kasim razvi lead razakars cruelty on Telangana people : స్వాతంత్య్రానికి పూర్వం కథ.. భారత్ అంతా బ్రిటీషర్లు ఉంటే.. మధ్యలోని హైదరాబాద్ సంస్థానం నిజాం రాజుల పరిపాలనలో మగ్గుతోంది. అప్పుడు ప్రపంచంలోనే సంపన్నుడిగా నిజాం రాజు ఉన్నాడు. కోట్లకు పడగలెత్తి దేశంలో, లండన్ లో ఆస్తులు కూడబెట్టాడు. ఆ డబ్బంతా తెలంగాణ ప్రజలను దోచుకొని భారీగా పన్నులు వేసి సంపాదించిందే..

దేశంలో రైల్వే సౌకర్యాలు లేని రోజుల్లో కూడా హైదరాబాద్ లో రైల్వేలను తెచ్చిన నిజాం తన సంపదను తెలంగాణ నుంచి కొల్లగొట్టి తరలించడానికే ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారనే వాదన ఉంది.
రజాకార్లు.. ఈ పేరు తలుచుకుంటేనే తెలంగాణ ప్రజల్లో వణుకు పడుతోంది. వారు సాగించిన హత్యాకాండ ఇప్పటికీ నాటి కాలంలో ఉన్న వ్యక్తులను అడిగితే భయం గొలుపుతోంది. నాటి రజాకార్లు సాగించిన అరాచకాలను కళ్లకు కడుతున్నారు.రజాకర్ల సైన్యం గుర్రాల మీద ఊళ్ల వెంట వెళుతుంటే జనం భయం భయంగా తలుపులు వేసుకొని చిన్న చిన్న సందుల్లోంచి చూసేవారు. రజాకార్లు వెళుతున్న సమయంలో ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే వాళ్లను గుర్రాలకు కట్టి ఈడ్చుకెళ్లి పాశవికంగా హత్య చేసేవారు.
అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ తాలూకాలోని ఓ గ్రామం అది.. రజాకర్ల పదఘట్టనలతో మారుమోగుతున్న ప్రాంతం అదీ.. రజాకార్లు గుర్రాలతో వెళుతుంటే కనిపిస్తే చంపేస్తున్న రోజులవీ.. వారు వస్తున్నారంటే గ్రామం గ్రామమంతా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకోవాల్సిందే. అయితే నాడు ఓ ఘటన ఇప్పటికీ ఆ గ్రామంలోని పెద్దలు తలుచుకుంటూనే ఉంటారు. ఆ దారుణాన్ని విషాదంతో వివరిస్తారు. నాడు ఇంట్లో మంచి నీళ్లు అయిపోతే.. బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే ఊరి మధ్యలో ఉన్న ‘ధర్మబావి’ వద్దకు ఓ మహిళ వచ్చింది. బకెట్ తో చేది బిందలో పోసుకొని వెళుతోంది. ఒక అరకిలోమీటర్ దూరంలో ఇల్లు. అప్పుడే రజాకార్లు వచ్చారు. మంచి నీళ్ల కుండ నెత్తిన ఎత్తుకున్న ఓ మహిళను చూశారు.
ఆ రజాకర్లకు ఆ మహిళపై మోజు పుట్టింది. లాక్కెళ్లి అత్యాచారం చేశారు. అడ్డువచ్చిన భర్తను చితకబాదారు. ఎదరిస్తే కత్తితో చంపేశారు. ఇది నిజంగా జరిగిన వాస్తవం. నాటి ఘోరాలపై ఇప్పటికీ గ్రామాల్లో కథలు కథలుగా చెబుతారు.
ప్రజలపై పన్నులు వేసి దోపిడీ చేసి రాజభోగాలు అనుభవించారు నిజాం రాజులు.. తెలంగాణలో పన్నులు చెల్లించని వారిని దారుణంగా హింసించేవారు నిజాం అధికారులు, రజాకర్లు. పన్నులు చెల్లించని వారి గోర్ల కింది మాంసాన్ని కత్తితో కోసి గోర్లు ఊడదీసేవారు. నిజాం పన్నులు మనకు ఊహకు అందనంత అక్రమంగా ఉండేవని చరిత్రకారులు చెబుతారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి నిజాం రాజులు మాత్రం ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా సుఖాలను అనుభవించారు.
భర్తల ముందే భార్యలను అత్యాచారం చేసేవారు. భార్యల ముందే భర్తలను నరికి చంపేవారు. మగవాళ్ల ఆచూకీ చెప్పకపోతే పిల్లలను గాల్లోకి ఎగురవేసి కత్తితో గుచ్చి చంపేవారు. రజాకార్ల మారణహోమాలు తెలంగాణలో అన్నీ ఇన్నీ కావు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా నిజాం క్రూర ప్రభువులు సకల సుఖాలను అనుభవించేవారు. ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవారు. ప్రపంచంలో ఏ ఖరీదైన వాహనం విడుదలైనా.. అది నిజాం వద్ద ఉండాల్సిందే. అతిథులకు అద్భుతమైన భవంతులు, రాచ మర్యాదలు చేసేవారు. బ్రిటీష్ వారిని సకల సుఖాలను అందించేవారు. పేదలు మాత్రం కరువు కాటకాలు, ఆకలితో అలమటించి చచ్చేవారు.
ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకర్లు తెలంగాణలో సాగించిన దమనకాండను తలుచుకుంటే ఇప్పటికీ వెన్నులో వణుకుపుడుతుంది.తెలంగాణ జనం రక్త మాంసాలతోనే ఆ క్రూర నిజం ఇంతటి సంపద పోగేసుకొని రాజభవనాలు కట్టుకున్నాడు. అవిప్పుడు హైదరాబాద్ లో మనకు కనిపిస్తూనే ఉన్నాయి. చివరకు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం.. సర్దార్ పటేల్ ధైర్యంతో హైదరాబాద్ ను విముక్తి చేసి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్య్రాలను ప్రసాదించారు. లేకుంటే తెలంగాణ ఇప్పుడీ ఫలాలు అనుభవించి ఉండేది కాదు. చరిత్రలో తెలంగాణ ప్రజల నరకం ఇప్పటికీ గుర్తిండిపోతోంది.