకరరావుతోపాటు మొత్తం 41 మందికి విముక్తి లభించింది. ఇప్పటికే అప్పట్లో ఉన్న కేసులను జగన్ సర్కారు ఎత్తివేసింది. ఇప్పుడు రైల్వే కేసు కూడా ఎత్తివేయడంతో ముద్రగడ ఫ్రీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో ఓ రాజకీయ పార్టీలో చేరనున్నట్టు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా కోర్టు తీర్పు వచ్చిన వారం రోజుల తరువాత మీడియాకు ప్రత్యేక లేఖ రాశారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular