Lenskart controversy: ఒక కంపెనీ బ్రాండ్ గా అవతరించాలంటే వినియోదారుల నమ్మకాన్ని పొందాలి. ఇలా వినియోదారుల నమ్మకం పొందడం ఒకరోజులో సాధ్యం కాదు. మనదేశంలో పేరుపొందిన టాటా, రిలయన్స్, బిర్లా కంపెనీలు ఒక్కరోజులోనే ఈ స్థాయికి ఎదగలేదు. దాని వెనుక దశాబ్దాల కష్టం ఉంది. లక్షలాదిమంది శ్రమ ఉంది. ఒక్కసారి బ్రాండ్ గా ఎదిగిన తర్వాత అన్ని కంపెనీలు.. ఆ పేరును కాపాడుకుంటాయి. మరింత గొప్పగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తాయి.
మనదేశంలో పేరుపొందిన కంపెనీలలో Lenskart కూడా ఒకటి. కళ్ళద్దాల తయారీలో ఈ కంపెనీ ఒక సంస్థగా ఎదిగింది. దేశవ్యాప్తంగా ఎన్నో బ్రాంచ్లను ఓపెన్ చేసింది. వందల మందికి ఉపాధి కల్పిస్తోంది. పరోక్షంగా అదే స్థాయిలో ఆర్థిక భరోసా ఇస్తోంది. కళ్ళద్దాల తయారీలో ఏకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి.. నూతన ఉద్యోగులకు అందులో శిక్షణ ఇస్తోంది.. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ యాజమాన్యం ఇటీవల వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. అది కాస్త ఈ సంస్థ పరువును తీసింది.
లెన్స్ కార్ట్ ప్రస్తుతం తీవ్రమైన వివాదంలో చిక్కుకుంది. ఈ కంపెనీ ఓ మెజారిటీ మతస్తుల విషయంలో ఇష్టానుసారంగా ప్రవర్తించింది. అడ్డగోలుగా నిబంధనలు విధించింది. బొట్టు పెట్టుకోకూడదని.. చేతులకు రంగుల దారాలు కట్టుకోవద్దని.. పిలకలు వేసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ సర్కులర్ విడుదల చేయగా.. కొంతమంది సిబ్బంది దీనిని వ్యతిరేకించారు. వారిని యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. ఈ క్రమంలో యాజమాన్యం తీరు కొంతమంది ఉద్యోగుల ద్వారా బయటికి వచ్చింది. దీంతో ఆ యాజమాన్యం రకరకాలుగా బుకాయించడానికి ప్రయత్నించింది. చివరికి యాజమాన్యం తీరు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో.. ఉద్యోగుల నుంచి నిరసన మొదలైంది.
తాజాగా ఈ కంపెనీ కి సంబంధించిన వ్యాపారం ఇప్పుడు పూర్తిగా దెబ్బ తిన్నదని వార్తలు వస్తున్నాయి. కంపెనీ విలువ స్టాక్ మార్కెట్లో తీవ్రంగా పడిపోయింది. సోమవారం ట్రేడింగ్ సెషన్ లో కంపెనీ విలువ ఏకంగా 4,500 కోట్లకు పడిపోయింది. సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు ఈ కంపెనీ మీద వస్తున్నాయి. యాజమాన్యం తీరు మెజారిటీ మతస్తుల విషయంలో అడ్డగోలుగా ఉందని.. ఇలాంటి విధానాలు సరైనవి కావనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై యాజమాన్యం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే బ్రాండ్ పేరు ఉండగానే సరిపోదు.. దానిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆ కంపెనీకి విలువ ఉంటుంది. వినియోగదారులకు నమ్మకం ఉంటుంది.