
సాధారణంగా చెట్లు ఏ రంగులో ఉంటాయనే ప్రశ్నకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఆకుపచ్చ రంగులో ఉంటాయని చెబుతారు. అయితే చైనాలోని ఒక ఆలయంలో మాత్రం ఒక చెట్టు బంగారం రంగులోకి మారిపోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా పచ్చని రంగులో ఉన్న చెట్టు బంగారు వర్ణంలోకి మారిపోవడంతో ఆ వింత చెట్టును చూడటానికి ప్రజలు ఆ ఆలయం దగ్గరకు క్యూ కడుతున్నారు.
చైనాలోని షాంజీ ఫ్రావిన్స్ లోని గునియన్ బౌద్ధ ఆలయంలో ఉన్న చెట్టు గురించి తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ప్రతి ఏటా మూడు నెలల పాటు చెట్టు బంగారు రంగులోకి మారుతుంది. ఆ చెట్టు నుంచి నేలపై రాలే ఆకులు సైతం బంగారు వర్ణంలోనే కనిపిస్తూ ఉంటాయి. చైనా దేశంతో పాటు విదేశాల నుంచి చాలామంది ఆ చెట్టును చూడటం కోసం గునియన్ బౌద్ధ ఆలయానికి వెళుతూ ఉంటారు. బంగారు వర్ణంలో కనిపించే ఈ చెట్టును చాలామంది గోల్డెన్ ట్రీ అని పిలుస్తారు.
1400 సంవత్సరాల క్రితం నాటిన మొక్క బంగారు వర్ణంలోకి మారడం వెనుక కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. చరిత్ర ప్రకారం థాంగ్ రాజ్యానికి చెందిన రాజు లి షిమిన్ ఈ మొక్కను నాటారని తెలుస్తోంది. రాజుగా థాంగ్ ప్రజలకు సుపరిపాలన అందించారని.. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని చరిత్రలో ఉంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చెట్టు బంగారు వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది.
ఇంత అందంగా కనిపించే ఈ చెట్టు పేరు గింగ్ కో బిలోబా చెట్టు. ఈ చెట్టు దగ్గర ధ్యానం చేస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుందని.. చెట్టు ఆకులు బంగారాన్ని తలపిస్తాయని ఆ చెట్టును దర్శించుకున్న వాళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బంగారు వర్ణంలో ఉన్న చెట్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.