NTR Health University Name Change: 2009 తర్వాత ఎన్నడూ టీడీపీకి మద్దతుగా వ్యవహరించని జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తాత కోసం.. ఆయన పెట్టిన పార్టీ కోసం గళమెత్తారు. ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి తొలగించడంపై స్పందించారు. తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలిచారు. చంద్రబాబుతో ఎంత గిచ్చి కయ్యం ఉన్నా సరే జూనియర్ ఎన్టీఆర్ బయటకొచ్చారు. ఈయనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్లంతా ఇప్పుడు ‘ఎన్టీఆర్ పేరు’ తొలగింపుపై పెద్ద యుద్ధమే చేస్తున్నారు. కమ్మ నాయకుల్లో ఎన్ని విభేదాలున్నా.. తమకు గుర్తింపు తెచ్చిన నేత కోసం ఏకమైన తీరు నిజంగా వారి ఐక్యతను చాటి చెబుతోంది. ఈ పరిణామం జగన్ కు వ్యతిరేకంగా మారి.. టీడీపీకి లాభిస్తుందనడంలో ఎలాంటి సందేహాలు లేవు.

విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించిన నాటి నుంచి రాష్ట్రంలో ఒకరకమైన వాతావరణం ఏర్పడింది. అప్పటివరకూ పప్పునిప్పులా ఉండే వ్యక్తులు, వ్యవస్థలు ఒకేతాటిపైకి వస్తున్నారు. ఒకరు పేరు చెబితే మరొకరు అగ్గిమీద గుగ్గిలమైన వారు సైతం ఒకే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ప్రధానంగా కమ్మ సామాజికవర్గం వారు ఒకే గొడుగు కిందకు చేరుతుండడం విశేషం. వాస్తవానికి హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు, కార్యాచరణ, అభివృద్ధి అన్ని దివంగత ఎన్టీఆర్ కృషి ఫలితమే. అందులో నో డౌట్. హెల్త్ యూనివర్సిటీ ఉన్నంతవరకూ ఎన్టీఆర్ పేరును కొనసాగించడమే కరెక్ట్. ఏ సంబంధం లేని వైఎస్సార్ పేరును తగిలించడం వెనుక అయితే జగన్ సర్కారు భారీ స్కెచ్ ఉంది. ఇప్పుడున్న సమస్యలను డైవర్ట్ చేయ్యాలనో.. లేక వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ పేరు ప్రజల్లో ఉండాలన్న అజెండో తెలియదు కానీ.. ఉన్నఫలంగా పేరు మార్పు వెనుక మాత్రం వ్యూహం దాగి ఉందని మాత్రం పొలిటికల్ సర్కిల్ లో అయితే ఒక ప్రచారమైతే ఉంది.
అయితే ఏపీ సీఎం జగన్ ఒకలా అనుకుంటే.. మరోలా కథ నడుస్తోంది. అమరావతి రాజధాని ఇష్యూ, కులముద్ర తదితర కారణాలతో కమ్మ సామాజికవర్గం జగన్ కు దూరమైంది. గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు వల్ల తమ సామాజికవర్గం వారికి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదని భావించిన కమ్మ సామాజికవర్గం వారు జగన్ కు అండగా నిలిచారు. ఆ సామాజికవర్గం ప్రాబల్యమున్న కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వైసీపీ స్వీప్ చేయడం వెనుక కమ్మల దన్ను ఉంది. కానీ జగన్ మాత్రం వారిని రాజకీయ శత్రువులుగా చూడడం ప్రారంభించారు. అమరావతిని కమ్మ రాజధానిగా పేర్కొంటూ సీఎం జగన్ సహా వైసీపీ నేతలు అవమానించారు. దీంతో 70 నుంచి 80 శాతం కమ్మ సామాజికవర్గం వారు జగన్ కు దాదాపు దూరమయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగింపుతో దాదాపు శాశ్వతంగా దూరమయ్యారు. ఇప్పుడు వారంతా తమ ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ ను అపవిత్రం చేశారన్న కసితో ఉన్నారు. ఇన్నాళ్లు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగిన కమ్మ ప్రముఖులు ఇప్పుడు చంద్రబాబు వైపు ఆశగా చూడడం ప్రారంభించారు. రాజకీయంగా ఇది మైనస్ అవుతుందని వైసీపీలో ఉన్న కమ్మ నాయకులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.
కమ్మ సామాజికవర్గంలో ఆర్థిక స్థితిమంతులు ఎక్కువ. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో వ్యవసాయ రంగపై ఆధారపడ్డ కమ్మ సామాజికవర్గం వారు మిగతా రంగాలపై దృష్టిసారించారు. వ్యాపారాలను అలవాటు చేసుకున్నారు. క్రమేపీ ఆర్థికంగా అభివృద్ధి సాధించారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత వారి ప్రభ పెరిగిపోతూ వచ్చింది. అప్పటివరకూ వారు కాంగ్రెస్, వామపక్షాల నీడలో ఉండేవారు. అయితే ఎన్టీఆర్ తన పార్టీపై కమ్మ ముద్ర లేకుండా చూసుకుంటూ వచ్చారు. కమ్మలకంటే బీసీలనే రాజకీయంగా ప్రోత్సహిస్తూ వచ్చారు. అయితే చెట్టు తమ వారిది కావడంతో ఎదగడం ఎలాగో కమ్మలకు తెలుసు. దాని ఫలితమే సినీ, రాజకీయ, పారిశ్రామిక, మీడియా రంగాల్లో కమ్మ సామాజికవర్గం ఒక ఏలుబడి సాగింది. చివరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం కమ్మలను ధ్వేషించలేదు. వారిని తన దరికి చేర్చుకొని రాజకీయాలు చేశారు. కొంత సక్సెస్ అయ్యారు.

అయితే జగన్ వ్యూహమేమిటో కానీ.. తాజాగా ఎన్టీఆర్ పేరు వివాదంతో కమ్మ సామాజికవర్గం వారిని టీడీపీ గూటికి తెచ్చినట్టయ్యింది. చంద్రబాబు ప్రభుత్వం పురపాలక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన తెచ్చిందని నిరసనగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశాఖలో అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. చంద్రబాబు సర్కారును తూలనాడారు. వైసీపీ అధికారంలోకి రాగానే అధికార భాషా సంఘంతో పాటు మరో రెండు కీలక పదవులు దక్కించుకున్నారు. ఇప్పడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంతో అదే జెట్ స్పీడుతో తన పదవులకు రాజీనామా చేశారు. చంద్రబాబుపై కోపంతో ఎన్టీఆర్ కుమార్తె అని చూడకుండా భువనేశ్వరిని తూలనాడిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జగన్ ను వేడుకున్నంత పనిచేశారు. అయితే ప్రస్తుతం రాజకీయ అవసరాల దృష్ట్యా చాలామంది కమ్మ నాయకులు అధికార పార్టీలో కొనసాగుతున్నా..ఎన్నికల నాటికి మాత్రం ఎన్టీఆర్ పేరు తొలగింపు ప్రభావం ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.