Land Registrations : పైసలు పట్టుకెళ్తే పట్టుకుంటున్నారు.. అందుకే రిజిస్ట్రేషన్లు బంద్

. రూ.50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్తే ఆధారాలు చూపించాలి. ఇన్ని తిప్పలు ఎదుర్కోవడం కంటే కోనుగోలు ప్రక్రియను వాయిదా వేసుకోవడం మేలని కొనుగోలుదారులు భావిస్తున్నారు.

Written By: NARESH, Updated On : October 12, 2023 7:34 pm
Follow us on

Land Registrations : స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌లపై ఎన్నికల కోడ్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎన్నికల కోడ్‌ వచ్చేదాకా సాఫీగా జరిగిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోడ్‌ అమల్లోకి వచ్చాక డబ్బులు సర్దుబాటు చేసే అంశంలో అటు కొనుగోలుదారులకు, ఇటు అమ్మకందారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్‌ వచ్చిన మూడు రోజుల్లోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల లావాదేవీలు రోజురోజుకు తగ్గుతున్నాయి. ధరణి ద్వారా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు తగ్గుముఖం పడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఎన్నికల కోడ్‌ కంటే ముందు రోజు (శనివారం) 50 డాక్యుమెంట్లు నమోదయ్యాయి. ఎన్నికల కోడ్‌ సోమవారం వచ్చింది. మధ్యాహ్నం నుంచి పోలీసుల తనిఖీలు మొదలయ్యాయి. సోమవారం 48, మంగళవారం 28, బుధవారం 24 చొప్పున రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. గజ్వేల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ల నమోదు తగ్గుతూ వస్తోంది. వికారాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు సరాసరి 20 రిజిస్ట్రేషన్లయ్యేవి. కోడ్‌ అమల్లోకి రావడంతో వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల కంటే మార్టిగేజ్‌ నమోదుకు సంబంధించిన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషనయ్యాయి.

నల్లధనం రూపంలో..
రిజిస్ట్రేషన్‌ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బుల అవసరం ఉండటంతో నల్లధనం రూపంలో లావాదేవీలు జరుపుతుంటారు. వీటి ధరలు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ ధరల ఎక్కవగా ఉండటంతో వైట్‌ మనీ పోను మిగిలిన డబ్బులను నల్లధనం రూపంలో చేతులు మారుతుంటాయి. వైట్‌ మనీని బ్యాంకు ద్వారా బదిలీ చేసుకోవచ్చు. కానీ నల్లధనం రూపంలో ఇచ్చిన డబ్బులకు వివరాలు, ఆధారాలు ఉండవు. ప్రస్తుతం రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్తే ఆధారాలు చూపాలన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు స్థిరాస్తుల అమ్మకందారులు, కొనుగోలుదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వ్యవసాయ భూములు, అపార్ట్‌మెంట్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇతర ఏ స్థిరాస్తిని కొనుగోలు చేసిన 60-70 శాతం డబ్బులను నల్లధనం రూపంలో లావాదేవీలు జరుపుతారు. వెంట తీసుకెళ్తున్న డబ్బులకు ఆధారాలు చూపాలన్న ఎన్నికల నిబంధనలతో స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్నవారు ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు వాయిదా వేసుకోవాలని భావిస్తున్నారు.

సర్కారు నిర్ధారించిన ధర కంటే..
ప్రస్తుతం వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు ఇతర స్థిరాస్తులకు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రభుత్వం నిర్ధారించిన ధరల కంటే 4-5 రేట్లకు పైగానే బహిరంగ మార్కెట్‌ ధరలున్నాయి. వీటిని కొనుగోలు చేసే యజమానులు అంత పెద్ద మొత్తం డబ్బులకు సరైన ఆధారాలు చూపించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో కొన్నాళ్ల పాటు కొనుగోళ్లనే వాయిదా వేసుకోవాలన్న నిర్ణయానికి వస్తున్నారు. అయితే ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చిన వారు మాత్రం గడువులోపు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు నానాతంటాలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. రోజు రోజుకు ఈ తనిఖీలు ముమ్మరం కావడంతో డబ్బులు తీసుకెళ్లడం కష్టమవుతోంది. రూ.50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్తే ఆధారాలు చూపించాలి. ఇన్ని తిప్పలు ఎదుర్కోవడం కంటే కోనుగోలు ప్రక్రియను వాయిదా వేసుకోవడం మేలని కొనుగోలుదారులు భావిస్తున్నారు.

గతంతో పోలిస్తే తగ్గిన ఆదాయం
స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల విభాగానికి గత నాలుగైదేళ్ల నుంచి ఆదాయం పెరుగుతూనే ఉంది. ఎంత అంటే 50 నుంచి 100శాతం వరకు పెరిగింది. ఈ ఒక్క ఏడాది మాత్రం ఒక్క శాతం కూడా పెరగలేదు సరికదా, గత ఏడాది కంటే పడిపోయింది. 2022లో ఏప్రిల్‌ నుంచి జూలై వరకు రిజిస్ట్రేషన్‌ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఆదాయం, అదేవిధంగా అదేకాలంలో జరిగిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లతో పోలిస్తే 2023లో అటు ఆదాయం, ఇటు రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్ల సంఖ్య రెండూ తగ్గాయి. 2022-23 ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో 7 లక్షల డాక్యుమెంట్లకుపైగా రిజిస్టర్‌ కాగా ఈ ఏడాది ఈ ఆరు నెలల్లో 7 లక్షల డాక్యుమెంట్లకు తక్కువగానే నమోదయ్యాయి. గత ఏడాదితో చూస్తే దాదాపు 40 వేల డాక్యుమెంట్లు తక్కువ నమోదయ్యాయి. అంతేకాదు.. ఆదాయం కూడా దాదాపు రూ.200 కోట్లకు పైగా తగ్గింది.

ఇప్పటికే తగ్గిన భూముల అమ్మకాలు, కొనుగోళ్లు
రాష్ట్రంలో వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇప్పటికే భారీగా పడిపోయాయి. గత ఏడాదిలో నమోదైన డాక్యుమెంట్ల లావాదేవీలు, ఈ ఏడాదిలో నమోదైన డాక్యుమెంట్ల నమోదు సంఖ్యను చేస్తే లక్షకు పైగా తగ్గాయి. కాగా, 2022 జనవరి నుంచి సెప్టెంబరు చివరి నాటికి (9 నెలలు) ధరణిలో రిజిస్ట్రేషన్‌ కోసం 6,75,885 దరఖాస్తులు పెట్టుకున్నారు. వీటిలో 6,50,457 దరఖాస్తులకు సంబంధించిన భూములకు రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. ఈ ఏడాది 2023 జనవరి నుంచి సెప్టెంబరు 30 నాటికి (9నెలలు) భూముల రిజిస్ట్రేషన్‌ కోసం 5,75,694 దరఖాస్తులు ధరణిలో నమోదయ్యాయి. ఇందులో 5.48 లక్షల దరఖాస్తులకు సంబంధించిన భూములు రిజిస్ట్రేషన్‌లు అయ్యాయి. గత ఏడాదిలో నమోదైన రిజిస్ట్రేషన్‌ కంటే ఈ ఏడాది నమోదైన రిజిస్ట్రేషన్‌లు లక్షకు పైగా తగ్గాయి.