
చరిత్ర ఎప్పుడూ మారదు. మనల్ని నమ్మి ప్రోత్సహించినవారిని.. అందలమెక్కించిన వారి వెంట నడవాలి.. అదే ధర్మం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ మరణం తర్వాత సీఎం పోస్ట్ కోసం ఎందరో లాబీయింగ్ చేశారు. రోశయ్య వల్ల కాకపోతే జగన్ ను చేయాలన్నారు. కొందరేమో చిరంజీవిని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలన్నారు. కానీ వీరిందరినీ కాదని.. స్పీకర్ గా ఉన్న అప్పటి అనామక ఎమ్మెల్యే ‘కిరణ్ కుమార్ రెడ్డి’ని సీఎంను చేసింది సోనియా గాంధీ. కేవలం రెడ్డి లాబీయింగ్ వల్లే ఇది సాధ్యమైంది. చిరంజీవిని చేయాలని ఎంత అనుకున్నా.. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనంచేసినా కూడా పక్కనపెట్టి కిరణ్ ను సీఎం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ అంత పెద్ద పదవి ఇచ్చినా అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఇప్పుడు కాంగ్రెస్ ను నట్టేట ముంచి బీజేపీలో చేరిపోయాడు కిరణ్. నిజానికి తెలంగాణను వ్యతిరేకించి.. అక్కడ సమైక్యాంధ్రా అంటూ కుట్రలు చేసిన కిరణ్ వల్లే కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో ఓడిపోయింది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ను ముంచిందే కాకుండా ఇప్పుడు కష్టసమయంలో పార్టీ కాడి వదిలేసి తన దారి తాను చూసుకున్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను నమ్మించి గొంతు కోశాడనే చెప్పొచ్చు. ఇలాంటి నేతల వల్లే చిరంజీవి లాంటి నిక్సారైన నేత సీఎం కాకుండా.. రాజకీయాల్లోనే లేకుండా పోయారన్న ఆవేదన ఉంది. కిరణ్ కనుక ఇలాంటి వాడు అని తెలిస్తే నాడే సీఎంగా చిరంజీవిని చేసి ఉండేవారన్న చర్చ సాగుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి. ఇటు తెలంగాణతోపాటు, అటు ఆంధ్రప్రదేశ్‌లో చాలామందికి గుర్తుంటుంది. తెలంగాణ వ్యతిరేకిగా తెలంగాణ ప్రజలు ఆయనను చిరకాలం గుర్తుంచుకుంటారు. ఇక సమైక్య ఆంధ్ర కోసం పోరాడిన వ్యక్తిగా ఆంధ్రాలోనూ గుర్తింపు ఉంది. కానీ, అతడిని సీఎం చేసిన కాంగ్రెస్ పార్టీని నిండా ముంచాడు. దాదాపు 9 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన చివరకు శుక్రవారం బీజేపీ గూటికి చేరాడు.
తొమిదేళ్లు రాజకీయాలకు దూరం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ విషయంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పటికీ కిరణ్‌కుమార్ మాత్రం అధిష్టానం మాట కూడా వినలేదు. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును సైతం వ్యతిరేకించారు. అయితే, ఆయన వ్యతిరేకించినంత మాత్రాన రాష్ట్ర ఏర్పాట ఆగలేదు. దీంతో కిరణ్‌కుమార్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. కొత్త పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో డోజు చెప్పుల గుర్తుపై పోటీ చేశారు. కానీ, ఆంధ్రా ఓటర్లు చిత్తుగా ఓడించారు. దీంతో తొమ్మిదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఏడాదిగా మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందకు మంచి పార్టీని వెతికే పని మొదలు పెట్టారు. మొదట సొంత గూటికే వస్తాడనుకున్నారు. తర్వాత టీడీపీలో చేరతారని భావించారు. కానీ, చివరకు ఆయన బీజేపీని ఎంచుకున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో శుక్రవారం కాషాయతీర్థం పుచ్చుకున్నారు.
సీఎం కుర్చీపై కూర్చోబెడితే..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా రాజకీయ శూన్యత ఏర్పడింది. కాంగ్రెస్‌లో సీఎం ఎవరిని చేయాలన్న చర్చ మొదలైంది. అయితే అధిష్టానం సీనియర్ నాయకుడు రోశయ్యను సీఎం చేసింది. అయితే రోషయ్య పాలనతో తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. పాలన గాడి తప్పింది. దీంతో రోశయ్యపై ఒత్తిడి ఎక్కువైంది. విధిలేక రోశయ్యే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ మళ్లీ మొదలైంది. అప్పటికే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో చిరంజీవికి సీఎం పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. వివాద రహితుడు అయినందున సీఎం చేయాలన్న ప్రతిపాదన కూడా అధిష్టానం దృష్టికి వెళ్లింది. కానీ, చివరకు కాంగ్రెస్ అధిష్టానం, ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎంగా ఎంపిక చేసింది.

తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర..
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నల్లారి కిరణ్‌కుమార్, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే ఉద్యమం పార్టీల చేతులు దాటి ప్రజల్లోకి వెళ్లిపోయింది. ప్రజలే ఉద్యమాన్ని నడిపిస్తుండడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఏమీ చేయలేకపోయారు. మరోవైపు తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర పడ్డాడు. ఇంకోవైపు ఆత్మాహుతులు, ఆత్మహత్యలు, బలిదానాలు పెరిగాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
కాంగ్రెస్‌ను చీట్ చేశాడు..
కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు అంగీకరించడంతో కిరణ్‌కుమార్ దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీ అనుమతి లేకుండా రాష్ట్ర విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు. మరోవైపు చివరి సమయంలో నిధులన్నీ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించుకున్నాడు. దీనిని ప్రశ్నించిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలపై అసెంబ్లీ వేదికగానే నోరు పారేసుకున్నాడు. చివరకు రాష్ట్ర విభజన జరిగింది. పార్లమెంట్‌లో బిల్లు కూడా ఆమోదం పొందింది. దీంతో కిరణ్‌కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తనను ముఖ్యమంత్రి చేసిన కృతజ్ఞతను కూడా మర్చిపోయి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం మొదలు పెట్టారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పోటీగా అభ్యర్థులను నిలిపి కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకుండా ఓట్లు చీల్లారు. తల్లి పాలుతాగి రొమ్ము గుద్దినట్లుగా తనను సీఎం చేసిన పార్టీనే ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్‌లేకుండా చేశారు.
మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్..
తొమ్మిదేళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌పై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో ఏపార్టీలో చేరాలని పెద్ద కసరత్తే చేశారు. అయితే కిరణ్‌కుమార్ సీఎంగా ఉన్న రోజుల్లో ఆయన సోదరుడు తెరవెనుక శక్తిగా ఉన్నాడని.. ప్రభుత్వం అండతో కాంట్రాక్టులు, పనులు, బెదిరింపులు, కమిషన్లతో దోచుకున్నాడన్న ఆరోపణలున్నాయి. ఆ సోదరుడు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడి టీడీపీ తరుఫున కూడా పోటీచేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ అవసరం తీరిపోవడం.. ఆపార్టీ ఏపీలో పుంజుకునే పరిస్థితి లేకపోవడంతో తెప్ప తగిలేశాడు కిరణ్. తన సోదరుడి అవినీతి కూడా బయటకు రావద్దనే ఉద్దేశంతోనే అధికార పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. అయితే జగన్‌మోహన్ పార్టీలో చేరడం ఇష్టం లేక, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. చివరకు కమలం గూటికి చేరారు.
మొత్తంగా ఏపీలో కాంగ్రెస్‌ను చెల్లాచెదురు చేసి, రాజకీయాలకు దూరమైన కిరణ్‌కుమార్, రాబోయే రోజుల్లో బీజేపీలో ఎలాంటి పాత్ర పోషిస్తారో చూడాలి.