BJP – Karnataka Election : దేశంలో సార్వత్రిక ఎన్నికలకు పట్టుమని ఏడాది కూడా లేదు. దీంతో అన్ని పార్టీల్లో హీట్ పెరుగుతోంది. పట్టు కోసం ఆరాటపడుతున్నాయి. నిన్నటి వరకూ అట్టడుగున ఉన్న కాంగ్రెస్ గ్రాఫ్ కర్నాటక ఫలితాలతో అమాంతం పెరిగింది. ఇక తిరుగులేదనుకుంటున్న బీజేపీ వైపు అనుమానపు చూపులు ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా అనూహ్య మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వ బాధిత జాబితాలో ఉన్న పార్టీలు ఒకేతాటిపైకి వచ్చే చాన్స్ ఉంది. అటు బీజేపీ ప్రాపకం కోసం ప్రయత్నించిన పార్టీలు సైతం ఆసక్తిని తగ్గించుకుంటున్నాయి. దీంతో నమ్మదగిన మిత్రుల కోసం బీజేపీ అన్వేషణలు ప్రారంభించింది.
కాంగ్రెస్ పవనాలు వీస్తే..
దేశంలో కాంగ్రెస్ పవనాలు ప్రారంభమైతే పరిస్థితి ఏంటి అనే దానిపై బీజేపీ మేధోమథనం చేస్తోంది. ప్రాంతీయ పార్టీల అండతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తోంది. అయితే బీజేపీతో స్నేహం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. స్నేహహస్తం అందిస్తున్న వారు నమ్మదగని వారుగా బీజేపీ భావిస్తోంది. అయితే ఇప్పుడు తప్పకుండా స్నేహం చేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. నిన్నటివరకూ బీజేపీ నీడలో వచ్చేందుకు పావులు కదిపిన పార్టీలు అనూహ్యంగా కదలికలు తగ్గించాయి. ఇప్పుడు బీజేపీ తిరిగి తన కదలికలు ప్రారంభించాల్సి వచ్చింది. ఎవరితో నడిస్తే భవిష్యత్ ఉంటుంది? అని ఆలోచనలు చేయడం మొదలుపెట్టింది.
పరిస్థితి తారుమారు..
నిన్నటివరకూ బీజేపీతో జత కలిసేందుకు చంద్రబాబు ఆరాటపడ్డారు. అటు పవన్ సైతం బీజేపీని కలుపుకొని.. మూడు పార్టీలు కలిసి పోటీచేస్తే అద్భుత విజయాన్ని దక్కించుకోవచ్చని అంచనా వేశారు. ఇద్దరు నాయకులు పొత్తుకు ప్రయత్నించారు. కానీ బీజేపీ నుంచి ఉలుకూ లేదు.. పలుకూ లేదు. నిన్నటిదాకా ఎంపీ సీట్లలో సింహ భాగం అంటే 13 సీట్లను బీజేపీకి ఇస్తామన్న ప్రతిపాదనలు టీడీపీ నుంచి వచ్చాయని టాక్. ఇపుడు అలాంటిది ఉండకపోవచ్చు అంటున్నారు. ఇచ్చిన కాడికే పుచ్చుకోవాలి. ఒక వేళ అంతా చేసినా రేపటి రోజున టీడీపీ ఎంపీ సీట్లు ఎక్కువ గెలుచుకున్నా…2024లో కేంద్రంలో యూపీఏకు అనుకూల పరిస్థితులు ఏర్పడితే చంద్రబాబు అటువైపు దూకుతారని కేంద్ర పెద్దలు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే పరిస్థితి ఉందని విశ్లేషణలున్నాయి.
జగన్ వైపు మొగ్గు..
ఇప్పుడున్న పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి నమ్మదగిన మిత్రుడు ఏపీ సీఎం జగన్ గా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకి కావడమే. కాంగ్రెస్ ను బీజేపీ ఎంత ద్వేషిస్తుందో… జగన్ కూడా అంతే ద్వేషిస్తారు. జగన్ కాంగ్రెస్ వ్యతిరేక స్టాండ్ మారదని బీజేపీ పెద్దలు నమ్ముతున్నారుట. దీంతో ఇపుడు బీజేపీ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయిటీడీపీతో పొత్తు పెట్టుకుని తగ్గి వెళ్లడం, లేకుంటే జగన్ తో తెర వెనక బంధాన్ని కొనసాగించి 2024లో ఆయనకు పూర్తిగా సహకరించి అధికారంలోకి తెచ్చేలా చూసుకోవడం.బీజేపీ పెద్దల ఆలోచనలు బట్టి చూస్తే జగన్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అటు చంద్రబాబు సైతం మునుపటిలా బీజేపీ ప్రాపకం కోసం కాకుండా జనసేనతో ముందుకెళ్లే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది.