Kalvakuntla Kavitha : ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్.. ఈడి కస్టడీకి కవిత.. కేటీఆర్, బీఆర్ఎస్ శ్రేణుల గొడవ.. ఏం జరగనుంది?

కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ కేటీఆర్ నిలదీసిన నేపథ్యంలో.. ఒకానొక సందర్భంలో ఆమె ఇంట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కవిత నివాసం వద్ద సిఆర్పిఎఫ్ బలగాలు భారీగా బందోబస్తు నిర్వహించాయి. అరెస్టు అనంతరం కవిత చెయ్యి ఊపుతూ కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించారు. కచ్చితంగా బయటికి వస్తానని ప్రకటించారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 15, 2024 8:51 pm

Kalvakuntla Kavitha Arrested,

Follow us on

Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వాస్తవానికి వారు సోదాలకు వస్తారని ఎవరూ ఊహించలేదు. గురువారం మధ్యాహ్నం సమయంలో ఢిల్లీ నుంచి ఒకసారిగా 12 మంది అధికారులు సిఆర్పిఎఫ్ భద్రతతో కవిత నివాసం వద్దకు వచ్చారు. సోదాలు ప్రారంభించారు. అనంతరం స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించారు.. కవిత ఇంట్లోకి రాగానే దాదాపు అందరి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్విచ్ ఆఫ్ చేశారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత అరెస్టు చేస్తున్నామని కవితకు నోటీసులు అందించారు. దీంతో ఒక్కసారిగా కవిత షాక్ కు గురయ్యారు. కేటీఆర్, హరీష్ రావు విషయం తెలుసుకుని వారు వెంటనే కవిత నివాసానికి వచ్చారు. కవిత అరెస్టుపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాల్సి రావడంతో.. వారిని అధికారులు లోపలికి అనుమతించారు.

కేటీఆర్ వాగ్వాదం

ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్ దర్యాప్తు సంస్థ అధికారులతో వాగ్వాదానికి దిగారు. “మీరు చేస్తున్నది సరికాదంటూ” ఆగ్రహం వ్యక్తం చేశారు. “న్యాయపరంగా తేల్చుకుంటామని, మీకు సహకరిస్తామని” ఈడి అధికారులతో చెప్పారు. మరోవైపు కవిత అరెస్టుపై భారత రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్, ప్రశాంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈడి కవితను అరెస్టు చేసిన నేపథ్యంలో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై చర్చలు జరిపారు. వాస్తవానికి కవితను అరెస్టు చేస్తారని గులాబీ నాయకులు ఊహించలేదు.. ఇటీవల లిక్కర్ కేసు విషయంలో ఈడి జారీ చేసిన సమన్లను కవిత సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆ కేసు విచారణను మార్చి 19 కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈడి మహిళలను విచారించే క్రమంలో సిఆర్పిసి నిబంధనలు పాటించడం లేదని కవిత ఆరోపించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనపై ఈడి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నది. అయితే ఈ పిటిషన్ పై తీర్పు వచ్చేంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోబోమని ఈడి సుప్రీంకోర్టుకు తెలిపింది. అందుకే సోదాల గురించి తెలిసిన కవిత న్యాయవాది సోమా భరత్ అరెస్టు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచాణను ఈడి పట్టించుకోదా? ఈ సమయంలో ఈ సోదాలు ఎందుకు? అసలు ఆమెను అరెస్టు చేయాల్సిన అవసరం ఎక్కడిదని” సోమా భరత్ అన్నారు.

కవితను అరెస్ట్ చేసిన అనంతరం ఈడి అధికారులు బేగంపేట విమానాశ్రయం నుంచి 8: 45 నిమిషాలకు ప్రత్యేక విమానాన్ని బుక్ చేశారు. అక్కడినుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి.. ప్రత్యేక వాహనంలో తమ కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ వారు ఆమెను తమ కస్టడీలోకి తీసుకుంటారు. అనంతరం మిగతా విచారణ ప్రక్రియ కొనసాగిస్తారు. కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ కేటీఆర్ నిలదీసిన నేపథ్యంలో.. ఒకానొక సందర్భంలో ఆమె ఇంట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కవిత నివాసం వద్ద సిఆర్పిఎఫ్ బలగాలు భారీగా బందోబస్తు నిర్వహించాయి. అరెస్టు అనంతరం కవిత చెయ్యి ఊపుతూ కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించారు. కచ్చితంగా బయటికి వస్తానని ప్రకటించారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.