Nellore Politics: బాబాయ్,అబ్బాయి.. మధ్యలో నారాయణ

2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి వైసీపీ తరఫున అనిల్ కుమార్ యాదవ్, టిడిపి తరఫున మాజీ మంత్రి నారాయణ పోటీ చేశారు. అనిల్ 1988 ఓట్లతో గట్టెక్కగలిగారు.

Written By: Dharma, Updated On : July 28, 2023 2:56 pm

Nellore Politics

Follow us on

Nellore Politics: బాబాయ్ తగ్గడు అబ్బాయి.. ఆగడు అన్నట్టుంది నెల్లూరు రాజకీయం. ఇక్కడ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సొంత బాబాయి రూప్ కుమార్ నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. దీంతో ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీంతో క్యాడర్ నలిగిపోతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే టిడిపిలోకి మూకుమ్మడిగా వెళ్లేందుకు కొందరు వైసీపీ నేతలు డిసైడ్ అయ్యారు.

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణను బరిలో దించేందుకు చంద్రబాబు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. అటు నారాయణ సైతం పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. నెల్లూరుని అభివృద్ధి చేశారన్న పేరు నారాయణకు ఉంది. సానుభూతి పవనాలు వీస్తున్నాయి. దీనికి తోడు వైసీపీలో జరుగుతున్న పరిణామాలు నారాయణకు కలిసి వస్తున్నాయి. అటు వైసీపీ శ్రేణులు సైతం టిడిపి వైపు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి వైసీపీ తరఫున అనిల్ కుమార్ యాదవ్, టిడిపి తరఫున మాజీ మంత్రి నారాయణ పోటీ చేశారు. అనిల్ 1988 ఓట్లతో గట్టెక్కగలిగారు. అయితే నాడు బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ కూడా సహకరించారు. అనిల్ కు మంత్రి పదవి వచ్చిన తర్వాత బాబాయ్ తో విభేదాలు పెరిగాయి. ఎదురెదురు పెడితే పలకరింపులు పోయి కొట్టుకునే స్థాయికివైరం పెరిగింది. దీంతో నెల్లూరు సిటీలో వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో రూప్ కుమార్ యాదవ్ సైతం వైసీపీ టికెట్ ఆశిస్తున్నట్లు బాహాటంగానే చెబుతున్నారు. అనిల్ కు టికెట్ ఇచ్చినా.. జగన్ సహకరించమంటే సహకరిస్తానని రూప్ కుమార్ చెబుతున్నారు. ఆ అవసరమే లేదని అనిల్ కొట్టిపారేస్తున్నారు. దీంతో కేడర్ అయోమయానికి గురవుతోంది.

కరవమంటే కప్ప కు కోపం విడవమంటే పాము కోపమన్నట్టుగా కేడర్ నలిగిపోతుంది. అందుకే మెజారిటీ వైసిపి నాయకులు మాజీ మంత్రి నారాయణ వైపు చూస్తున్నారు. ఆయన ఇంటి వైపు క్యూ కడుతున్నారు. వైసిపి కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నేరుగా నారాయణను కలిసి చర్చలు జరపడం విశేషం. మున్ముందు నెల్లూరు సిటీకి చెందిన వైసిపి కీలక నాయకుల సైతం సైకిల్ బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు వ్యవహారం వైసిపి హైకమాండ్ కు కలవరపాటుకు గురిచేస్తోంది.