
KTR vs Modi – Telangana electricity charges : వినేవాడు వెర్రోడు అయితే చెప్పే వాడు కేటీఆర్ కాకూడదు. కేటీఆర్ మంచి విద్యావంతుడు. తెలంగాణలో ముఖ్యమైన మంత్రిగా వ్యవహరిస్తున్నవాడు. భారత రాష్ట్ర సమితికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నవాడు. అలాంటి వ్యక్తి మాట్లాడితే ఎలా ఉండాలి? ఎంత వివేచన ఉండాలి? కానీ అతడు కూడా ఆ మల్లారెడ్డినే అనుసరిస్తున్నాడు. మాట్లాడేప్పుడు మోకా లికి బోడిగుండుకు ముడి పెడుతున్నాడు. తన చెల్లిని ఈడీ పిలిచిన దగ్గర్నుంచి కేటీఆర్ కేంద్రం పై మండిపడుతున్నాడు. మోదీని ఇష్టానుసారంగా తిడుతు న్నాడు. అమిత్ షాను దూషిస్తున్నాడు. ఆ భారత రాష్ట ర సమితి తీరే అంత కాబట్టి దాని లోతుల గురించి మాట్లాడుకోవడం శుద్ధ దండగ!
బోలెడు విషయాలున్నాయి కేటీఆర్?
కేటీఆర్‌కు కేంద్రప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలీ అంటే బోలెడు విషయాలు ఉన్నాయి. అప్పుల గురించి, నిరుద్యోగం గురించి ఇలా ఎన్నయినా మాట్లాడవచ్చు. కానీ ఆ విషయాలను పక్కనపెట్టి మోకాలికి బోడిగుడ్డుకు ముడి పెట్టినట్టు ‘పీక్ అవర్స్‌లో కరెంట్ చార్జీలు పెంచుతున్నాడు, ఆదానీ బొగ్గు కోసం పెంచుతున్నాడు’ అంటూ విమర్శలు చేశాడు. తెలంగాణే కాదు దేశంలోని ఏ ప్రభుత్వానికీ ఫలానా వారి దగ్గరే బొగ్గు కొనాలని కేంద్ర ప్రభుత్వం చెప్పదు. వాస్తవానికి బలవంతంగా రాష్ట్రాల మీద సింగరేణి బొగ్గును రుద్దుతున్నది కేంద్ర ప్రభుత్వం. సంస్థ మనుగడ కోసం, పైగా ఆ సంస్థ మన దేశంలోది కావడంతో.. సింగరేణి వెలికి తీస్తున్న బొగ్గులో కచ్చితంగా 20 నుంచి 25 శాతం వరకు కొనుగోలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల చాలా రాష్ట్రాలు ఇబ్బందిపడుతున్నాయి. ఎందుకంటే సిం గరేణిలో లభించే బొగ్గు మరీ అంత నాణ్యమైనది కాదు. రష్యా, ఆస్ట్రేలియాలో లభించే బొగ్గు నాణ్యమైనది. ఉదాహరణకు కిలో సింగరేణి బొగ్గుతో పది యూనిట్ల విద్యుత్ తయారు చేస్తే, అదే రష్యా, ఆస్ట్రేలియాలో లభించే బొగ్గుతో 30 యూనిట్ల విద్యుత్ తయారు చేయవచ్చు.
కానీ ఇక్కడే ప్రజలను కేటీఆర్ మిస్ లీడ్ చేస్తున్నారు. రేపటినాడు తెలంగాణలో కరెంట్ కోతలు మొదలు పెడితే(కొన్ని చోట్ల ఇప్పటికే ప్రారంభమయ్యాయి) ఆ నెపాన్ని కేంద్రం మీదకు నెట్టేందుకు మధ్యలో ఆదానీ పల్లవి అందుకున్నాడు. పీక్ అవర్స్‌లో కరెంట్ చార్జీలు పెంచాలని మోదీ చెబుతున్నాడని కేటీఆర్ అంటున్నారు. పీక్ అవర్స్ కరెంట్ అనేది ఇవ్వాళా కొత్తది కాదు. గతం నుంచి ఉన్నదే. అసలు తెలంగాణలో రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ తయారయితే వేరే రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. 9 ఏళ్ల నుంచి తెలంగాణను ఏలుతున్నప్పటికీ తెలంగాణ అవసరాలకు సరిపడా విద్యుత్ తయారు చేసుకోలేకపోవడం ముమ్మా టికీ భారత రాష్ట్ర సమితి వైఫల్యమే.
పీక్ అవర్స్‌లో డిమాండ్ ఎక్కువ
వాస్తవానికి పీక్ అవర్స్‌లో విద్యుత్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అప్పుడు ధర తయారీదారులను బట్టి ఉం టుంది. దానిని విస్మరించి కేటీఆర్ అదానీ మీద విమర్శలు చేయడం గుడ్డ కాల్చి మీద వేయడమే. ‘ఎండాకాలంలో వాస్తవానికి కరెంట్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని పీక్ అవర్స్ అంటారు.’ దీన్ని కూడా కేటీఆరే సెలవిచ్చాడు. కానీ అసలు విషయాన్ని మాత్రం మరుగన పడేశాడు. పీక్ అవర్స్‌లో కరెంట్ చార్జీలు పెంచమని ఏ ప్రభుత్వమూ చెప్పదు. ఒకవేళ పీక్ అవర్స్‌లో కరెంట్ చార్జీలు పెంచకూదని అనుకుంటే తయారీదారులతో ముందే ఒప్పందం కుదుర్చుకోవాలి. అలా కాకుండా అప్పటికప్పుడు విద్యుత్ కావాలి అంటే తయారీదారులు చెప్పిన ఽధరకు చచ్చినట్టు కొనాలి. మాట్లాడితే 24 గంటల పాటు కరెంట్ ఇస్తామని చెబుతున్న కేటీఆర్.. ఇప్పుడు పీక్ అవర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టు? దీనికి సమాధానం సింపుల్.. తెలంగాణలో అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి అవడం లేదు. ఆ నెపాన్ని ఇలా తెలివిగా కేంద్రం మీదకు కేటీఆర్ డైవర్ట్ చేశాడు!