KCR- Early Elections: ఆర్బిఐ ఓపెన్ మార్కెట్ రుణాలు ఇస్తే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. వచ్చే ఆదాయం వడ్డీలకే సరిపోతుంది.. పైగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు దండిగా అప్పులు తెచ్చుకున్నాయి.. కొత్తగా ఏర్పాటు చేసేందుకు కార్పొరేషన్ కూడా లేదు.. మరోవైపు జీఎస్టీ మీద ఇచ్చే వెసలుబాట్లు కూడా పూర్తయ్యాయి. దీనికి తోడు ఎలా పెడా ఇచ్చిన హామీలు గుదిబండలా ఉన్నాయి. మరి ఈ తరుణంలో అభివృద్ధి ఎలా సాధ్యం? కొత్త పనులకు డబ్బులు సర్దుబాటు చాలా కష్టం.

కేంద్రాన్ని బోన్లో నిలబెట్టేందుకు..
ఉదయం లేస్తే రాజకీయం గురించి మాత్రమే కెసిఆర్ ఆలోచిస్తారు. ఇది ఆయన అంతరంగికులు అనే మాట కూడా.. ఆ దిశగానే ఆయన ఎత్తులు, పై ఎత్తులు ఉంటాయి. సమకాలీన తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ను మించినోడు ఇప్పుడు లేడు.. చాలామంది.. ప్రత్యర్థి పార్టీల్లో కోవర్టులను పెట్టి గట్టు మట్లు లాగేస్తుంటాడని ఆరోపిస్తూ ఉంటారు.. కెసిఆర్ కూడా ఒకప్పుడు ఈ తరహా కోవర్ట్ బాధితుడే. అందుకే ఆయన రాజకీయం అలా ఉంటుంది. ఇక 2018 నుంచి మోడీతో యుద్ధం చేస్తున్న కేసీఆర్… ఎక్కడ కూడా తగ్గడం లేదు.. తెలంగాణకు పలుమార్లు వచ్చిన కూడా కనీసం స్వాగతం కూడా పలకడం లేదు. దీనికి తోడు దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు మార్గం సిద్ధం చేసుకున్నారు.. కానీ దానిని ఎందుకో చల్లార్చారు. అయితే కేంద్రంతో తాను చేస్తున్న యుద్ధంలో.. రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని నిరూపించేందుకు కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్రాన్ని బోన్లో నిలబెట్టేందుకు రకరకాల పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు.
పైసలే లేవు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో రాష్ట్రం ఉంది. కానీ ఇవాళ అప్పులు తెస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో పెద్దపెద్ద అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల సర్దుబాటు ఎలా అనేది ఇప్పటికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. అప్పుల కోసం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వైపు కేసీఆర్ నరం లేని నాలుక మాదిరి ఎడాపెడా వరాలు ఇస్తున్నారు. మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో గొర్రెల లబ్ధిదారులకు వ్యక్తిగత ఖాతా డబ్బులు ఇచ్చారు. దీనికోసం ఆ జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో ఉద్యోగులకు జీతాలు 11 తారీఖు వేశారు. అంటే ఆ డబ్బులు ఇలా సర్దుబాటు చేశారన్నమాట. ఇట్లాంటి స్థితిలో వచ్చే నెలలో మెట్రో రెండోదశ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్నారు. మరి ఆ పనులు ఎలా పూర్తి చేస్తారో ఆయనకే తెలియాలి.. అంటే కేంద్రం ఇవ్వకున్నా తామే సంకల్పించుకొని పనులు చేస్తున్నామని చెప్పేందుకే కేసీఆర్ ప్రగతి మంత్రం జపిస్తున్నారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

అసెంబ్లీలో ఎండగట్టేందుకు..
వచ్చేనెల మొదటివారం లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కెసిఆర్ ఇటీవల సూత్రప్రాయంగా నిర్ణయించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదని సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకే సమావేశాలు నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. 40 వేల కోట్లు కేంద్రం ఇవ్వడం లేదని టిఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.. అయితే ఈ 40 వేల కోట్లు అప్పులు మాత్రమేనని, ఇలా అనుమతులు ఇస్తే తెలంగాణ దివాలా తీస్తుందని బిజెపి నాయకులు అంటున్నారు. మరోవైపు ఎడాపెడా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి.. తాము అధికారంలోకి వస్తేనే ఇవి పూర్తవుతాయనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కెసిఆర్ భావిస్తున్నారు. డిసెంబర్ లోగా ఈ క్రతువు ముగించి, ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దుచేసి మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో కెసిఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. 2018లో బిజెపితో సయోధ్య ఉంది కనుక ఎన్నికలకు అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మరి ఇప్పుడు మోది తో యుద్ధం కోరుకుంటున్నారు కాబట్టి ఏం జరుగుతుందో అనేది వేచి చూడాల్సి ఉంది.