Kaleshwaram: కాళేశ్వరం కేసీఆర్‌ కొంప ముంచుతుందా..?

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేంద్ర సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక విడుదల చేసింది. ప్రాజెక్టు డిజైన్, క్వాలిటీ, ప్లానింగ్, నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు తేచ్చింది. పిల్లర్‌ కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే మేడిగడ్డ పిల్లర్‌ కుంగినట్లు ధ్రువీకరించింది.

Written By: Raj Shekar, Updated On : November 4, 2023 10:39 am

Kaleshwaram

Follow us on

Kaleshwaram: అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నీ మంచి శకునాలు ఎదురవుతాయనుకుంటున్న కేసీఆర్‌కు.. వరుసగా అపశకునాలు షాక్‌ ఇస్తున్నాయి. ఎలక్షన్‌ రేసులో అందరికంటే ముందు ఉండాలని షెడ్యూల్‌కు ముందే అభ్యర్థులను ప్రకటించారు గులాబీ బాస్‌. తర్వాత మేనిఫెస్టో రిలీస్‌ చేశారు. ప్రచారం రంగంలోనూ దూసుకుపోతున్నారు. పార్టీ పరంగా అంతా బాగానే ఉన్నా.. పరిస్థితులు మాత్రం అందుకు వ్యతిరేకంగా ఎదురవుతున్నాయి. మేనిఫెస్టోను కాంగ్రెస్‌ నుంచి కాపీ కొట్టారన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఇది ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇక తొమ్మిదేళ్ల పాలనపై అసంతృప్తితో ఉన్న తెలంగాణ సమాజం, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను మార్చకపోవడం అసహనం వ్యక్తం చేస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కేసీఆర్, ఆయన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, నేతలు ఏదైతే తమకు బలం అని ప్రచారం చేసుకుంటున్నారో ఇప్పుడు అదే బలహీనంగా మారుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలమైందని, దేశంలో పంజాబ్‌ తర్వాత తెలంగాణలోనే ఎక్కువ ధాన్యం పండుతోందని చెబుతున్నారు. కానీ సరిగ్గా ఎన్నికల వేళ.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగింది. వారంలో అన్నారం బ్యారేజీకి బుంగలు పడ్డాయి. సుందిళ్ల బ్యారేజీకి కూడా ముప్పు ఉందని ప్రాజెక్టు అథారిటీ ప్రకటించింది. దీంతో గులాబీ నేతల్లో టెన్షన్‌ మొదలైంది.

డ్యాం సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక..
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేంద్ర సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక విడుదల చేసింది. ప్రాజెక్టు డిజైన్, క్వాలిటీ, ప్లానింగ్, నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు తేచ్చింది. పిల్లర్‌ కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే మేడిగడ్డ పిల్లర్‌ కుంగినట్లు ధ్రువీకరించింది. ఏడో బ్లాక్‌ పూర్తిగా పునర్నిర్మించాలని సూచించింది. అన్ని పిల్లలర్లు అలాగే ఉంటే మొత్తం ప్రాజెక్టు పునర్నిర్మాణం చేయాలని ఆదేశించింది. అప్పటి వరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు నిలుపొద్దని స్పష్టం చేసింది. డ్యామ్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడిందని అభిప్రాయపడింది. బ్యారేజీ వైఫల్యం ప్రజల జీవితాలకూ, ఆర్థిక వ్యవస్థకూ తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉందన్న అథార్టీం సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు బ్యారేజీ మొత్తం ఉపయోగించే అవకాశం లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఇందులో కొట్టొచ్చినట్లు కనబడుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ప్రతిపక్షాలకు అస్త్రం..
డ్యామ్‌ సేఫ్టీ అథారిటి ఇచ్చిన ఈ నివేదిక..ఇప్పుడు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలంతా బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఈ ప్రపంచంలో ఏ నాయకుడూ చేయనంత గొప్పపని చేసినట్లుగా బిల్డప్‌ ఇచ్చిన కేసీఆర్‌.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రగల్భాలు పలికిన బీఆర్‌ఎస్‌ నాయకులంతా.. ఇప్పుడెందుకు సైలెంట్‌గా ఉన్నారని ముప్పేట మాటల దాడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో.. ఇదే అంశంపై బీఆర్‌ఎస్‌ సర్కాను ఇరుకున పెడుతున్నాయి. ముఖ్యంగా రాహుల్‌ గాంధీ.. కాళేశ్వరం అంశాన్ని క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టును సందర్శించి కేసీఆర్‌కు ఏటీఎంలా కాళేశ్వరం మారిందని ఆరోపించారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బండి సంజయ్‌ కూడా డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదికపై స్పందిస్తూ.. కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతున్నారు. కాళేశ్వరం మహా అద్భుతం అంటూ డిస్కవరీ ఛానెల్‌ డాక్యుమెంటరీ ప్రసారం చేసిందని..ఇప్పుడు లోపాలు బయటపడుతుండడంతో పరువు పోతుందని.. డాక్యుమెంటరీని తొలగించానని కిషన్‌రెడ్డి సెటైర్లు వేశారు. కమిషన్ల కక్కుర్తికి పంప్‌ హౌజ్‌లే కాదు.. ఏకంగా బరాజ్‌లే కుంగిపోతున్నాయని షర్మిల సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. వేల పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకునే కేసీఆర్‌.. ఇంజినీరింగ్‌ పుస్తకాలు చదవలేదా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మారుతున్న ఎన్నికల ముఖచిత్రం..
డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన ఈ నివేదిక.. ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై అన్ని పార్టీల ఎన్నికల ప్రచారం కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంగానే హీటెక్కే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్‌ పనితీరుకు కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలే నిదర్శమని.. మళ్లీ గెలిపిస్తే రాష్ట్రాన్నే అమ్మేస్తారనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసేకుళ్లేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టును తమ గొప్పతనంగా చెప్పుకున్న బీఆర్‌ఎస్‌..ఇప్పుడు డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదికపై ఎలా స్పందిస్తున్నదని ఆసక్తిగా మారింది. ఎంత కవర్‌ చేసుకునేందుకు ప్రయత్నించినా.. బీఆర్‌ఎస్‌కు ఇది పెద్ద ఎదురు దెబ్బకానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.