Viswanath Passed Away: తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ కే విశ్వనాథ్ ఇకలేరు. ఆయన గురువారం రాత్రి కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న కే విశ్వనాథ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కే విశ్వనాథ్ వయసు 92 సంవత్సరాలు. వయో సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. కొన్నేళ్లుగా ఆయన ఇంటికే పరిమితం అవుతున్నారు. 1930 ఫిబ్రవరి 19న కే విశ్వనాథ్ గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. గుంటూరు హిందూ కాలేజ్ లో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. సినిమాపై మక్కువతో మద్రాసు వెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. లెజెండరీ డైరెక్టర్ కె వి రెడ్డి అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.

1965లో విడుదలైన ఆత్మగౌరవం చిత్రంతో దర్శకుడిగా మారారు. ఏఎన్నార్ ఆ చిత్ర హీరో. మొదటి చిత్రంతోనే నంది అవార్డు అందుకున్నారు. వరుసగా సాంఘిక చిత్రాలు తెరకెక్కించారు. దర్శకుడిగా నిలదొక్కుకున్న అనంతరం తన కళాత్మక హృదయాన్ని బయటకు తీశారు. లలిత కళలకు తన చిత్రాలతో ప్రాచుర్యం తెచ్చారు. మ్యూజిక్, డాన్స్, సింగింగ్, రైటింగ్ వంటి ఆర్ట్స్ ని కథా వస్తువులుగా తీసుకొని సినిమాలు తీశారు.
తెలుగు సినిమా గురించి ఇతర భాషల వారికే తెలియని రోజుల్లో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. కే విశ్వనాథ్ తెరకెక్కించిన శంకరాభరణం, సాగరసంగమం, సిరివెన్నెల పలు ప్రపంచ సినిమా వేదికలపై ప్రదర్శించారు. సినిమాను కళగా నమ్మిన ఏకైన దర్శకుడాయన. కమర్షియల్ సినిమాలు రాజ్యం ఏలుతున్న రోజుల్లో ఆర్ట్ మూవీస్ తీసి సక్సెస్ అయ్యారు. నటుడిగా కూడా ఆయన రాణించారు. దాదాపు నలభై చిత్రాల్లో ఆయన నటించారు. గత ఏడాది విడుదలైన కన్నడ చిత్రం ఒప్పండ చివరి చిత్రం. తుదిశ్వాస వరకు ఆయన సినిమాకు అంకితమయ్యారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా 1992లో పద్మభూషణ్ తో సత్కరించారు. 2016లో దాదాసాహెబ్ పాల్కే అవార్డుతో గౌరవించారు.

కే విశ్వనాథ్ వంటి దర్శకుడు మరలా పుట్టడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఓ అరుదైన స్వాతిముత్యం. కే విశ్వనాథ్ మృతిపై చిత్ర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం తీరని లోటుగా అభివర్ణిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.