Homeఆంధ్రప్రదేశ్‌Budjet 2022: బడ్జెట్ పై కేసీఆర్ రచ్చ రచ్చ.. జగన్ మౌనం.. బాబు మొహమాటం.. పవన్...

Budjet 2022: బడ్జెట్ పై కేసీఆర్ రచ్చ రచ్చ.. జగన్ మౌనం.. బాబు మొహమాటం.. పవన్ స్పందన ఘోరం

Union Budjet 2022: కేంద్రబడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఒక్కో అంశాన్ని లేవనెత్తి మరీ చెడుగుడు ఆడేశాడు. రచ్చరచ్చ చేశారు. ఇక ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి అన్యాయం జరిగినా మౌనం వహించారు. అవసరాల దృష్ట్యా కేంద్రాన్ని ఏమీ అనకుండా తనలో తామే కుమిలిపోయారని చెప్పొచ్చు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు మోడీని విమర్శించే ధైర్యం చాల్లేదు. అందుకే మోహమాటపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం బడ్జెట్ పై కర్ర విరగకుండా పాము చావకుండా అటు బీజేపీని తిట్టకుండా.. తిట్టినట్టుగా ఏదో ఒక ప్రకటన రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నాడు. బడ్జెట్ పై కీలక నేతల మనోభావాలు ఒక్కొక్కరివి ఒక్కో రకంగా ఉన్నాయి. అందరిలోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై భయం కనిపించింది.

కేంద్రం ప్రవేశపెట్టిన 2022-2023 బడ్జెట్ పై రకరకాల స్పందనలు వస్తున్నాయి. ఎలాగూ బీజేపీ, మద్దతు పార్టీలు ఎన్నడూ లేనంతగా ఆశాజనకంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారని పొగడ్తల వర్షం కురిపిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ బడ్జెట్లో సామాన్యులను విస్మరించారని, ఉద్యోగులు, కార్మికులను పట్టించుకోలేదని అంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ మంగళవారం నాటి కేంద్ర బడ్జెట్ పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు విమర్శలు చేయగా.. మద్దతు ఇచ్చే పార్టీలు మౌనంగా ఉండిపోయాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం జులు విధిల్చారు. ముందుగా బడ్జెట్ పై ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేయగా.. ఆ తరువాత ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్ర విమర్శలు చేశారు. అటు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్పందన లేకుండా ఉండగా.. ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు మొహమాటంగా విమర్శలు చేశారు.

2022-2023 కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లోప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందుగా ఇది పనికిమాలిన బడ్జెట్, గోల్ మాల్ అని ప్రకటన జారీ చేశారు. కానీ ఆ తరువాత స్వయంగా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని కేసీఆర్ కడిగిపారేశారు. దాదాపు గంటన్నర సేపు బీజేపీపైనే విమర్శలు చేశారు. మోదీని టార్గెట్ చేసి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పైనా విమర్శల దాడి చేశారు.

హైదరాబాద్లో ఏర్పాటయిన ఆర్బిట్రేషన్ సెంటర్ ను మోదీ గుజరాత్ తరలించుకుపోయేలా ఉన్నారని ఆరోపించారు. బడ్జెట్లో గోల్ మాల్ తప్ప ఇంకేమీ కనిపించడం లేదన్నారు. దశ దిశ లేకుండా దీనిని ప్రవేశపెట్టారని విమర్శించారు. వ్యవసాయ రంగానికి చేస్తోంది శూన్యమని, ఐటీ శ్లాబులను మార్చకపోవడంతో వేతన జీవులు ఊసూరుమన్నారని అన్నారు. దేశ ప్రజల ఆరోగ్యంపై మోదీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.కేంద్ర ఆర్థిక మంత్రి ప్రసంగం ఆసాంతం డొల్ల తనమేనని అన్నారు. ప్రపంచం మొత్తం ఆరోగ్యంపై దృష్టి పెడుతుంటే దేశంలో మాత్రం ఆ జాడ కనిపించడం లేదని కేసీఆర్ విమర్శించారు.

ఇదిలా ఉండగా ఏపీ సీఎం జగన్ బడ్జెట్ పై ఏ విధంగానూ స్పందించలేదు.గత కొంత కాలంగా బీజేపీ తో జగన్ ప్రభుత్వం పరోక్షంగా మద్దతు ఇస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీకి చెందిన ఎంపీలు మాత్రం చట్టసభల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి బడ్జెట్ పై స్పందించారు. ఈ బడ్జెట్ చాలా నిరుత్సాహ పరిచిందని అన్నారు.ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడే రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలని కేంద్ర నిబంధన పెట్టిందని.. కానీ కేంద్రం మాత్రం అదేపనిగా అప్పులు చేస్తూ ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని అన్నారు. అంతేగానీ సీఎం జగన్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోడంపై ఆసక్తి నెలకొంది.

అయితే ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు మాత్రం మోహమాటంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ ఆశాజనకంగా లేదని, రైతులు, పేదలు కొవిడ్ దెబ్బతో కుదేలయ్యారని, వారిని ఎలా ఆదుకోవాలో ఏమాత్రం చెప్పలేదన్నారు. ఆహార సబ్సిడీని తగ్గించి పేదలపై భారం మోపుతున్నారని విమర్శించారు. అలాగే చంద్రబాబు వైసీపీ ఎంపీలపై కూడా విమర్శలు చేశారు. రాష్ట్రం నుంచి 28 మంది ఎంపీలు ఉన్నా ప్రాజెక్టుకలు అవసరమయ్యే నిధులు తేవడంలో విఫలం అవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular