
KCR vs Modi : కవితను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్న నేపథ్యంలో తన కూతురును కాపాడుకునేందుకు కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.ఇందులో భాగంగా ఆయన మోడీని కలిసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ కేసీఆర్.. ప్రధాని మోదీని కలిసే ప్రయత్నం చేశారన్న ప్రచారం జరిగింది. గత అక్టోబరు 11న ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్ అంత్యక్రియలకు కేసీఆర్ హాజరై అటు నుంచి అటే ఢిల్లీకి వెళ్లారు. అప్పుడు తన వెంట కూతురు కవితను కూడా తీసుకెళ్లారు. వారం రోజులకు పైగా ఢిల్లీలోనే మకాం వేశారు. బీఆర్‌ఎస్ విస్తరణలో భాగంగా విపక్ష నేతలను కలవడానికే ఢిల్లీలో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు వెలువడినా.. ప్రధానిని కలవడానికే అక్కడ ఉన్నారని బీజేపీ వర్గాలు అప్పట్లోనే బయటపెట్టాయి.
ఒకవేళ ప్రధాని అపాయింట్‌మెంట్ ఇస్తే.. తన కూతురుతో సహా కలిసి, ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి ఆమెను రక్షించుకోవాలని అనుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, బీజేపీ పెద్దలు ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ను దూరం పెట్టినట్లు రాష్ట్రంలోని ఆ పార్టీ వర్గాలు అప్పట్లో వెల్లడించాయి. అవినీతి నేతలను ప్రధాని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరంటూ కుండబద్దలు కొట్టాయి. ప్రధానిని కలిసే అవకాశం లభించకపోవడంతో కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగొచ్చేశారు. ఇప్పుడు కేసు మరి త జటిలమవుతుండడంతో బీఆర్‌ఎ్‌సలో ఆందోళన నెలకొంది. కేసు నుంచి ఎలా బయట పడాలన్నదానిపై కేసీఆర్, కవిత, పార్టీకి న్యాయ సలహాలు ఇచ్చే బోయినపల్లి వినోద్‌కుమార్ తదితరులు చర్చించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో సలహాలు, సంప్రదింపులు జరుపుతున్నారు. రామచంద్ర పిళ్లై అరెస్టు నేపథ్యంలో కేసు పూర్వాపరాలపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది.
ఒకవేళ కవితను అరెస్టు చేస్తే.. దాని ప్రభావం బీఆర్‌ఎ్‌సపై ఉంటుందా అన్న కోణంలోనూ పార్టీ అగ్రనేతల్లో చర్చ జరుగుతోంది. అసలే ఇది ఎన్నికల సంవత్సరం. ఇలాంటి సందర్భంలో అరెస్టు జరిగితే పార్టీకి కొంత నష్టమేనన్న అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని, తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వరద పారిందని, ధరణి పోర్టల్ అవినీతి అడ్డా అంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత అవినీతి కేసులో అరెస్టయితే.. ప్రతిపక్షాలకు మరింత అవకాశమిచ్చినట్లవుతందని ‘గులాబీ బాస్’తోపాటు పార్టీలోని నిర్ణయాత్మక స్థానంలో ఉన్న నేతలు ఆందోళన చెందుతున్నారు.