MP Avinash Reddy : వివేకా హత్య కేసు ఈ రోజు కీలక మలుపు తిరగబోతోందా? ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ దక్కుతుందా? లేకుంటే అరెస్ట్ కు గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా? ఇప్పుడు ఏపీలో ఇదే అంతటా చర్చ నడుస్తోంది. ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ పై విచారించిన తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తీర్పు రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ రోజు తుది తీర్పు వెలువరించనుంది. తీర్పు ఎలా ఉంటుంది. అవినాష్ కు మందస్తు బెయిల్ వస్తుందా? రాదా? అని అటు వైసీపీ శ్రేణులతో పాటు అన్ని రాజకీయ పక్షాలు ఎదురుచూస్తున్నాయి. నేటి తీర్పు ఏపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.
వివేకా హత్య కేసును ఒక కొలిక్కి తేవాలని సీబీఐ భావిస్తోంది. అది అవినాష్ రెడ్డి అరెస్టుతోనే సాధ్యపడుతోందని చెబుతోంది. అందుకే పలుమార్లు అరెస్ట్ కు సిద్ధపడింది. ఆయన్ను అరెస్టు చేస్తామని సీబీఐ తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. అయితే విచారణకు పిలిచి తనను అరెస్టు చేస్తారన్న భయంతో అవినాష్ తప్పించుకుంటూ వస్తున్నారు. కోర్టుల్లో పిటీషన్ల మీద పిటీషన్లు వేస్తున్నారు. నాలుగు రోజుల కిందట తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ 31 వరకూ అవినాష్ ను అరెస్ట్ చేయవద్దంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ రోజు తుది ఉత్తర్వులిస్తామని.. దానికి అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది. ముందస్తు బెయిల్ కనుక హై కోర్టు ఇవ్వకపోతే సీబీఐ తన దూకుడుని పెంచే చాన్స్ ఉంది.తీర్పు వెలువడిన ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చు అని అంటున్నారు.
ముందస్తు బెయిల్ మంజూరైతే మాత్రం కేసులో హీట్ తగ్గుతుంది. విచారణకు అవినాష్ రెడ్డి వెళ్ళి సీబీఐ అడిగిన వాటికి జవాబు చెప్పవచ్చు. అయితే హై కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినా దాన్ని సీబీఐ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసే అవకాశాలు సైతం ఉన్నాయి. కానీ దీనికి మరి కొన్ని రోజులు సమయం పట్టవచ్చు.ఇప్పటికే అవినాష్ ను సీబీఐ సహ నిందితుడిగా పేర్కొంది. కోర్టుల్లో దాఖలు చేసిన పిటీషన్లు, అనుబంధ పిటీషన్లలో సహ నిందితుడిగానే ప్రస్తావించింది. అప్పటి నుంచే అవినాష్ విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక నిందితులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి అరెస్టుతో దీనికి ఒక తుదిరూపం తెచ్చేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. కానీ దానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. అవినాష్ రెడ్డిని విచారణ పేరుతో ఇప్పటికి సీబీఐ ఏడు సార్లు పిలిచింది మరి ఆయన ఏ విషయాలు చెప్పారు. సీబీఐ అధికారులు ఏమడిగారు అన్నది తెలియకపోయినా ఈ కేసులో ఆయన అరెస్ట్ మాత్రమే ముఖ్యం అని సీబీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది గంటల్లో దీనికి తెర పడనుంది.