BRS vs Congress : బీఆర్ఎస్ లో నిస్తేజం.. కాంగ్రెస్ లో ఉత్తేజం.. ఈ చేరికల వెనక మర్మమేమిటీ?

ప్రజల్లోకి వెళ్లి వారి నమ్మకాన్ని పొందే వారికి కచ్చితంగా గౌరవం ఇస్తానని మొహమాటం లేకుండా చెబుతున్నారు. వారికి నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Written By: Bhaskar, Updated On : July 19, 2023 9:52 pm
Follow us on

BRS vs Congress : కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత ఒక్కసారిగా తెలంగాణలో పరిస్థితి మారిపోయింది. ఇప్పటిదాకా భారత రాష్ట్ర సమితితో పోరాడిన భారతీయ జనతా పార్టీ తన స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించింది. అప్పటినుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ తన మార్క్ రాజకీయాలు వదిలిపెట్టి రేవంత్ రెడ్డి బాటలో నడుస్తోంది. వ్యక్తిగత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే ఆ పార్టీలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు అవుతుండడంతో కొత్త ఉత్తేజంతో పని చేస్తోంది. అంతేకాదు ఇన్నాళ్లు తనను ఇబ్బంది పెట్టిన భారత రాష్ట్ర సమితిపై ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నది. గత కాలపు పగను వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తున్నది. కేటీఆర్ నుంచి గల్లి స్థాయి లీడర్ వరకు ప్రస్తుతం రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ జపం చేస్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది చాలదన్నట్టు అధికార భారత రాష్ట్రానికి చేరికల రూపంలో కాంగ్రెస్ పార్టీ షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. మొన్ననే భారత రాష్ట్ర సమితి కంభం పార్లమెంటు మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తన పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు తాజాగా మరి కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులను చేర్చుకొని ఎన్నికలకు ముందు కెసిఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తోంది.

ఏం భరోసా ఇచ్చారు

మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితిలో పదవులు అనుభవించిన వారు మొత్తం ఇప్పుడు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూస్తున్నారు? పదవుల్లో ఉన్నవారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని ఎందుకు అనుకుంటున్నారు? వాస్తవానికి గత కొంతకాలంగా భారత రాష్ట్ర సమితిలో వ్యక్తి స్వామ్యం పెరిగిపోయింది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రతి చిన్న పనికి కూడా ప్రగతి భవన్ లేదా కేటీఆర్ వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. పైగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పెద్దల పెత్తనం ఎక్కువ కావడం సాధారణంగానే ఎమ్మెల్యేలకు రుచించడం లేదు. కొంతమంది సీనియర్ నాయకులకు అనుకున్నంత స్థాయిలో గౌరవం దక్కడం లేదు. పైగా చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేని దుస్థితి తలెత్తడంతో వారు నారాజ్ అవుతున్నారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ ఒకింత బలంగా కనిపిస్తుండడంతో వారంతా కూడా అందులో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పైగా కేసీఆర్ మీద పోరాటంలో రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తుండడంతో చాలామంది ఆయన నాయకత్వం మీద నమ్మకం పెంచుకుంటున్నారు. ఇదే సమయంలో తనను కలిసిన వారికి రేవంత్ రెడ్డి ఖచ్చితమైన భరోసా ఇస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి వారి నమ్మకాన్ని పొందే వారికి కచ్చితంగా గౌరవం ఇస్తానని మొహమాటం లేకుండా చెబుతున్నారు. వారికి నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

చేరికల మీద చేరికలు

కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిన తర్వాత మరిన్ని చేరికలు ఉంటాయని ఆరోజు ఖమ్మం వేదిక మీదనుంచే రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో బిజెపి మాదిరి కాకుండా ప్రకడ్బందీగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇవి దాదాపుగా సఫలీకృతం అవుతున్నాయి. తాజాగా గురువారం మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హస్తం కండువా కప్పుకొనున్నారు. ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వారిద్దరి చేరికలకు సంబంధించి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. విరుద్ధతోపాటు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత, మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా గులాబీ కండువా వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ చేరికలకు సంబంధించి ఇంతవరకు ఆ నేతల నోటి వెంట నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అయితే వీరి చేరికలకు సంబంధించి బుధవారం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో చాలా సేపు మంతనాలు జరిపారు.

పొసగకపోవడం వల్లేనా

తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక చాలా పెద్ద కథ ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మహేశ్వరం నియోజకవర్గం లో కృష్ణారెడ్డి మీద 2018లో సబితా ఇంద్రారెడ్డి గెలిచారు. తర్వాత ఆమె భారత రాష్ట్ర సమితిలో చేరారు. అయితే ఈసారి టికెట్ ఆమెకే దక్కుతుందని భావించిన కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారని ప్రచారం జరుగుతోంది.. తనతో పాటు కోడలు అనితారెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు కృష్ణారెడ్డి మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో అనిత రెడ్డి భారత రాష్ట్ర సమితి జెడ్పిటిసి సభ్యులతో కలిసి గోవా పర్యటనకు వెళ్లారు. ఆమె కాంగ్రెస్లో చేరుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై ఆమెను ప్రశ్నించినప్పుడు తాను భారత రాష్ట్ర సమితిలోనే ఉంటానని తెలిపారు. తన మామ కృష్ణారెడ్డి గురించి తెలియదని ప్రకటించారు.

ఇక ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తో పాటు భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత, గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి, ఖర్గే సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వల్ల తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటి గురించి పార్టీ పెద్దలకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత అంటున్నారు. అందుకే తాను పార్టీ మారుతున్నానని ప్రకటించారు. కేవలం తాము మాత్రమే కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆమె చెబుతున్నారు.