K.Viswanath: కే విశ్వనాథ్ ఆలోచలనల్లో పుట్టిన ప్రతి సినిమా ఓ కళాఖండం. వాటిలో మొదటి వరుసలో ఉంటుంది శంకరాభరణం. సోమయాజులు, మంజుభార్గవి ప్రధాన పాత్రలు చేసిన శంకరాభరణం కళామతల్లి మెడలో హారం లాంటి సినిమా. మధ్య వయస్కుడైన ఒక సంగీత విద్వాంసుడికి దేవదాసికి మధ్య నడిచే ప్రేమ కావ్యం. కేవలం ఆలోచనల్లో మాత్రమే నడిచే ఆరాధనా భావం. మ్యూజిక్, ఎమోషన్స్ ప్రధానంగా కే విశ్వనాథ్ శంకరాభరణం చిత్రాన్ని తెరకెక్కించారు. సోమయాజులు వంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోగా సినిమా చేయడం పెద్ద సాహసం. కళా హృదయం కలిగిన నిర్మాతలు విశ్వనాథ్ ఆలోచనలను గౌరవించి నిర్మించేందుకు ముందుకు వచ్చారు.

స్టార్ క్యాస్ట్ లేని శంకరాభరణం సినిమాపై ఎవరికీ అంచనాలు లేవు. చెప్పాలంటే ఆసక్తి కూడా లేదు. కేవలం ఉదయం ఆట మాత్రమే ప్రదర్శించేవారు. ప్రేక్షకుల మౌత్ టాక్ మెల్లగా పాకింది. అది దావానంలా వ్యాపించి సినిమా ప్రియులను థియేటర్స్ వైపు పరుగులు తీసేలా చేసింది. పరిమిత థియేటర్స్ లో ఒక షోగా మొదలైన శంకరాభరణం రోజుకు నాలుగు షోలు అయ్యింది. సెంటర్స్ పెరుగుతూ పోయాయి. సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు జరుపుకుంది. జనాల్లో నిద్రాణంగా ఉన్న కళా హృదయాలను తట్టిలేపింది.
అద్భుత విజయం నమోదు చేసింది. శంకరాభరణం అనేక అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించబడింది. గౌరవాలు అందుకుంది. ఫ్రాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించడంతో పాటు అవార్డు దక్కింది. 2013 ఫోర్బ్స్ సెంచరీ ఆఫ్ ఇండియా సినిమా 25 గ్రేటెస్ట్ పెరఫార్మన్సులలో సోమయాజులు పేరు కూడా ఉంది. ఏకంగా నాలుగు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. 7 నంది అవార్డులు వచ్చాయి.
1982 ఫిబ్రవరి 2న శంకరాభరణం విడుదలైంది. అదే రోజు ఆయన కన్నుమూశారు. కే విశ్వనాథ్ గారు గొప్ప శివభక్తులు కావడం మరో విశేషం. ఆయన తెరకెక్కించిన చిత్ర రాజం శంకరాభరణం విడుదల రోజే ఆయన కన్నుమూయడం దైవేచ్ఛ అనుకోవచ్చు. శంకరాభరణం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోజే ఆయన శివైక్యం అయ్యారు. 92 ఏళ్ల కే విశ్వనాథ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్నేళ్లుగా ఆయన ఇంటికే పరిమితం అవుతున్నారు. నిన్న ఆయన ఆరోగ్యం విషమించడంతో అపోలో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.