MAAMANNAN – Official Trailer : కర్ణన్ సినిమా చూశారా! ధనుష్ విశ్వరూపం కనిపిస్తుంది ఆ సినిమాలో.. ధనుష్ లో ఉన్న నటుడిని పూర్తిస్థాయిలో ఆవిష్కరించిన చిత్రం అది. ఆ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. సహజత్వానికి దగ్గరగా ఉండే తమిళ సినిమాను మరింత సహజత్వానికి తీసుకెళ్లాడు. ఈ సినిమా దెబ్బకు మారి సెల్వరాజ్ రామ్ చరణ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని అందుకున్నాడు. దానికంటే ముందు మారి సెల్వరాజ్ తమిళంలో ప్రస్తుతం మా మన్నన్ అనే సినిమా తీశాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. యూట్యూబ్ లో ఏకంగా 10 మిలియన్ వ్యుస్ సంపాదించుకుంది. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే సాగుతోంది. ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది. ముఖ్యంగా కామెడీ పాత్రలు పోషించే వడివేలు ఈ సినిమా ద్వారా సీరియస్ పాత్రలో కనిపిస్తున్నారు. మలయాళ నటుడు పహద్ పజిల్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్, ఉదయనిది స్టాలిన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పొలిటికల్ క్రైం థ్రిల్లర్
ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రకారం చూస్తే ఈ సినిమా పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ లాగా కనిపిస్తోంది. ఒక వర్గానికి వడివేలు నాయకత్వం వహిస్తుండగా, అతడికి సహాయకుడిగా ఉదయనిది స్టాలిన్ కనిపిస్తున్నారు. కీర్తి సురేష్ ఒక కీలక పాత్రలో నటించారు. ఇక మరో వర్గానికి ఫహద్ పజిల్ నాయకత్వం వహిస్తున్నారు. మారి సెల్వరాజ్ సినిమాలో సమాజం ఎదుర్కొనే సమస్యలను బలంగా చూపిస్తారు. ఈ సినిమాలో కూడా అలాంటి కోణాన్ని ఆయన ఎంచుకున్నారు. రెండు వర్గాల మధ్య పోరాటాన్ని, ఆ సంఘర్షణలో ఏర్పడే రాజకీయాలను ఈ సినిమాలో చూపించారు. అణగారిన వర్గానికి ప్రతినిధిగా వడివేలును , అగ్రవర్ణాలకు చెందిన నాయకుడిగా ఫహద్ ఫజిల్ ను చూపించారు. జంతువులతో కథ నడిపించే సెల్వరాజ్.. ఈ సినిమాలోనూ వేటాడే కుక్కలను, నల్ల గుర్రాన్ని కొన్ని పాత్రలకు ప్రతిబింబించే విధంగా చూపించారు.
టెక్నికల్ బ్రిలియన్స్
ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం వహిస్తున్నారు. రెడ్ జాయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. జూన్ 29న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ప్రకారం కచ్చితంగా విజయవంతమవుతుందని తమిళ సినీ పరిశ్రమ అంచనా వేస్తోంది. అంతేకాకుండా కామెడీ నటుడిగా పేరుపొందిన వడివేలు ఈ సినిమాలో సీరియస్ పాత్రలో కనిపిస్తుండడం విశేషం. ట్రైలర్ లో బలమైన డైలాగులు, వర్గ వివక్షకు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. రెండు గ్రూపుల నేతల మధ్య రాజకీయ వైరుధ్యం చాలా సీరియస్ గా సాగే అంశాలు లాగా కనిపించింది. వడివేలు, ఫహద్ పజిల్ పోటీపడి నటించారు. మారి సెల్వరాజ్ ప్రతి సన్నివేశంలోనూ తన మార్కు ఉండేలాగా చూసుకున్నాడు.. కర్ణన్ సినిమా ఏ విధంగా అయితే సమాజంలో పేరుకుపోయిన వర్గ వివక్షను సజీవంగా చూపిందో.. ఈ సినిమా కూడా అలాంటి కోణాన్నే స్పృశిస్తోంది.