Vivekananda Vs Srisailam: “కూన”ల పోరు ఇవ్వాల్టిది కాదు.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి.. దీనికి లింక్ ఉంది

కుత్బుల్లా పూర్ ఓటర్లు చెబుతున్నదాని ప్రకారం.. ప్రస్తుతం ఎమ్మెల్యే కూన పాండు వివేకానంద గౌడ్, కూన శ్రీశైలం గౌడ్ ఇద్దరూ రక్తసంబంధీకులు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 27, 2023 10:24 am

Vivekananda Vs Srisailam

Follow us on

Vivekananda Vs Srisailam: మూడు రోజులుగా ఒకటే చర్చ. దాని మీదుగానే తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి. శభాష్ మంచి పని చేశావంటూ ఒకరిని ఓ పార్టీ పొగుడుతుంటే.. అతడికి మేము అండగా ఉన్నాము, అలా ఎలా చేస్తారంటూ మరో పార్టీ ధ్వజమెత్తుతోంది. ఇలా రకరకాలుగా జరుగుతున్న చర్చల్లో.. ఓ ఛానల్ లో నిర్వహించిన చర్చ వేదికలో ఆ స్థాయి ఆగ్రహం కేపీ వివేకానంద గౌడ్ అలియాస్ కూన పాండు వివేకానంద గౌడ్ కు ఎందుకు వచ్చింది? రక్తసంబంధికుడు, ఇంటిపేరు సంబంధికుడైన కూన శ్రీశైలం గౌడ్ అంత మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఈ ఇద్దరి మధ్య వైరం ఈనాటిది కాదా? ఈ వైరాన్ని కుత్బుల్లాపూర్ ఓటర్లు ఎలా చూస్తున్నారు? ఈ ఇద్దరు కూనలు కొట్టుకుంటే కొలన్ హనుమంత్ రెడ్డికి వచ్చే ఫాయిదా ఏమిటి?

కుత్బుల్లా పూర్ ఓటర్లు చెబుతున్నదాని ప్రకారం.. ప్రస్తుతం ఎమ్మెల్యే కూన పాండు వివేకానంద గౌడ్, కూన శ్రీశైలం గౌడ్ ఇద్దరూ రక్తసంబంధీకులు. వీరిద్దరి తాతా ముత్తాతలు అన్నదమ్ములు. కూన పాండు వివేకానంద గౌడ్, కూన శ్రీశైలం గౌడ్ మధ్య స్థలాలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయని అక్కడి ఓటర్లు అంటున్నారు. కేపీ వివేకానంద గౌడ్ తండ్రి కేఎం పాండు.. మొదట కుత్బుల్లాపూర్ గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. అనంతరం పురపాలక సంఘంగా ఏర్పడిన కుత్బుల్లాపూర్ కు తొలి చైర్మన్ గా పనిచేశారు. ఆయన చైర్మన్ గా పనిచేస్తున్నప్పుడే కేపీ వివేకానంద గౌడ్ కు రాజకీయాల మీద ఆశ పుట్టింది. ఇదే సమయంలో కేఎం పాండు గౌడ్ వయోభారంతో ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చింది. దీంతో వివేకానంద గౌడ్ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత తన సహజన ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, ప్రకాష్ గౌడ్ లతో కలిసి అధికార భారత రాష్ట్ర సమితిలో చేరారు.

కూన పాండు వివేకానంద గౌడ్, కూన శ్రీశైలం గౌడ్ మధ్య వివాదం ఈనాటిది కాదు. 2009లోనే దానికి బీజం పట్టింది. అప్పట్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి కూన శ్రీశైలం గౌడ్ భంగపడ్డారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అండదండలు దండిగా ఉండటంతో శ్రీశైలం గౌడ్ విజయం సాధించారు. అప్పట్లో తన సమీప ప్రత్యర్థి కేపీ వివేకానంద గౌడ్ ను 23 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఒకరకంగా చెప్పాలంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి వీరిద్దరి మధ్య వైరానికి నాంది పలికారని కుత్బుల్లాపూర్ ఓటర్లు అంటారు. అప్పట్లో వివేకానంద గౌడ్ ని కూడా కొన్ని స్థలాలకు సంబంధించిన వివాదాల్లో చాలా ఇబ్బంది పెట్టారనే ప్రచారం కూడా ఉంది. అప్పటినుంచి వివేకానంద గౌడ్, శ్రీశైలం గౌడ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. 2014 ఎన్నికల్లో వివేకానంద గౌడ్ తన సమీప ప్రత్యర్థి, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొలన్ హనుమంత రెడ్డిని 40,000 ఓట్ల తేడాతో ఓడించారు. దాయాది అయిన కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ అప్పుడు ఏకంగా మూడవ స్థానానికి పడిపోయారు.

2018 ఎన్నికల్లో వివేకానంద గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేశారు. హస్తం గుర్తుపై పోటీ చేసిన శ్రీశైలం గౌడ్ ను 41,500 ఓట్ల తేడాతో ఓడించారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొలను హనుమంత రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు బరిలోకి దిగారు. 2014 లో రెండవ స్థానంలో నిలిచిన హనుమంత్ రెడ్డి కి ఇప్పుడు ఎలాంటి ప్రభావం చూపుతారోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి ఎత్తుగడలు వేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.

బిజెపి అభ్యర్థి శ్రీశైలం గౌడ్, వివేకా నంద గౌడ్ మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది అని చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇద్దరి మధ్య తాజాగా జరిగిన వైరం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతే కాదు ఇద్దరి మధ్య ఉన్న భూ వివాదాలను వెలికి తీస్తోంది.