Journalism: *జర్నలిజంలో ఓ పాడు సామెత ఉంది. ‘అది జర్నలిస్టులు చెప్పేందుకే సూక్తులు కానీ పాటించడానికి ఉండదు’ అని.. యాజమాన్యాల కబంధ హస్తాల్లో చిక్కీ శల్యమై చాలీచాలని జీతాలతో పోరాడుతూ ఓవైపు సమాజాన్ని ఉద్దరించేలా రాతలు రాసే ఘనత జర్నలిస్టులదీ.. పైకి ఎన్నో హితబోధలు చేసే వీరు తమ జీతం, జీవితం విషయంలో పత్రికా యాజమాన్యాలను గట్టిగా అడగలేని పరిస్థితి. అందుకే జర్నలిజం కాడిని అందరూ వదిలేస్తున్నారు.*

జర్నలిజంలో సంక్షోభం మొదలైందా.. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలకు కొమ్ముకాస్తున్న పత్రికల యాజమాన్యాల సారథ్యంలో పనిచేయడానికి జర్నలిస్టులు ఇష్టపడడం లేదా..? కొంతమంది ధైర్యంగా వాస్తవాలను రాసినా ఇబ్బందులు తప్పడం లేదా..? దీంతో జర్నలిజానికే గుడ్‌బై చెప్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాము చదువుకున్న, నేర్చుకున్న జర్నలిజం విలువలు అధికార పార్టీలు, పాలకుల కబంధహస్తాల్లో బందీ కావాల్సిన, తాకట్టు పెట్టాల్సిన పరిస్థితిలో నిజమైన జర్నలిస్టుల వృత్తికి న్యాయం చేయలేకపోతున్నారు. అన్యాయం చేయలేక వృత్తికే దూరమవుతున్నారు. కొంతమంది మనసు చంపుకుని విలువలు వదులుకుని కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితిలో పాలకుల భజన చేస్తున్నారు. యాజమాన్యాలు చెప్పినట్లు నడుచుకుంటున్నారు. ఇంకొందరు అధికార పక్షం దాడులు, కేసులకు భయపడి వాస్తవాన్ని బయటకు తేవడం లేదు. ఇక యాజమాన్యాలు పాలకులు ఇచ్చే అడ్వర్టయిజ్‌మెంట్లు, ఎన్నికల వేళ ఇచ్చే పెయిడ్ ఆర్టికల్స్, ఇతరత్రా పనుల కోసం పాలకులకు వ్యతిరేకంగా పనిచేయడం లేదు. వాస్తవాలను తొక్కిపెడుతున్నాయి.
-పనిచేయలేక..
అధికార పార్టీలకు, పాలకులకు కొమ్ముకాస్తూ యాజమాన్యాల వద్ద పనిచేయడానికి చాలామంది జర్నలిస్టులు ఇష్టపడడం లేదు. ఇన్నాళ్లూ కొంతమంది పనిచేసినా ఇప్పుడు బయటకు వస్తున్నారు. కలాన్నైనా వదిలేస్తాం కానీ మనసు చంపుకుని పనిచేయలేమని పేర్కొంటున్నారు. మనసు చంపుకుని పాలకులకు సపోర్టుగా కథనాలు రాసినా తమ అంతరాత్మ ఎదుట దోషిలా నిలబడుతున్నామన్న అభిప్రపాయం జర్నలిస్టుల్లో వ్యక్తమవుతోంది.
-కూలీల కన్నా అధ్వానంగా..
ప్రజాస్వామ్యానికి మూలస్తంభం జర్నలిజం. కానీ నేడు రోజుకూలీ కన్నా అధ్వానంగా మారింది. రోజు కూలీకి కూడా కనీస వేతనం వస్తున్న వేళ.. జర్నలిస్టుల వేతనాలు అంతకన్నా అధ్నానంగా ఉన్నాయి. నమ్ముకున్న వృత్తి కూడు పెట్టని పరిస్థితి నెలకొంటోంది. పైగా మనసు చంపుకుని పనిచేయాల్సిన పరిస్థితి.. ఒకప్పుడు జర్నలిజానికి ఉన్న గౌరవం ఇప్పుడు సమాజంలో కరువైంది. పాలకులు, యాజమాన్యాల తీరుతో జర్నలిస్టు అనేవాడి కనీస విలువ కూడా లేకుండా పోతోంది.
-అధికార గడీల్లో కలం బందీ..
ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటి జర్నలిజం మారిన సరిస్థితుల నేపథ్యంలో అధికారం ఉన్నవారి గడీల్లో బందీ అవుతోంది. అయినా.. కొంతమంది పాలకులు అడపా దడపా తమకు వ్యతిరేకంగా వచ్చే కథనలను సహించలేకపోతున్నారు. జర్నలిస్టులపై కేసులు పెట్టిస్తున్నారు. పోలీసులతో వేధిస్తున్నారు. దీంతో జర్నలిస్టుల కుటుంబాల్లో కూడా వృత్తిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మనసు చంపుకుని పనిచేసేకన్నా.. వేరేపని చేసుకోవడం ఉత్తమమన్న భావన, అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో చాలామంది వృత్తిని వదిలేస్తున్నారు.

-కొత్తవారిలో అనాసక్తి..
ప్రస్తుత రాజకీయాలను, పత్రికా యాజమాన్యాల తీరును గమనిస్తున్న యువత జర్నలిజంపై ఆసక్తి ఉన్నా.. అటువైపు రావడానికి భయపడుతున్నారు. నాటి గౌరవం నేడు లేకపోవడం.. కలం స్వేచ్ఛ అధికారం ఉన్నవారి చేతిలో బందీకావడం, యాజమాన్యాలు పాలకులకు తొత్తుగా మారుతున్న తీరుతో యువ జర్నలిస్టులు ఈరంగంలో అడుగు పెట్టడానికి భయపడుతున్నారు.. విచిత్రం ఏమిటంటే.. జర్నలిజం గురించి ఏమీ తెలియని నేతలు జర్నలిస్టులకే పాఠాలు చెప్పడం. మీడియా సమావేశం అని పిలిపించుకుని ఏలా రాయాలి.. ఎలా ప్రజెంట్ చేయాలని సూచనలు చేస్తున్నారు. దీంతో జర్నలిజం అంటేనే అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడుతోంది.. ఈ తరుణంలో కొత్త రైటర్లు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగుతూ పోతే భవిష్యత్తులో జర్నలిస్టులు, రైటర్ల కొరత తప్పదన్న అభిప్రాయం మీడియారంగంలో, యాజమాన్యాల్లో వ్యక్తమవుతోంది. పాలకుల చేతి నుంచి మీడియాకు స్వేచ్ఛ లభిస్తేనే ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన జర్నలిజం మనగలుగుతుందనేది వాస్తవం..