KCR Nanded Speech : మోడీపై పోరాటం మొదలుపెట్టిన కేసీఆర్ ఆ లక్ష్యాన్ని చేరడం కష్టమే అయినా.. ఆకట్టుకోవడంలో.. ప్రజలను ఆకర్షించడంలో మాత్రం 100కు 200 పర్సంట్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల నేతల్లో ఎవరూ ఇంత బాగా హిందీలో సెటైరికల్ గా మాట్లాడిన దాఖలాలు లేవు. అలాంటిది మహారాష్ట్రలో నిర్వహించిన తొలి సభలో కేసీఆర్ అదరగొట్టాడు. మహారాష్ట్ర హిందీ జనాలకు అర్థమయ్యే భాషలో భాష మార్చి.. యాసను చేర్చి అదిరిపోయే పంచులతో జనాలను ఆకర్షించారు. హిందీ జనాల చేత కూడా చప్పట్లు కొట్టించాడు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ దేశం యావత్తు తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. బీజేపీ జాతీయ పార్టీ కావడం ఆయనకు కలిసి వచ్చింది. కానీ కేసీఆర్ ముందర పెద్ద టాస్క్ ఉంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారినా ఇది ప్రాంతీయ పార్టీ. దేశాన్ని ఆకర్షించాలంటే అంత ఈజీ కాదు. కానీ కేసీఆర్ మహారాష్ట్రలో కష్టపడ్డాడు. ఆయన ప్రసంగానికి జనాలు ఫిదా అయిపోయారు.
మహారాష్ట్రలోని నాందేడ్ సభలో కేసీఆర్ ప్రసంగమే హైలెట్. 24 గంటల కరెంట్ హామీ, రైతు బంధు, దళితబంధుతో జనాలను ఆకర్షించారు. నాగలిపట్టే చేతులు.. శాసనాలు చేయాల్సిన రోజులు వచ్చాయని కేసీఆర్ తనది ‘రైతు ఏజెండా’ అని తేల్చిచెప్పారు. దేశ పరిస్థితులను చూసి బీఆర్ఎస్ గా మార్చామని.. దేశంలో మార్పు తీసుకొచ్చేందుకు వచ్చానని.. ఆశీర్వదించాలని హిందీ జనాన్ని కోరారు.
మహారాష్ట్రలో నిర్వహించిన ఈ సభకు భారీగా జనాలు వచ్చారు. చాలా మంది మహారాష్ట్ర నాయకులు వచ్చి బీఆర్ఎస్ కండువాలుకప్పుకున్నారు. అందరినీ పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్ అనంతరం జనాన్ని ఆకట్టుకునేలా మాట్లాడారు.
తనది రాజకీయ పోరాటం కాదని.. జీవన్మరణ పోరాటం అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ సహా అన్నీ సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో కాదా? అంటూ భరోసానింపారు. ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో కేసీఆర్జాతీయ రాజకీయాల్లో ముందుకెళుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు పంపారు.గులాబీ జెండా ఎగురాలని.. రైతు రాజ్యం రావాలంటూ పిలుపునిచ్చారు.
మోడీ లాంటి బలమైన నేతను ఎదుర్కొనేందుకు కదిలిన కేసీఆర్ కు జన స్పందన బాగానే వచ్చింది. ఆయన ప్రసంగాలకు బాగానే స్పందన వచ్చింది. మరి ఇది ఓట్లుగా మారుతాయా? కేసీఆర్ కు ఆదరణ ఎంత ఉంటుందన్నది వేచిచూడాలి.